OnePlus 5G router : వన్‌ప్లస్ 5జీ రౌటర్
ABN , First Publish Date - 2023-02-10T23:51:18+05:30 IST
వన్‌ప్లస్ గ్యాడ్జెస్ మార్కెట్లో ఇటీవలి కాలంలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ముగిసిన క్లౌడ్ 11 లాంచ్‌లో రెండు స్మార్ట్ ఫోన్లు, రెండు ఇయర్‌బడ్స్, స్మార్ట్ టీవీలను విడుదల చేసింది.
వన్‌ప్లస్ గ్యాడ్జెస్ మార్కెట్లో ఇటీవలి కాలంలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ముగిసిన క్లౌడ్ 11 లాంచ్‌లో రెండు స్మార్ట్ ఫోన్లు, రెండు ఇయర్‌బడ్స్, స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. అదే సందర్భంలో మొట్టమొదటిసారి వన్‌ప్లస్ హబ్ 5జి రౌటర్‌ను ప్రకటించింది. అయితే ఇండియాలో విడుదలైన తొలి హబ్ రౌటర్ ఇదే మాత్రం కాదు. అలాగే జియోకు చెందిన రౌటర్‌ను ప్రకటించినప్పటికీ అది ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. వన్‌ప్లస్ రౌటర్ ఈ జూలైలో విడుదల కావచ్చని అనుకుంటున్నారు. జియో ఎయిర్‌ఫైబర్ రౌటర్‌కు పోటీగా ఈ ప్రొడక్ట్ ఉంటుందని కూడా భావిస్తున్నారు.
వన్‌ప్లస్ రౌటర్ విషయానికి వస్తే వైఫై 6 కనెక్టివిటీ ఉంటుంది. అంటే 5జీ, 4జీ సిమ్‌కార్డులకు ఇది ఉపయోగపడుతుంది. మేటర్ ప్రొటోకాల్‌తో హోమ్ హబ్‌కు సపోర్టు ఇస్తుంది. హోమ్ మెస్ నెట్‌వర్క్ అంటే రెండు లేదా అంతకుమించి రౌటర్లను ఒకే నెట్‌వర్క్‌పై కనెక్ట్ చేయగలుగుతుంది. 4జీ, 5జీ, వైఫై నెట్‌వర్క్ కార్యకలాపాల కోసం ఈ రౌటర్‌లో లెడ్ ఇండికేటర్లు ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులను మనదేశంలో ఇప్పటికే ఆరంభించాయి. అయితే అవి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకే పరిమితమై ఉన్నాయి. అవసరమైన రౌటర్లు మాత్రం ఇంకా లేవు. ఈ ఏడాది చివరి నుంచి రౌటర్లు కూడా పెరుగుతాయని అనుకుంటున్నారు.
వన్‌ప్లస్ ఫీచరింగ్ కీబోర్డ్
వన్‌ప్లస్ మొట్టమొదటి సారి మెకానికల్ కీబోర్డ్ ‘వన్‌ప్లస్ ఫీచరింగ్ కీబోర్డ్ 81ప్రొ’ని విడుదల చేసింది. అల్యూమినియంతో రూపొందించిన ఈ కీబోర్డులో కీ క్యాప్స్‌ను మార్చుకునే వీలుంది. అలాగే మరిన్ని సంస్థలతో పనిచేసేందుకు కూడా వన్‌ప్లస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మేక్ ఓఎస్ కోసం లేఔట్‌ను క్రియేట్ చేసేందుకు కీబోర్డ్ ఉత్పత్తిదారు ‘కీచ్రాన్’తో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. వన్‌ప్లస్‌కు చెందిన కీ బోర్డు వైట్, రెడ్ యాక్సెంట్‌కు తోడు సీఎన్‌సీ మెషిన్డ్ అల్యూమినియమ్ కేసింగ్, నాబ్ తదితరాలు ఉంటాయి. ముందే పేర్కొన్నట్టు కీ కేప్స్‌ను తీసి మరొకటి పెట్టుకునేందుకు వీలుగా ఉంటాయి. వాటిని మార్బుల్-మెలో కీకాప్స్ అని కంపెనీ చెబుతోంది. వింటర్ బోనఫైర్, సమ్మర్ బ్రీజ్ పేరిట రెండు స్విచ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ మెకానికల్ కీబోర్డ్‌కు ఆర్‌జీబీ లైటింగ్ ఉంది. బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ కనెక్టివిటీని ఆఫర్ చేస్తోంది. 400 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ ఉంది. ఆర్‌జీబీ ఆన్‌లో ఉన్నప్పుడు వంద గంటల సేపు పనిచేస్తుంది.