కూల్‌ డ్రింక్స్‌ వద్దు

ABN , First Publish Date - 2023-10-02T23:42:06+05:30 IST

తీయగా, చల్లగా ఉండే కూల్‌ డ్రింక్‌ను అందరూ ఇష్టపడతారు. కానీ వీటిలో ఆరోగ్యాన్ని నష్టపరిచే విషపూరిత రసాయనాలు, హానికారక కృత్రిమ రంగులు ఉంటాయి...

కూల్‌ డ్రింక్స్‌ వద్దు

తీయగా, చల్లగా ఉండే కూల్‌ డ్రింక్‌ను అందరూ ఇష్టపడతారు. కానీ వీటిలో ఆరోగ్యాన్ని నష్టపరిచే విషపూరిత రసాయనాలు, హానికారక కృత్రిమ రంగులు ఉంటాయి. వాటితో కలిగే ఆరోగ్య నష్టాల గురించి తెలుసుకుందాం!

ఉబ్బసం: శీతలపానీయాల్లో వాడే సోడియం బెంజాయేట్‌ అనే నిల్వ పదార్థం కారణంగా ఉబ్బసం వ్యాధి తలెత్తుతుంది. ఈ రసాయనం ఇతర ఆహారంతో కలిసినప్పుడు వాటిలోని పొటాషియం శరీరం శోషించుకోకుండా అడ్డుపడుతుంది. అలాగే ఈ రసాయంన లాలాజలం, పొట్టలోని ఆమ్లాలతో కలిసినప్పుడు ఇది ప్రమాదకర ఆమ్లంగా మారుతుంది. నోటితోపాటు దంతాలు కూడా ఈ రసాయనం ప్రభావానికి లోనవుతాయి. దంతాల పైపొర కరిగి, అన్నవాహిక దెబ్బతింటుంది. అదే పనిగా శీతలపానీయాలు తాగే అలవాటు ఉన్నవారికి దంతాలు అరిగిపోయి, బలహీనపడి తేలికగా చిట్లిపోతూ ఉంటాయి. అసిడిటీ వేధిస్తూ ఉంటుంది. ఎక్కువ మోతాదుల్లో చక్కెర ఉండడం మూలంగా స్థూలకాయం, తద్వారా మధుమేహం, హృద్రోగాలు సంక్రమిస్తాయి.

హృద్రోగాలు: శీతలపానీయాల్లో ఫ్రక్టోజ్‌ అనే చక్కెర ఉంటుంది. దీని వల్ల శరీరం శక్తిని ఖర్చుచేసే క్రమం (మెటబాలిక్‌ డిజార్డర్‌)లో అవకతవకలు తలెత్తుతాయి. ఫలితంగా హృద్రోగాలు తలెత్తుతాయి. శీతల పానీయాల్లో ఉండే అధిక చక్కెర వల్ల తాగిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోతాయి. రక్తపోటు పెరుగుతుంది. కాలేయం ఎక్కువ మొత్లాల్లో చక్కెరను రక్తంలోకి విడుదల చేయడంతో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది.

మూత్రపిండాల సమస్యలు: శీతలపానీయాల్లోని ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ జీర్ణవ్యవస్థను కుదేలు చేసి, సంబంధిత అవయవాలన్నిటినీ అనారోగ్యానికి గురి చేస్తుంది. ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ పరిమాణం పెరగడం మూలంగా మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా మూత్రసంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి.

పునరుత్పత్తి సమస్యలు: శీతలపానీయాల క్యాన్‌లలో రెసిన్‌ ఉంటుంది. ఇది ఆ డబ్బాలకు చక్కని మెరుపునిస్తుంది. ఈ రెసిన్‌ బైఫినైల్‌ఎ, అనే కేన్సర్‌ కారక ఏజెంట్‌. దీని వల్ల అంతఃస్రావవ్యవస్థ దెబ్బతిని పునరుత్పత్తి వ్యవస్థ పాడై, నెలలు నిండకుండా ప్రసవాలు జరిగే ప్రమాదం ఉంటుంది.

ఎముకలు గుల్లబారడం: శీతలపానీయాలు తాగినప్పుడు విసర్జించే మూత్రంలో ఫాస్ఫారిక్‌ యాసిడ్‌తోపాటు క్యాల్షియం కూడా ఉంటుంది. ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకునే క్యాల్షియం శోషణ జరగకుండా ఇలా మూత్రంలో బయటకు వెళ్లిపోవడం మూలంగా ఎముకలకు సరిపడా క్యాల్షియం అందక గుల్లబారిపోయి ‘ఆస్టియోపొరోసిస్‌’ సమస్య తలెత్తుతుంది.

స్థూలకాయం: సోడా, శీతలపానీయాలు తాగేవారు స్థూలకాయులయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకే ఒక్క సోడా తాగడం వల్ల కూడా శరీర బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో రుజువైంది.

