Sunita Devi : ‘రాణీ’ మేస్త్రి

ABN , First Publish Date - 2023-08-08T23:46:33+05:30 IST

‘‘మహిళల ఆత్మగౌరవం కోసం మా గ్రామ స్థాయిలో నేను చేసిన చిన్న ప్రయత్నం ఇంత ప్రభావం చూపిస్తుందనీ, ఎంతోమందికి ఉపాధిగా మారుతుందనీ అస్సలు ఊహించలేదు’’ అంటారు సునీతాదేవి. జార్ఖండ్‌కు చెందిన ఆమె ప్రతి ఇంటిలోనూ

 Sunita Devi : ‘రాణీ’ మేస్త్రి

‘‘మహిళల ఆత్మగౌరవం కోసం మా గ్రామ స్థాయిలో నేను చేసిన చిన్న ప్రయత్నం ఇంత ప్రభావం చూపిస్తుందనీ, ఎంతోమందికి ఉపాధిగా మారుతుందనీ అస్సలు ఊహించలేదు’’ అంటారు సునీతాదేవి. జార్ఖండ్‌కు చెందిన ఆమె ప్రతి ఇంటిలోనూ వ్యక్తిగత టాయిలెట్ల ఏర్పాటు కోసం పోరాడారు. తాపీ పని నేర్చుకున్నారు. యాభై వేలమందికి పైగా మహిళలు మేస్త్రీలుగా మారడానికి దోహదపడ్డారు.. ప్రతిష్టాత్మకమైన పురస్కారాలతో పాటు ఈ మధ్యే ప్రపంచ బ్యాంకు నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ముప్ఫై మూడేళ్ళ సునీత స్ఫూర్తిమంతమైన కృషి గురించి ఆమె మాటల్లోనే...

‘‘ఇది ఆడవాళ్ళు చేసే పనేనా? ఇలాంటి విషయాల గురించి ఇళ్ళలో మాట్లాడుకోవడమే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది వీధుల్లోకి ఎక్కుతానంటే ఎలా? మేం ఒప్పుకోం.. ఇదీ నేను తాపీ పని నేర్చుకుంటానన్నప్పుడు మా మామగారి స్పందన. కానీ నా భర్త నాకు మద్దతుగా నిలిచారు. కొన్నాళ్ళపాటు మామయ్యతో పోరాడి ఒప్పించారు. అలా 2016లో టాయిలెట్ల నిర్మాణంలో శిక్షణ తీసుకున్నాను. కుటుంబాన్ని ఎదిరించి నేను ఈ నిర్ణయానికి రావడం వెనుక... నాలాంటి ఎందరో మహిళల ఆత్మగౌరవ సమస్య ఉంది. మాది జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఉదయపురా గ్రామానికి చెందిన పేద గిరిజన కుటుంబం. పెళ్ళయిన తరువాత అత్తవారింటికి వెళ్ళినప్పుడు... నాకు ఎదురైన మొదటి సమస్య టాయిలెట్‌. గ్రామంలో తొంభైశాతం మంది మహిళలు కాలకృత్యాల కోసం తోటల్లోకో, పొలాల్లోకో వెళ్ళాల్సిందే. అక్కడ ఆకతాయిల వేధింపులనూ, పాములు, తేళ్ళలాంటి విష జంతువులనూ ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆడవాళ్ళ మాట ఏమాత్రం చెల్లని వాతావరణంలో... ఈ ఇబ్బందులను పురుషులకు చెప్పడం కష్టం, చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం అసాధ్యం. దీనికి పరిష్కారం కోసం మధనపడుతున్న సమయంలోనే... ‘స్వచ్ఛభారత్‌ మిషన్‌- గ్రామీణ్‌’, ‘జార్ఖండ్‌ స్టేట్‌ లైవ్లీహుడ్‌ ప్రమోషన్‌ సొసైటీ’ అధికారులు మా ఊరికి వచ్చారు. ప్రతి ఇంట్లో టాయిలెట్‌ ఏర్పాటు కావాలనే లక్ష్యంతో అవగాహన సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించారు. అప్పుడు స్థానిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించాను. గ్రామ పంచాయతీ ప్రతినిధుల్ని ఆ అధికారులు సంప్రతించినప్పుడు... ‘మరుగుదొడ్లు కట్టడానికి మేస్త్రీలు ఇష్టపడరు. అందులో పెద్దగా ఆదాయం రాదు’ అనే సమాధానం వచ్చింది. స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే... తాపీ పనిలో శిక్షణ ఇప్పిస్తామని అధికారులు కోరినప్పుడు... నేను నేర్చుకుంటానన్నాను. అందుకు మా అత్తింటివారు అభ్యంతరం చెప్పారు. ‘‘ఇది నా కోసం కాదు, గ్రామం కోసం చేస్తున్నాను. బహిరంగ ప్రదేశాలను టాయిలెట్లుగా వాడుతూ ఉంటే అందరి ఆరోగ్యాలూ దెబ్బతింటాయి. ఇది మహిళలకు అవమానకరం కూడా... మన పిల్లల తరాన్నయినా దీని నుంచి విముక్తి కలిగిద్దాం’’ అని వాదించారు. చివరికి వారి అంగీకారంతో... నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో శిక్షణ తీసుకున్నాను. నాతో పాటు పాల్గొన్నవారందరూ పురుషులే. స్వయంగా టాయిలెట్‌ నిర్మించిన తరువాత... అధికారులు దాన్ని పరిశీలించి సర్టిఫికెట్‌ ఇచ్చారు. అలా మా ప్రాంతంలో మొదటి మహిళా తాపీమేస్త్రిని అయ్యాను.

