కొంగ మాటలు!

ABN , First Publish Date - 2023-04-05T01:35:31+05:30 IST

ఒక ఊరిలో ఒక తెలివైన కొంగ ఉండేది. అది చెరువులో చేపలు పట్టకుండా కాలువల దగ్గర గట్టుమీద కాచుకుని చేపలను పట్టుకునేది. హాయిగా అలా చేపలు తింటూ కాలం గ

కొంగ మాటలు!

ఒక ఊరిలో ఒక తెలివైన కొంగ ఉండేది. అది చెరువులో చేపలు పట్టకుండా కాలువల దగ్గర గట్టుమీద కాచుకుని చేపలను పట్టుకునేది. హాయిగా అలా చేపలు తింటూ కాలం గడిపేది. సాయంత్రానికి ఇంటికి వచ్చి గూటిలో నిద్రపోయేది. ఉదయాన్నే మళ్లీ చేపల వేటకు బయలుదేరేది. ఆ కొంగకు ఓ రెండు ఎద్దులు పరిచయమయ్యాయి. అది కూడా చేలల్లో దుక్కి దున్నేప్పుడు. సాయంత్రానికి ఆ రైతు తన రెండు ఎద్దులను ఇంటికి తీసుకుని వెళ్లేవాడు. వాటికి ఆహారం పెట్టేవాడు. ఇదంతా కొంగ గమనించేది.

ఒక రోజు ఎద్దులు రెండూ ఉన్నాయి. వాటి యజమాని లేడక్కడ. కొంగ అదే పనిగా ఆ ఎద్దుల దగ్గరకు వెళ్లింది. ‘మీరు ఉదయాన్నే ఎప్పుడో చేనుకు వెళ్తారు. సాయంత్రం వస్తారు. ఈ కష్టం చేయకండి. మీరు పిచ్చివాళ్లు’ అన్నది. అదేంటీ.. అని అడిగాయి ఈ ఎద్దులు. ‘అవును మరి.. మీరు కష్టపడి చేలో పని చేస్తారు. మీరు విశ్రాంతి తీసుకోరు. పైగా మీ ఆహారాన్ని మీరే బండిలో ఇంటికి తీసుకొని వస్తారు. మీ రైతు నాలుగు గడ్డి పరకలు మీ మొహాన పడేస్తాడు. అదే చాలనుకుని మీరు సంతోషంగా ఉంటారు’ అంటూ కొంగ హాస్యంతో మాట్లాడింది. ఆ వెంటనే రెండు ఎద్దులు ఇలా అన్నాయి. ‘అదేం లేదు. మేం సంతోషంగా ఉన్నాం. ఉన్నదానిలో హాయిగా ఉన్నాం. ఇది చాలు. యజమాని మమ్మలను బాగా చూసుకుంటాడు. అయినా మేం పని చేయటం వల్ల ఈ భూమి సస్యశ్యామలం అవుతోంది. పదిమంది నోటి దాకా అన్నం పోవాలంటే మేం కష్టపడాలి. ఆ లెక్కన మా వల్ల మనుషులు ఆనందంగా ఉన్నారు. మేం ఇలా సాయం చేస్తున్నాం. మనుషులకోసమే మేం పని చేస్తాం’ అంటూ గట్టిగా ఆ ఎద్దులు అన్నవి. ఆ మాటలు విన్నాక కొంగ ఆశ్చర్యపోయింది. ఈ లోపు ఒక ఎద్దు ఇలా అంది.. ‘మేం మళ్లీ చెబుతున్నాం. రైతు కుటుంబానికి సేవ చేస్తున్నాం ఒక వైపు. మరో వైపు ప్రజల ఆకలి తీరుస్తున్నాం’ అన్నది. వారి మూర్ఖత్వం చూసి కొంగ ‘అందుకే మిమ్మలను ఎద్దులు అన్నది మిత్రమా’ అంటూ తుర్రుమని గాల్లోకి ఎగిరిపోయింది.

Updated Date - 2023-04-05T01:35:31+05:30 IST