కాలేయంలో కొవ్వు: గ్లూకోజ్‌ను శరీరంలోని ప్రతి కణం శక్తిగా మార్చు కోగలుగుతుంది. కానీ శీతలపానీయాల్లో ఉండే చక్కెర రూపం ఫ్రక్టోజ్‌. దీన్ని శరీర కణాలు శక్తిగా మార్చుకోలేవు. దాంతో ఆ బాధ్యత కాలేయం తీసుకుంటుంది. అదే పనిగా శీతల పానీయాలు తాగడం వల్ల కాలేయం మీద ఒత్తిడి పెరిగి, ఫ్రక్టోజ్‌ కొవ్వుగా కాలేయంలో నిల్వ ఉండిపోతుంది. దీన్లో కొంత ట్రైగ్లిజరైడ్స్‌ రూపంలో రక్తంలో కలిస్తే, ఎక్కువశాతం కాలేయంలో కొవ్వుగానే నిల్వ ఉండిపోతుంది. ఇలా దీర్ఘకాలంపాటు జరిగితే ఇదే కొవ్వు కారణంగా ‘నాన్‌ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ సంక్రమిస్తుంది. ఇది ప్రమాదకరం.

పొట్టలో కొవ్వు: పొట్టలోని అవయవాలు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకునే స్థితి శీతలపానీయాల సేవనంతో సంక్రమిస్తుంది. పొట్ట దగ్గర విపరీతమైన కొవ్వు టైప్‌2 మధుమేహానికి దారితీస్తుంది.

వ్యసనం: చక్కెర వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. తీపి తినడం వల్ల మెదడులో డోపమైన అనే ఆనందానికి కారణమయ్యే హార్మోన్‌ విడుదలవడం మూలంగా పదే పదే తీపి మీదకు మనసు మళ్లుతుంది. శీతలపానీయాల సేవనంతో జరిగేది ఇదే! అలవాటు చేసుకుంటే, దాన్నుంచి బయట పడడం కష్టం. చక్కెరకు మెదడు అలవాటు పడడం మూలంగా ఏ పని చేయాలన్నా ముందు శీతలపానీయం తాగాలని అనిపిస్తూ ఉంటుంది.

కీళ్లవాతం: కీళ్లు, మరీ ముఖ్యంగా పాదాల్లోని బొటనవేలి కీళ్లు వాచి, నొప్పితో వేధించే సమస్య ‘గౌట్‌’. రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరిగిపోయి అవి స్ఫటికాలుగా తయారయ్యే స్థితి ఇది. ఈ స్ఫటికాలు కీళ్ల మధ్య పేరుకుని కీళ్లను బాధిస్తాయి. శీతలపానీయాల్లోని ఫ్రక్టోజ్‌ రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ నిల్వలు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈపానీయాలు తాగడం మూలంగా గౌట్‌కు గురయ్యే అవకాశాలు పురుషుల్లో 75,మహిళల్లో 50ు పెరుగుతాయని పరిశోధనల్లో రుజువైంది.

మతిమరుపు: వృద్ధుల్లో మెదడు పనితీరు తగ్గడమే డిమెన్షియా! ఈ వ్యాధి మూలంగా మతిమరుపు తలెత్తుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరగడం మూలంగా కూడా ఈ వ్యాధి తలెత్తుతుందని పరిశోధకులు కనుగొన్నారు. చక్కెరతో తయారైన పానీయాలు తాగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్నపళాన పెరిగిపోవడంతో ఆ ప్రభావం మెదడు కణాలైన న్యూరాన్లపై కూడా పడుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు జరిగితే, వృద్ధాప్య దశలో డిమెన్షియాకు లోనవుతారు.

5.jpg

ప్రత్యామ్నాయాలు ప్రయత్నించాలి!

దాహం తీర్చుకోవడానికి అవసరమైనవి నీళ్లు. నీటికి బదులుగా మరే పానీయం తాగాలనుకున్నా, శీతలపానీయాలకు బదులు పళ్లరసాలు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటి వాటిని ఎంచుకోవచ్చు. కొబ్బరినీరుతో దాహం తీరడంతోపాటు విలువైన ఖనిజలవణాలు దక్కుతాయి. పళ్లరసాలు తాగడం వల్ల అమూల్యమైన విటమిన్లు శరీరానికి అందుతాయి. మజ్జిగ ఇంట్లోనే తయారుచేసుకోగల చవకైన పానీయం. చలువు చేస్తుంది. నిమ్మరసం తయారుచేసుకోవడమూ తేలికే! ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు శీతలపానీయాలనే ఎంచుకోవడం మానేయాలి. మిగతా ప్రత్యామ్నాయ పానీయాలతో పోలిస్తే శీతల పానీయాల్లో ఖనిజలవణాలు, విటమిన్లు, ఇతర పోషకాలు సూన్యం. దీన్లో చక్కెర తప్ప ఆరోగ్యానికి మేలు కలిగించే మరే ఇతర పోషకాలూ ఉండవు.

Updated Date - 2023-10-02T23:42:06+05:30 IST