దుర్భాషలాడినా తగ్గలేదు...

కానీ ఆ తరువాత కూడా ఇబ్బందులు కొనసాగాయి. గ్రామస్తులు నన్ను పనిలోకి తీసుకోవడానికి ఒప్పుకోలేదు. సామాజిక టాయిలెట్ల నిర్మాణాన్ని అధికారులు నాకు అప్పగించినప్పుడు... నన్ను దుర్భాషలాడారు. నా కుటుంబాన్ని నిందించారు. అయినా వెనక్కి తగ్గలేదు. బహిరంగ విసర్జనల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేశాను. మహిళలకు తాపీ పనిలో శిక్షణ ఇస్తానని చెప్పాను. నేను చేసిన కొన్ని నిర్మాణాల తరువాత... క్రమంగా గ్రామస్తుల దృక్పథం మారింది. మొదట్లో ఎనిమిది మంది మహిళలు పని నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. వారితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాను. ‘స్వచ్ఛ భారత్‌’ నిధులు, పంచాయతీ మ్యాచింగ్‌ గ్రాంట్స్‌తో ఆరు నెలల్లోనే మా గ్రామంలోని ప్రతి ఇంటికీ టాయిలెట్‌ ఏర్పాటయింది. బహిరంగ విసర్జన రహిత గ్రామంగా నిలిచింది. మీడియా ద్వారా ఇది రాష్ట్రమంతటా తెలిసింది. తమ ప్రాంతాల్లో ఈ విషయం మీద చైతన్యం నింపాలని చుట్టుపక్కల పంచాయతీలు నన్ను ఆహ్వానించాయి.

వర్క్‌షాపులు నిర్వహించాను. స్వయంగా పదిహేను వందలమందికి పైగా ట్రైనింగ్‌ ఇచ్చాను. మా బృందాన్ని ఒక మోడల్‌గా జార్ఖండ్‌ ప్రభుత్వం తీసుకుంది. అధికారులు నన్ను ‘మాస్టర్‌ ట్రైనర్‌’గా గుర్తించి... రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ బాధ్యతలను అప్పగించారు. నా పర్యవేక్షణలో... నా దగ్గర తాపీ పని నేర్చుకున్నవారు కూడా ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక గొలుసుకట్టులా సాగుతోంది. ప్రస్తుతం మా రాష్ట్రంలో మహిళా తాపీపనివారి సంఖ్య యాభైవేలు దాటింది. మమ్మల్ని ‘రాణీ మేస్త్రీలు’ అని పిలుస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలందరికీ ఉపాధి లభిస్తోంది.

వ్యతిరేకించినవారే గెలిపించారు...

నేను చేస్తున్న పనికి సామాజిక ఆమోదం లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పలు సత్కారాలు పొందాను. 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి ‘నారీ శక్తి’ పురస్కారం వాటిలో ప్రధానమైనది. రెండేళ్ళ కిందట... ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’లో రాణీ మేస్త్రీల సేవలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటీవల ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో మా కృషిని అభినందించింది. కిందటి ఏడాది మా గ్రామానికి సర్పంచ్‌గా గెలిచాను. ఒకప్పుడు నన్ను వ్యతిరేకించినవారే... నా తరఫున ప్రచారం చేసి నన్ను గెలిపించారు. వీటన్నిటికన్నా... మహిళలు పడుతున్న ఇబ్బందులను తీర్చడం కోసం... ఒక మహిళగా నేను వేసిన తొలి అడుగు ఇప్పుడు వేలమందికి స్ఫూర్తిగా నిలవడం కన్నా సంతోషం ఇంకేముంటుంది?’’

మొదట్లో ఎనిమిది మంది మహిళలు పని నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. వారితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాను. ‘స్వచ్ఛ భారత్‌’ నిధులు, పంచాయతీ మ్యాచింగ్‌ గ్రాంట్స్‌తో ఆరు నెలల్లోనే మా గ్రామంలోని ప్రతి ఇంటికీ టాయిలెట్‌ ఏర్పాటయింది. బహిరంగ విసర్జన రహిత గ్రామంగా నిలిచింది.

Updated Date - 2023-08-08T23:46:33+05:30 IST