Shri Mahalakshmi Devi : నేటి అలంకరణ శ్రీ మహాలక్ష్మీ దేవి
ABN , First Publish Date - 2023-10-17T23:31:03+05:30 IST
ఆశ్వయుజ శుద్ధ చవితి - బుధవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ఆదిపరాశక్తి ధరించి, దుష్ట రాక్షస
ఆశ్వయుజ శుద్ధ చవితి - బుధవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ఆదిపరాశక్తి ధరించి, దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి... డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా... భక్తుల అభీష్టాలను తీర్చే మహాలక్ష్మి సర్వ మంగళకారిణి. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ ఈ రోజు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించి, పూజిస్తే... ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయనీ భక్తుల నమ్మిక.
నైవేద్యం: రవ్వ కేసరి, గారెలు, చిత్రాన్నం, పాయసం
అలంకరించే చీర రంగు: ఎరుపు
అర్పించే పూల రంగు: తామర పుష్పాలు
పారాయణ: లక్ష్మీ స్తోత్రాలు