ఆ ఘటనే హైదరాబాద్‌ చరిత్ర గతిని మార్చింది

ABN , First Publish Date - 2023-02-15T23:16:15+05:30 IST

మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటి తరానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో... దేశ విభజన వల్ల కలిగిన విపరిణామాలు చాలా వరకూ తెలియదు.

ఆ ఘటనే హైదరాబాద్‌ చరిత్ర గతిని మార్చింది

మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటి తరానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో... దేశ విభజన వల్ల కలిగిన విపరిణామాలు చాలా వరకూ తెలియదు. వాటిని తెలియజేసే ఉద్దేశంతో అప్పటి పరిణామాలను విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత్రి మన్‌రీత్‌ సోధి సోమేశ్వర్‌ దేశ విభజనపై మూడు నవలలు రాశారు. వీటిలో ‘హైదరాబాద్‌’ ఒకటి. దేశ విదేశాలలో సంచలనం సృష్టస్తున్న ఈ నవల గురించి మన్‌రీత్‌ ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...

భారతదేశ విభజనకు సంబంధించి మీరు మూడు నవలలు రాశారు. అందులో హైదరాబాద్‌ ఒకటి. దీనిలో ఏ సంఘటనల గురించి ప్రస్తావించారు?

బ్రిటిష్‌ పాలకులు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత అనేక ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిలో లాహోర్‌, హైదరాబాద్‌, కశ్మీర్‌లలో జరిగిన సంఘటనలు చాలా ముఖ్యమైనవి. అందరూ తెలుసుకోవాల్సినవి. ఈ ఉద్దేశంతో నేను భారత దేశ విభజనకు సంబంధించి మూడు నవలలు రాశాను. ఈ మూడూ అప్పటి సంఘటనలపై ఆధారపడినవి. ఇక హైదరాబాద్‌ విషయానికి వస్తే- విభజన తర్వాత ఒక ఏడాది పాటు అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌.. హైదరాబాద్‌ రాజ్య పాలకుడు నిజాంల మధ్య చదరంగం మాదిరి ఆట ఒకటి నడిచింది. వీరిద్దరు ఎత్తుకు పైఎత్తు వేసుకున్నారు. హైదరాబాద్‌ను భారత సమాఖ్యలో చేర్చాలని పటేల్‌.. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాజ్యంగా ప్రకటించాలని నిజాం తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున తిరుగుబాటు ప్రారంభమయింది. వీటన్నిటి నేపథ్యంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ పోలో తర్వాత హైదరాబాద్‌ భారత సమాఖ్యలో విలీనమయింది. అయితే ఈ సమయంలోని హైదరాబాద్‌ కథను చాలా మంది మరచిపోయారు. దానిని పాఠకులకు గుర్తుచేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను.

విభజన అనగానే చాలా మందికి పాకిస్థాన్‌ సరిహద్దుల్లో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. హైదరాబాద్‌ కథను మీరు ఎందుకు గ్రంఽథస్తం చేయాలనుకున్నారు?

