Family values: తల్లి చెప్పిందని దొంగగా మారినవాడు ఒకడైతే, తల్లి మీదనే అత్యాచారం చేసినవాడు మరొకడు.. ఏం జరుగుతుంది? పిల్లల్ని పాడుచేస్తున్నది మనమేనా..!
ABN , First Publish Date - 2023-04-19T12:29:59+05:30 IST
పిల్లలు రేపు పెద్దయ్యి ఆ తల్లిదండ్రుల్ని పిల్లల్లా కాచుకుంటారని ఆశిస్తారు.
ఒక కుటుంబంలో పిల్లలు సరైన దారిలో లేరంటే.. దానికి కారణం తల్లిదండ్రులే. తండ్రి బ్రతకడం నేర్పితే తల్లి క్రమశిక్షణను నేర్పుతుంది. కష్టపడి చదువుకున్న పిల్లలు రేపు పెద్దయ్యి ఆ తల్లిదండ్రులను పిల్లల్లా కాచుకుంటారని ఆశిస్తారు. అలాగే చూసుకోవడం వారి ధర్మం కూడా. బిడ్డలకు తల్లిదండ్రులు పంచే ప్రేమ, ఆప్యాయతతో పాటు కుటుంబ గౌరవం, విలువలు ఆస్తిపాస్తులతో పాటు బిడ్డలకు ఇచ్చే సంపదలు. విలువలు అనేవి జీవితంలో మనకు మనం పెట్టుకునే ప్రమాణాలు. అవి దిక్సూచిలా పని చేసి జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి. సమాజంలో నేడు ఉన్న మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతాయి. ఇతరులను గౌరవించడం, దయాగుణం, నీతి నిజాయితీలు, ధైర్యం, సహనం, న్యాయం అనేవి అలవర్చుకుంటే అవి మంచి పౌరులుగా నిలుపుతాయి.
ఇప్పుడు ఈ విలువలు ఉంటున్నాయా?
తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసిన విలువలను వారికి ఇస్తున్నారా? ఇంకా కొందరిలో అవి లేవనే చెప్పాలి. తోటివారి పట్ల సానుభూతి చూపడం, ఇతరులను కలుపుకుపోయేతనం, కృతజ్ఞతాభావం, క్షమాగుణం అనేవి పెద్దలు పిల్లలకు ఇచ్చే ఆస్తి. మారుతున్న కాలంతో విలువలూ మారుతున్నాయి. కుటుంబంలో ఆర్థికపరమైన విషయాలదే ఎక్కువ స్థానం కావడం, అలాగే మారుతున్న జీవనశైలి, అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరూ ఈజీ మనీ సంపాదనలో పడి రేపటి ఆదర్శపౌరుల విషయాన్ని పక్కన పెడుతున్నారు. ఇదంతా వినాశనమే. పెద్దల యుందు గౌరవం, భక్తి నేర్పాల్సిన వారికి చేతికి ఫోన్ ఇచ్చి విశాల ప్రపంచాన్ని గంటలోనే చుట్టేసే అస్త్రాన్ని అందిస్తున్నారు. చిన్న చిన్న పాటలు, బొమ్మలతో మొదలుపెట్టి అశ్లీలపు నీలి చిత్రాలు, నేరాలను ఎలా చేయచ్చు వరకూ దారులన్నీ మనమే దగ్గరుండి చూపిస్తున్నాం. దైవ భక్తి నేర్పాల్సిన వయసులో కృరత్వం పెంచుతూ పసి హృదయాలను కలుషితం చేస్తున్నాం. దాని పర్యావసానమే ఈ కథనాలు.
ఓ తల్లి తన బిడ్డకు చదువు విలువ చెప్పి స్కూలుకి పంపాల్సింది పోయి వాడికి దొంగతనం చేసి రమ్మని పురమాయించింది. పనివాడు తెచ్చే దొంగ సొమ్ముతో జల్సాలు చేయడం మొదలు పెట్టింది. ఈ పిల్లాడు మరో ఇద్దరు సావాసగాళ్లతో చేరి వరుసగా దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. చివరికి పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోదాడకు చెందిన ముగ్గురు మైనర్లు స్థానికంగా ఆరో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరి అమ్మ దొంగతనం చేయమని పిల్లలను ప్రోత్సహించేది. దీంతో ఆ బాలురు ఎవ్వరికీ అనుమానం రాకుండా వీధుల్లో ఆడుకుంటూ తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడేవారు. సదరు ఇళ్ల దగ్గర దొరికే వస్తువులతోనే తాళాలు పగలగొట్టి లోపలికెళ్లి దొంగతనం చేసేవారు. చోరీ సొత్తును తీసుకెళ్లి ఆ తల్లికి ఇచ్చేవారు. తాను సహజీవనం చేస్తున్న కనతాల శ్రీనివాసులుతో కలిసి ఆమె చోరీ సొత్తును విక్రయిస్తుండేది. పిల్లలను దొంగతనాలకు మరింత ప్రోత్సహించేది.
ఇలా ఆ మైనర్లు మూడు నెలల్లో నాలుగు చోరీలు చేశారు. అయితే, కోదాడ, రంగా థియేటర్ వద్ద పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. సూర్యాపేట నుంచి కోదాడ బస్టాండ్ వైపు నెంబర్ ప్లేట్ లేని స్కూటర్‌పై వెళుతున్న ముగ్గురు బాలురు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దాంతో వాళ్లని వెంబడించిన పోలీసులు స్కూటర్‌ను ఆపి వివరాలు సేకరించారు. అనుమానంతో స్కూటర్ డిక్కీ తనిఖీ చేయగా బంగారం కనిపించింది. దీంతో ముగ్గురు బాలురును స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించగా తాము చేసిన చోరీల వివరాలు వెల్లడించారు. వారు వినియోగిస్తున్న వాహనం కూడా చోరీ చేసిందేనని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన బాలురుతోపాటు వారిలో ఒకరి తల్లిని, కనతాల శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 22తులాల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.20వేల నగదు, ఓ స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13 లక్షల వరకు ఉంటుంది.
మరో ఘటన..
హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక న్యాయస్థానం తన తల్లిపై అత్యాచారం చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి చనిపోయే వరకు జీవిత ఖైదు విధించింది. అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి దోషికి ₹ 20,000 జరిమానా కూడా విధించారు. పోలీసుల కథనం ప్రకారం, నవంబర్ 16, 2020 న, హర్యానాలోని ఒక గ్రామంలో ఒక మహిళ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహిళ బలవంతంగా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని ఆరోపిస్తూ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మృతుడి పెద్ద కుమారుడు డ్రగ్స్ బానిస అయ్యి, కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి, తనవారికి రక్షణగా నిలవాల్సిన కొడుకు కన్నతల్లిమీద అత్యాచారం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. జంతువులా ప్రవర్తించిన కొడుకు నిర్వాకానికి ఆతల్లి ప్రాణాలు తీసుకుంది.