Holi Sweets: మధురమైన హోలి

ABN , First Publish Date - 2023-03-03T22:37:02+05:30 IST

రంగుల పండగ వచ్చేస్తోంది... ఆనందంతో.. రంగుల్లో మునిగి.. అనుబంధాల వంతెన వేసే హోలీ రోజున పరిగెత్తుతూ ఆడటమే కాదు.. రుచికరమైన తీపి పదార్థాలను సులువుగా చేసుకోండిలా..

Holi  Sweets: మధురమైన హోలి

మధురమైన హోలి

రంగుల పండగ వచ్చేస్తోంది... ఆనందంతో.. రంగుల్లో మునిగి.. అనుబంధాల వంతెన వేసే హోలీ రోజున పరిగెత్తుతూ ఆడటమే కాదు.. రుచికరమైన తీపి పదార్థాలను సులువుగా చేసుకోండిలా..

కోవా కజ్జికాయలు

కావాల్సిన పదార్థాలు

నెయ్యి- పావుకప్పు, మైదా-250 గ్రాములు, నీళ్లు- తగినన్ని, కోవా- 250 గ్రాములు, యాలకుల పొడి- అరటీస్పూన్‌, పంచదార పొడి- మూడున్నర స్పూన్లు, సన్నగా తరగిని బాదం పలుకులు- టేబుల్‌ స్పూన్‌, వేయించిన జీడిపప్పు ముక్కలు- 2 టేబుల్‌ స్పూన్లు, రోస్ట్‌ చేసిన పిస్తా ముక్కలు- టేబుల్‌ స్పూన్‌, వేయించిన కొబ్బరిపొడి- 2 టేబుల్‌ స్పూన్లు, పంచదార- కప్పు, కుంకుమ పువ్వు- కొద్దిగా, నూనె- డీప్‌ఫ్రైకి తగినంత

తయారీ విధానం

ముందుగా మైదాలోకి నెయ్యి వేసి కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కోవాను చిన్నమంట మీద రెండు నిముషాలు వేడి చేసి ఒక పెద్ద బౌల్‌లో వేయాలి. ఇందులోకి యాలకులు, పంచదార పొడి, బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుకొబ్బరి వేసి కలపాలి. ఒక ప్యాన్‌లో కప్పు నీళ్లు పోసి పంచదార వేశాక కుంకుమపువ్వు వేసి కదుపుతూ మీడియం ఫ్లేమ్‌లో మరిగించాలి. ఈ పాకాన్ని పక్కన ఉంచుకోవాలి. పిండి ముద్దను చిన్నపూరీల్లాగా ఒత్తుకోవాలి. ఒక్కోటి తీసుకుని అందులో సరిపడ కోవా వేసి చుట్టూ క్లోజ్‌ చేయాలి. మౌల్డ్‌తో కజ్జియాలను ఒత్తుకోవాలి. నూనె వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌కు కాస్త తగ్గించి వేయించుకోవాలి. బంగారు రంగులో ఉండేట్లు చూసుకోవాలి. ఈ కజ్జికాయల్ని ముందు చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకుని నిముషం తర్వాత వాటిని తీసి ప్లేట్‌లో ఉంచుకోవాలి.

రవ్వ బర్ఫీ

sweet-rava-burfi.jpg

కావాల్సిన పదార్థాలు

సన్నటి బొంబాయి రవ్వ- కప్పు, నెయ్యి- అర కప్పు, చక్కెర- కప్పు, నీళ్లు- రెండు కప్పులు, జీడిపప్పు- 10

తయారీ విధానం

ఒక గిన్నెలో నీళ్లను పోసి వేడి చేయాలి. ఈ లోపు మరో ప్యాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పులను రంగు మారేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్‌లోనే సన్నటి బొంబాయి రవ్వ వేసి బాగా గరిటెతో కదుపుతుండాలి. రవ్వ రంగు మారుతుంది. వెంటనే మెల్లగా వేడి నీళ్లు పోసుకుంటూ రెండు నిముషాలపాటు గరిటెతో కదుపుతుంటే రవ్వ ఉడుకుతుంది. ముద్దగా దగ్గరకు వస్తుంది. ఇందులో చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగాక పాకంలా అవుతుంది. ఇందులోకి ఫుడ్‌కలర్‌ వేసి మిశ్రమాన్ని కలపాలి. తర్వాత యాలకులపొడి, నెయ్యి వేసుకుని లోఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో నిముషం పాటు కలిపాక.. నెయ్యిపూసిన కేక్‌ ప్యాన్‌లో మందంగా పరచాలి. చల్లారబడిన తర్వాత ప్లేట్‌లోకి వేసుకుని చతురస్రాకారంలో లేదా ఇష్టమొచ్చిన రూపంలో కట్‌ చేసుకోవాలి. వేయించిన జీడిపప్పుతో గార్నిష్‌ చేసుకుని తినాలి.