విభజన కేవలం సరిహద్దులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు... దీని ప్రభావం అనేక ప్రాంతాలపై ఉంది. పంజాబ్‌ సరిహద్దుల్లోనూ.. కశ్మీర్‌లోనూ.. ఢిల్లీలోనూ జరిగిన సంఘటనలపై చాలా పుస్తకాలు వచ్చాయి. అయితే హైదరాబాద్‌ది ఒక విచిత్రమైన కథ. చాలా సంక్లిష్టమైన విషయాలు దీనిలో ఉన్నాయి. ఉదాహరణకు విభజనపై నేను రాసిన ‘లాహోర్‌’ పుస్తకంలో- ప్రధాన పాత్రధారులు ఢిల్లీ, లాహోర్‌లలో ఉండే రాజకీయ నాయకులు, అక్కడ నివసించే ప్రజలు. కానీ హైదరాబాద్‌లో అనేక మంది సూత్రధారులు ఉన్నారు. ఒక వైపు నెహ్రూ, పటేల్‌లు ఎటువంటి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ను భారత సమాఖ్యలో కలపాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరో వైపు హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో కలపాలనే ఉద్దేశంతో నిజాం ఉన్నారు. ఆయనకు తోడుగా మిలిటెంట్‌ రజాకార్లు ఉన్నారు. వీరితో పాటుగా హిందూ మహాసభ, ఆర్యసమాజ్‌, తెలంగాణ రైతు పోరాట వేదికలు, కమ్యూనిస్టు పార్టీ కూడా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో కలపడం ద్వారా సమస్యలు సృష్టించాలని జిన్నా ప్రయత్నించారు. పాకిస్థాన్‌ కొత్తగా ఏర్పడిన దేశం కాబట్టి.. ఆర్థిక అవసరాలకోసం జిన్నాకు నిజాం కొంత సొమ్ము అప్పుగా ఇచ్చారు. అందుకే హైదరాబాద్‌ కథ ఒక చదరంగపు ఆటలా ఉంటుంది. ఒకరు వేసే ఎత్తుకు మరొకరు పైఎత్తు వేయటం, వారికి వ్యతిరేకంగా మరొకరు స్పందించటం... ఇలా కథ చకచక కదిలిపోతూ ఉంటుంది. ‘ఆపరేషన్‌ పోలో’తో ఈ ఆటంతా పూర్తయిపోయింది.

మీ దృష్టిలో హైదరాబాద్‌ చరిత్ర గతిని మార్చిన సంఘటన ఏది?

1948 చివరిలో గవర్నర్‌ జనరల్‌గా లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ పదవీకాలం పూర్తయింది. ఈ పదవీకాలం పూర్తికాకముందు... మే నెలలో మౌంట్‌బాటెన్‌ భారత సమాఖ్య.. నిజాంల మధ్య సయోధ్య కుదర్చటానికి ఒక ముసాయిదా ఒప్పందాన్ని రూపొందించాడు. ఈ ఒప్పందం నిజాంకు అనుకూలంగా ఉంది. దాన్ని ఆమోదించాలని నిజాం న్యాయ సలహాదారు వాల్టర్‌ మాంక్‌టన్‌ సలహా ఇచ్చాడు. దీనిని రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ వ్యతిరేకించాడు. దీనితో నిజాం ఈ ఒప్పందాన్ని తిరస్కరించాడు. ఈ నిర్ణయమే హైదరాబాద్‌ చరిత్రను మలుపు తిప్పింది.

పంజాబ్‌, బెంగాల్‌, కశ్మీర్‌లలో తీవ్ర రక్తపాతం జరిగింది కదా.. అక్కడితో పోలిస్తే హైదరాబాద్‌లోని పరిస్థితులేమిటి?

విభజనవల్ల హైదరాబాద్‌ అల్లకల్లోలమయిపోయింది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1947 జులై... 1948 సెప్టెంబర్‌ నెలల మధ్య సుమారు 7 లక్షల మంది ముస్లింలు నిజాం తమకు రక్షణ కల్పిస్తాడనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌ నుంచి సుమారు ఐదు లక్షల మంది హిందువులు బయట రాష్ట్రాలకు తరలివెళ్లిపోయారు. అంటే 12 లక్షల మంది ప్రజలు... హైదరాబాద్‌ నుంచి బయటకు వెళ్లారు... లేదా బయట నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ వలసల వల్ల విపరీతమైన హింస చెలరేగింది. ‘ఆపరేషన్‌ పోలో’ సమయంలో కూడా హింస జరిగిందని చరిత్ర చెబుతోంది. హైదరాబాద్‌ను భారత సైన్యం ఆక్రమించుకున్న సమయంలో జరిగిన సంఘటనలపై సుందరలాల్‌ కమిషన్‌ దర్యాప్తు చేసి 1949లో ఒక నివేదికను సమర్పించింది. దీని ప్రకారం చూస్తే అప్పటి సంఘటనల్లో 27 వేల నుంచి 40 వేల మంది దాకా మరణించారు. వీరిలో ఎక్కువమంది ముస్లింలే.

