Sri Krishna: జ్ఞాన తపస్సు

ABN , First Publish Date - 2023-08-04T03:57:26+05:30 IST

భగవద్గీతలో శ్రీకృష్ణార్జునులిద్దరూ ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించారు. కానీ వాటి అర్థం, సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి ‘నేను’... అతని భౌతిక శరీరం. ఆస్తులు, భావాలు, నమ్మకాలను సూచిస్తుంది.

 Sri Krishna: జ్ఞాన తపస్సు

గీతాసారం

భగవద్గీతలో శ్రీకృష్ణార్జునులిద్దరూ ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించారు. కానీ వాటి అర్థం, సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి ‘నేను’... అతని భౌతిక శరీరం. ఆస్తులు, భావాలు, నమ్మకాలను సూచిస్తుంది. అంతేకాకుండా... అతని కుటుంబం, స్నేహితులు, బంధువులు కూడా అందులో మిళితమై ఉంటారు. మన స్థితి కూడా అర్జునుడి పరిస్థితికి భిన్నమైనదేమీ కాదు. ముఖ్యంగా మనం కొన్ని వస్తువులకు యజమానులం అనీ, మరి కొన్నిటికి కాదనీ భావిస్తాం.

శ్రీకృష్ణుడు ‘నేను’ అని ఉపయోగించినప్పుడు... అది సమగ్రతను సూచిస్తుంది. మన ఇంద్రియాలకు ఉన్న పరిమితి కారణంగా... మనం గ్రహించే విభిన్నమైన ద్వంద్వ విషయాలు, వైరుధ్యాల వల్ల... అన్నిటిలోనూ మనం విభజనలను చూస్తాం. కానీ శ్రీకృష్ణుడి ‘నేను’ ఆ విభజనల సమ్మేళనం. శ్రీకృష్ణుడు సముద్రం అయితే మనం ఆ సముద్రంలో నీటి బిందువులలాంటి వాళ్ళం. కానీ అహంకారం వల్ల... మనకు సొంత అస్తిత్వం ఉందని అనుకుంటాం. ఎప్పుడైతే ఆ బిందువు సొంత అస్తిత్వ భ్రమను విడిచిపెట్టి, సముద్రంలో కలిసిపోతుందో... అప్పుడు అదే ఒక మహాసముద్రం అవుతుంది. ‘‘అర్జునా! నా అవతారాలు, కర్మలు దివ్యమైనవి. అంటే అవి నిర్మలమైనవి, అలౌకికమైనవి. తత్త్వ రహస్యాన్ని తెలుసుకున్నవాడు మరణించిన తరువాత కచ్చితంగా మళ్ళీ జన్మించడు. నన్ను చేరుకుంటాడు’’ అని శ్రీకృష్ణుడు బోధించాడు. అహంకారాన్ని త్యజించి, విభజనలకు అతీతంగా... అంతా ఒకటేనని అంగీకరించే సామర్థ్యం పొందాలనేదే ఈ ఉపదేశానికి అర్థం. ‘వీత్‌-రాగ్‌’ అనే పదాన్ని కూడా శ్రీకృష్ణుడు ఉపయోగించాడు. ఇది రాగం (మమకారం), విరాగం (వైరాగ్యం) కాదు. రాగాన్నీ, విరాగాన్నీ అధిగమించి... ఆ రెండిటినీ ఒకటిగా... అనుభవస్థాయిలో చూడగలిగే మూడవ స్థితి. భయ క్రోధాలకు కూడా ఇది వర్తిస్తుంది.

అలాగే ‘జ్ఞాన- తపస్సు’ అనే మరో మాట కూడా శ్రీకృష్ణుడు ప్రస్తావించాడు. తపస్సు అంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. మనలో కూడా చాలామంది దీన్ని పాటిస్తారు. ఇంద్రియ సుఖాలను, భౌతికమైన ఆస్తులను పొందడానికి సాగించే తీవ్రమైన అన్వేషణను అజ్ఞానంతో చేస్తున్న తపస్సుగా చెప్పవచ్చు.

అలాకాకుండా... ‘జాగరూకతతో కూడిన క్రమశిక్షణ’ అనే జ్ఞాన తపస్సును కొనసాగించాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు.

‘‘ఇదివరకు కూడా సర్వదా

రాగ భయ క్రోధరహితులైన వారు, దృఢమైన భక్తి తాత్పర్యాలతో, స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు అనేకమంది జ్ఞాన

తపస్సంపన్నులయ్యారు. పవిత్రులయ్యారు. నా స్వరూపాన్ని తెలుసుకున్నారు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

iStock-1196261399.jpg

-కె.శివప్రసాద్‌,ఐఎఎస్‌

Updated Date - 2023-08-04T03:58:56+05:30 IST