కలాకండ్‌

iStock-852830522.jpg

కావాల్సిన పదార్థాలు

నెయ్యి- 4 స్పూన్లు, నిమ్మరసం- 2 టీస్పూన్లు, పాలు(ఫుల్‌ క్రీమ్‌)- లీటరు, చక్కెర- 100 గ్రాములు, యాలకుల పొడి- అరటీస్పూన్‌

తయారీ విధానం

ప్యాన్‌లో లీటరు పాలను వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలియబెడుతూ ఉండాలి. పొంగిపోకుండా చూసుకోవాలి. ఇందుకోసం మీడియం, హైఫ్లేమ్‌లో మార్చుతూ.. గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండాలి. పాలు సగానికంటే తక్కువయ్యేంత వరకూ గరిటెతో కదుపుతూ ఉండాలి. మంట తగ్గించి నిమ్మరసం కలపాలి. పాలు విరిగిపోతాయి. విరగకుంటే కాసిన్ని నీళ్లలో నిమ్మరసం వేసి కలిపితే పాలు విరిగిపోతుంటాయి. ఆ సమయంలోనే కొద్ది కొద్దిగా చక్కెర కలుపుతూ కలియబెట్టాలి. ప్యాన్‌కు అతుక్కోకుండా కదుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే అడుగు అంటి మాడిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలానే కదుపుతూ యాలకులపొడి, రెండు స్పూన్ల నెయ్యిని కలిపి గరిటెతో కదుపుతూ లోఫ్లేమ్‌లో ఉడికించాలి. రంగు మారిన వెంటనే స్టౌ ఆఫ్‌ చేయాలి. ఈ లోపు కేక్‌ ప్యాన్‌లో చుట్టూ రెండు టీస్పూన్ల నెయ్యిని బ్రష్‌తో పూయాలి. ఆ కేక్‌ ప్యాన్‌లోకి ఈ పాల మిశ్రమాన్ని వేయాలి. ఎలాంటి ఖాళీల్లేకుండా సమానంగా ఆ మిశ్రమాన్ని కేక్‌ప్యాన్‌లో సర్దాలి. చల్లారిన తర్వాత కలాకండ్‌ను ప్లేట్‌లోకి మార్చుకుని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని జీడిపప్పు లేదా బాదంలతో గార్నిష్‌ చేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

రబ్డీ

rabdi.jpg

కావాల్సిన పదార్థాలు

ఫుల్‌ క్రీమ్‌ పాలు- లీటరు, చక్కెర- అరకప్పు, బియ్యం పిండి- టేబుల్‌ స్పూన్‌, మిల్క్‌ పౌడర్‌- 2 టేబుల్‌ స్పూన్లు, పంచదార- 5 టీస్పూన్లు, కుంకుమ పువ్వు- కొద్దిగా, జీడిపప్పు- టేబుల్‌ స్పూన్‌, పిస్తా- టేబుల్‌ స్పూన్‌, బాదం- టేబుల్‌ స్పూన్‌, యాలకుల పొడి- అరటీస్పూన్‌, నెయ్యి- టీస్పూన్‌

తయారీ విధానం

ఒక గిన్నెలో పావు కప్పు పాలు పోయాలి. అందులోకి బియ్యంపిండి, మిల్క్‌పౌడర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకుని.. మిగతా పాలను ప్యాన్‌లో వేసి మరిగించాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పాలను వేడిచేస్తూ మెల్లగా చక్కెర వేసుకోవాలి. మీకు సరిపడ తీపికోసం చక్కెర చూసుకుని వేసుకోవాలి. కదుపుతుంటే పొంగు పైకి రాదు. ఇందులోకి కుంకుమ పువ్వు వేస్తే రంగు మారుతుంది. రెండు నిముషాలు తర్వాత సన్నగా కట్‌ చేసుకున్న డ్రైఫ్రూట్స్‌ ముక్కలను వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి.. గరిటెతో పాలను కదుపుతూ యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. రెండు నిముషాల పాటు మిశ్రమాన్ని కదుపుతూ ఉండాలి. రబ్డీ రెడీ. ఇది చల్లబడిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచుకుని తింటే మరింత రుచికరంగా ఉంటుంది.

Updated Date - 2023-03-03T22:37:02+05:30 IST