Sri Mataji Nirmala Devi: భగవంతుడి ప్రేమ పొందాలంటే..
ABN , First Publish Date - 2023-08-04T03:48:36+05:30 IST
ప్రేమ మనిషిని బతికిస్తుంది, పోషిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. తల్లి ప్రేమ, గురువు ప్రేమ, మిత్రుని ప్రేమ... ఇలా మనం జన్మించినప్పటి నుంచి చివరి మజిలీ వరకూ మన జీవనయానం ప్రేమతోనే ముడిపడి ఉంది.
సహజయోగం
ప్రేమ మనిషిని బతికిస్తుంది, పోషిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. తల్లి ప్రేమ, గురువు ప్రేమ, మిత్రుని ప్రేమ... ఇలా మనం జన్మించినప్పటి నుంచి చివరి మజిలీ వరకూ మన జీవనయానం ప్రేమతోనే ముడిపడి ఉంది. అందరు మతబోధకులు, ప్రవక్తలు, అవతార పురుషులు, ఆది గురువులు ప్రేమ శక్తి, ఔన్నత్యం గురించి మనకు బోధల ద్వారా, గ్రంథాల ద్వారా వివరించారు. ఈ సకల చరాచర సృష్టి సర్వవ్యాపితమైన పరమాత్మ ప్రేమ శక్తితోనే జరిగిందంటారు శ్రీమాతాజీ నిర్మలాదేవి. గత చరిత్రలో మతం పేరుతో ఒకరిని ఒకరు చంపుకోవడం మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి ప్రతి మతం మనకు బోధించేది ప్రేమే. భగవంతుని ప్రేమ పొందాలంటే... మానవులు పరస్పర ప్రేమభావంతో జీవించాలని ప్రతి మతమూ చెబుతుంది. ద్వేషించాలని బోధించదు. మరి ఈ వైషమ్యాలు ఎందుకనే ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది. దీనికి కారణం అసూయ, అహంకారం. అవి ఉన్న చోట ప్రేమ ఉండదు. వీటికి విరుగుడు అవ్యాజమైన ప్రేమ. ప్రపంచ శాంతి కోసం జరిగే ప్రతి ప్రయత్నం ఈ ప్రేమ ద్వారానే ఫలితాన్నిస్తోంది. ఇతరుల పట్ల మీకు ప్రేమ ఉంటేనే వారికి సహాయపడగలరు. పరులను ప్రేమించడం వల్ల ఆనందానుభవం కలుగుతుంది. వారిని అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు మీకున్న భ్రమలన్నీ తొలగిపోతాయి.
వాస్తవానికి ప్రేమించడం మానవుల నైజం... మన సహజ స్వభావం. దీని వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది విచ్చుకొనే కలువపూవు లాంటిది. ఒక్కొక్క రేకు విడుతూ ఉంటే సుగంధ పరిమళాలు వ్యాపిస్తాయి. అదే విధంగా... హృదయం ప్రేమమయమై వికసిస్తే... ఆ ప్రేమ పరిమళం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. భగవంతుడు ప్రేమానురాగాలు అనే శక్తిని మనకు ఇచ్చాడు. ఆ శక్తిని మనం గుర్తించాలి. పెంపొందించుకోవాలి. ఎలాంటి మోహం, దురాశ లేనిది దివ్యమైన ప్రేమ. అది దేన్నీ ఆశించదు. దాన్ని ధనంకోసమో, మరి దేనికోసమో అమ్మలేరు. ఇతరుల మీద బలంవంతంగా రుద్దలేరు. మీలో స్వతహాగా ఉన్న స్వచ్ఛమైన అస్తిత్వమే... ఆ ప్రేమను వెదజల్లడం మొదలుపెడుతుంది. మనలో ఉన్న ప్రకాశించే ఆత్మ కాంతి... ప్రేమ. కాబట్టి మన హృదయం నుంచి వెలువడే ప్రేమే మనకి ఆనందాన్ని ఇస్తుందనే విషయాన్ని గ్రహించాలి. ఈ దైవిక ప్రేమ మనల్ని దృఢంగానే కాకుండా చైతన్యవంతంగానూ చేస్తుంది. అది ప్రపంచంలోని దుష్టశక్తులను అధిగమించగలదు. ప్రేమ ఖడ్గంతో ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చు. అయితే మనం ఎలాంటి ప్రేమను పంచుతున్నామనేది తెలుసుకోవాలి. ఆ ప్రేమ ఎటువంటి షరతులు లేకుండా... నాది, నా భార్యది, నా పిల్లలది, నా బంధువులది అనే పరిమితులు లేకుండా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. మనలో ఉన్న చైతన్య శక్తి... సర్వవ్యాపితమైన పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానమై, ఆత్మసాక్షాత్కారం పొందడానికి సహజయోగం దోహదం చేస్తుంది. అత్యున్నత స్థితి అయిన ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన సహజ యోగులు భగవంతుడి ప్రేమను ఆస్వాదించగలరు. ఇతరులకు పంచగలరు.

(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)
డాక్టర్. పి. రాకేష్8988982200
పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి, సహజ యోగ ట్రస్ట్ తెలంగాణ