Singhara nuts: సింఘార కాయల కూర భలే
ABN , First Publish Date - 2023-02-24T23:06:03+05:30 IST
‘ద్విఖండం ఖండితం బాలం ఫలం విషాణ సంఙ్ఞకంతప్తె హింగుయుక్తే ఖాజ్యం భర్జితం సైంధవాన్వితమ్’’ ‘విషాణం’ అనే అపురూపమైన మొక్క గురించీ, దాని లేత కాయలతో కూర వండుకునే విధానం గురించీ తన ‘క్షేమ కుతూహలం’లోని ఈ శ్లోకంలో చెబుతున్నాడు క్షేమశర్మ.
‘ద్విఖండం ఖండితం బాలం ఫలం విషాణ సంఙ్ఞకంతప్తె హింగుయుక్తే ఖాజ్యం భర్జితం సైంధవాన్వితమ్’’ ‘విషాణం’ అనే అపురూపమైన మొక్క గురించీ, దాని లేత కాయలతో కూర వండుకునే విధానం గురించీ తన ‘క్షేమ కుతూహలం’లోని ఈ శ్లోకంలో చెబుతున్నాడు క్షేమశర్మ. ‘విషాణం’ అంటే ‘ట్రపా బిస్పినోజ రాక్స్‌బ్’ అనే మొక్కగా ఈ పుస్తకానికి వ్యాఖ్యానం రాసిన సంపాదకులు గుర్తించారు. ట్రపా బిస్పినోజ ఆనేది నీళ్లలో పెరిగే మొక్క. ‘కోవిలదుంప, పరికెగడ్డ, పాటిగడ్డ, నామదుంప’ అని తెలుగులో దీన్ని పిలుస్తారు. మనకన్నా ఉత్తరాదిలో దీని వ్యాప్తి ఎక్కువ. అక్కడ దీన్ని ‘సింఘార’ మొక్క అంటారు. చెరువుల్లో పెరుగుతుంది. నీటి మీద ఆకులు తేలుతూ ఉంటాయి.
సింఘార కాయల కూర...
లేత సింఘార కాయలు దొరికితే సంతోషం. అవి దొరకనప్పుడు గింజల్ని ఒక రోజు ముందుగా నానబెట్టి వండుకోవాలి. కాయ గానీ, నానిన గింజల్ని గానీ ముక్కలుగా తరిగి, నేతిలో తాలింపు గింజలు, ఇంగువ వేసి వేగించి అందులో ఈ ముక్కలు చేర్చి బాగా మగ్గనివ్వాలి. సైంధవ లవణం తగినంత కలిపి పొయ్యి మీంచి దింపితే సింఘారకూర సిద్ధం. కొత్తిమీర వగైరా సుగంధ ద్రవ్యాల్ని రుచికొద్దీ చేర్చుకోవచ్చు. బీర, పొట్ల, సొర, దొండ, బెండ లాంటి కూరగాయలతో కలిపి వండుకోవచ్చు.
విషాణం శీతలం బల్యం పిత్తఘ్నం, రుచికారకం/ పాకె లఘుతరం ప్రోక్తం విశేషాద్విషనాశనం’... ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో ఈ శ్లోకం చాలా ముఖ్యమైంది. సింఘార కూర చలవ చేస్తుంది. బలకరం, పైత్యాన్ని తగ్గిస్తుంది. రుచికరమైనది. తేలికగా అరుగుతుంది. అన్నిటికన్నా విషదోషాలను హరిస్తుంది’ అని దీని భావం.ఇన్ని ఔషధ ప్రయోజనాలను ఆహరం రూపంలో పొందగలగటం ఒక యోగం. వాటిని అందుకోగలిగే అదృష్టం మనకూ ఉండాలి.
బఫెలో నట్...