విభజననాటి సంఘటనలకు సంబంఽధించిన రికార్డులు దొరకటం చాలా కష్టం కదా.. మీరు ఎలాంటి పరిశోధనలు చేశారు? ఎవరెవరిని కలిసారు?

విభజనకు సంబంధించిన ఈ నవల రాయటం వెనుక నాకు రెండు ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. ఆ కాలంలో నివసించిన సామాన్యమైన వ్యక్తులకు సంబంధించిన చరిత్ర బయటకు రాలేదు. ముఖ్యంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాటిని వెలికితీయాలనేది నా మొదటి లక్ష్యం. 1947 ఆగస్టు 15 సమీపిస్తున్న తరుణంలో మన దేశ నాయకులు ఎదుర్కొన్న సందిగ్ధతను ప్రజల ముందు ఉంచడం రెండో లక్ష్యం. ఎవరికి ఏది చెందాలనే నిర్ణయాలను ఢిల్లీలో కూర్చున్న నేతలు తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయాలలో ప్రజలకు ఎటువంటి పాత్రా లేదు. పటేల్‌, నెహ్రూ, మౌంట్‌బాటెన్‌లు ఢిల్లీలో తీసుకున్న నిర్ణయాలు లాహోర్‌, హైదరాబాద్‌, కశ్మీర్‌లలోని ప్రజలను ఎలా ప్రభావితం చేశాయనే విషయాన్ని చెప్పడానికి ఈ నవలలో ప్రయత్నించా. నా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని న్యూయార్క్‌ పబ్లిక్‌ లైబ్రరీ, హాంకాంగ్‌ పబ్లిక్‌ లైబ్రరీ, సింగపూర్‌ నేషనల్‌ లైబ్రరీలలో కూడా అనేక విషయాలను సేకరించాను.

మనం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్నాం. అయితే

ఈ తరం వారిలో చాలా మందికి విభజన, దాని అనంతరం జరిగిన సంఘటనల గురించి తెలియదు. బ్రిటి్‌షవారు మన దేశాన్ని రెండుగా చీల్చి వెళ్లిపోయారని చాలామంది అనుకుంటారు. ఇది కొంతవరకు మాత్రమే నిజం. 1947 నాటికి అవిభాజ్య భారత దేశంలో 55 శాతం భూభాగాన్ని మాత్రమే బ్రిటిష్‌ వారు పాలించేవారు. మిగిలిన 45 శాతం భూభాగాన్ని బ్రిటిష్‌ రెసిడెంట్ల సాయంతో రాజులు పరిపాలించేవారు. భారత విభజన చట్టం ప్రకారం- రాజులు పరిపాలించే 565 రాజ్యాలు- భారత్‌ లేదా పాకిస్థాన్‌లో చేరవచ్చు. లేదా స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకోవచ్చు. 1947, ఆగస్టు 15 నాటికి జునాగఢ్‌, కశ్మీర్‌, హైదరాబాద్‌ భారత్‌లో కలవలేదు. హైదరాబాద్‌ నిజాం స్వతంత్ర ప్రతిపత్తిని కోరుకున్నారు. కానీ 85 శాతం హిందువులున్న హైదరాబాద్‌ భారతదేశం మధ్యలో ఉంది. దీన్ని వదులుకోవాలనే ఆలోచననే పటేల్‌ భరించలేకపోయారు. అందుకే ‘‘శరీరం నుంచి వేరు చేస్తే కడుపునకు శ్వాస ఎలా అందుతుంది’’ అని ప్రశ్నించారు.

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-02-16T07:08:10+05:30 IST