Varalakshmi Vratham : వరాల కల్పవల్లి
ABN , First Publish Date - 2023-08-24T23:51:37+05:30 IST
శ్రావణం వ్రతాలకు, నోములకు, పూజలకు ప్రసిద్ధి చెందిన మాసం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న
నేడు వరలక్ష్మీ వ్రతం
శ్రావణం వ్రతాలకు, నోములకు, పూజలకు ప్రసిద్ధి చెందిన మాసం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి.
సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి
శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా
కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది.
దుష్టసంకల్పాలు, దుర్గుణాలు లేని ఇల్లాలు చారుమతి. ఆమె భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేపిస్తూ, తోటివారికి అండగా ఉంటూ... మంచి ప్రవర్తనతో మెలిగేది. ఆమె కలలో శ్రీమహాలక్ష్మీ కనిపించి... శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియజేసింది. తెల్లవారుతూనే ఈ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు, తోటి మహిళలకు చారుమతి తెలియజేసింది. అందరూ సంతోషించి, ఆ శుభదినం కోసం ఎదురుచూశారు. ఆ రోజు చారుమతి ఇంట్లో... అన్ని వర్ణాల మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ వరలక్ష్మీ అనుగ్రహం పొందారు. సాక్షాత్తూ లక్ష్మీ దేవే కలలో సాక్షాత్కరించి, వ్రత విధానాన్ని వివరించడం... గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది.
లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్ర్యాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం... ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి. మనలో అంతర్గతంగా ఉండే దైవిక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీమహాలక్ష్మి అంటారు పెద్దలు.. ఆమె ఆరాధనే వరలక్ష్మీ వ్రతం.
ఆయపిళ్ళ రాజపాప