ఇది కాయలు కాసే మొక్క. దీని కాయల్ని జలఫలం, పానీయఫలం, త్రికోణఫలం... ఇలా పిలుస్తారు. దీని కాయలు పలుచగా, నంది ముఖంలా రెండు కొమ్ములతో ముక్కోణాకారంలో ఉంటాయి కాబట్టి ‘బఫెలోనట్’ అని, కొమ్ములున్న కాయ కాబట్టి ‘శృంగాటక’ అనీ అన్నారు. లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, ఎండాక నల్లగా ఉంటాయి. పై పొట్టు వలిచేస్తే లోపల తెల్లని గింజ ఉంటుంది. ఇవి అన్నంలో కూరగా తినదగినవి. చలువనిస్తాయి. మూత్ర వ్యాధులు, ఎసిడిటీ, ఉడుకు విరేచనాలు, స్త్రీల వ్యాధుల్లో ఔషధంలా పనిచేస్తాయి. నరాల బలహీనతను తగ్గిస్తాయి. పురుషుల్లో జీవకణాలను పెంచుతాయి. బాలింతలకు పాలు పెరిగేలా చేస్తాయి. లైంగికశక్తిని పెంచే ద్రవ్యాల్లో ఇవి ముఖ్యమైనవే! అధికంగా మలమూత్రాలు వెడలటం, రక్తస్రావం కాకుండా ఆపుతాయి. దప్పిక తగ్గుతుంది. అమృతప్రాశ ఘృతంలాంటి ఔషధాల్లో ఇది ప్రధాన ద్రవ్యం.
వాటర్ చెస్ట్ నట్...
దీని కాయల త్రికోణాకృతికి ఓ ప్రత్యేకత ఉంది. మహాభారత యుద్ధంలో 8వ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు దీని కాయల ఆకారంలో శృంగాటక వ్యూహాన్ని రచిస్తాడు. తక్కువ సేనతో పెద్ద సైన్యాన్ని ఎదిరించటానికి పన్నే యుద్ధవ్యూహం ఇది. దాని ఆకారమే కాదు, దాని గుణాలు కూడా ఇలానే రోగం అనే శత్రువును ఛేదిస్తాయి. దీని లేత కాయలు తీపి, వగరుగా ఉంటాయి. ఈ కాయల్లో ప్రొటీన్లు ఎక్కువ. జీర్ణశక్తిని పెంచే స్వభావం వీటికుంది. జీర్ణప్రక్రియ పూర్తయ్యాక తీపి పదార్థంలా మారుతుంది. చలవనిచ్చే ఔషధం ఇది. ప్రస్తుతం మార్కెట్లో దీని గింజలను, పౌడరును అమ్ముతున్నారు. లేత కాయల్ని సంపాదించుకోలేనివారు ఆన్ లైన్ ద్వారా ఎండిన గింజల్ని కొని భద్రపరచుకోవచ్చు. సింఘార ఫ్రూట్ లేదా ‘వాటర్ చెస్ట్‌నట్’ అని అడగండి.
నరాలకు బలం...
ఈ గింజల్ని దోరగా వేయించి తినవచ్చు. ఉడికించి కూర, పులుసుల్లో వాడతారు. సోయా గింజల్లా అన్ని రకాల కూరల్లోనూ కలిపి వండుకోవచ్చు. ఉత్తరాదివారు ఉదయం పూట అల్పాహారంగా వీటిని సాతాళించి తింటారు. ఆలూ దుంపల రుచిలో ఉంటాయని చెప్తారు. ఈ గింజల పిండితోగానీ, గోధుమపిండిలో ఈ పిండిని కూడా చెరిసగంగా కలిపిగానీ చపాతీలు చేస్తారు. శరీరం లోపలి అవయవాల్లో కలిగే వాపుల్ని తగ్గించే స్వభావం వీటికుంది. పేగుపూతకు ఇది అద్భుత నివారకం. తెలివితేటల్ని, మేథాశక్తిని, నరాలకు బలాన్ని కలిగించే గుణం కూడా వీటికుంది. ఇమ్యూనిటీ బూస్టరుగా కూడా ఈ గింజలు పని చేస్తాయి. సూక్ష్మజీవులను ఎదిరించే శక్తి వీటికి ఉందని కనుగొన్నారు. కీళ్లవాతం, వడదెబ్బ, నీరసం నిస్సత్తువ, లైంగిక అసమర్థత, విరేచనాల వ్యాధి, కంటి వ్యాధులు, సంతానం లేకపోవటం లాంటి సమస్యలకు సమాధానం ఇవ్వగలిగిన ఒక దివ్యౌషధం ఈ మొక్క.
-గంగరాజు అరుణాదేవి