Mataji Nirmala Devi : విశ్వ నిర్మల ధర్మం

ABN , First Publish Date - 2023-05-18T23:54:53+05:30 IST

‘ధర్మో రక్షతి రక్షితః’ అనే సూక్తి వాల్మీకి మహర్షి రచించిన ‘రామాయణం’లోని ఒక శ్లోకం లోనిది. ‘ధర్మాన్ని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది’ అని అర్థం. ‘ధర్మం’ అనే మాటను కొందరు ‘మతం’ అనే అర్థంలో ఉపయోగిస్తారు. అది సరి కాదు. మతం కన్నా ధర్మం ఉన్నతమైనది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి.

 Mataji Nirmala Devi : విశ్వ నిర్మల ధర్మం

‘ధర్మో రక్షతి రక్షితః’ అనే సూక్తి వాల్మీకి మహర్షి రచించిన ‘రామాయణం’లోని ఒక శ్లోకం లోనిది. ‘ధర్మాన్ని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది’ అని అర్థం. ‘ధర్మం’ అనే మాటను కొందరు ‘మతం’ అనే అర్థంలో ఉపయోగిస్తారు. అది సరి కాదు. మతం కన్నా ధర్మం ఉన్నతమైనది. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అవి వాటిని నమ్మేవారికి పరిమితమైనవి. కానీ ధర్మం ప్రపంచ ప్రజలందరికీ, ప్రాణులన్నిటికీ, పంచ భూతాలకూ సంబంధించినది. ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం అని ‘నారాయణ ఉపనిషత్తు’ చెప్పింది. ‘‘ధైర్యం, క్షమ, సంయమనం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, అస్తేయం (పరుల సొమ్ముకు ఆశపడకపోవడం), విద్య, సత్యం, క్రోధరాహిత్యం, సంశయం లేకపోవడం... ఈ పదింటినీ జీవితంలో ధరించడమే (పాటించడమే) ధర్మం’’ అంటోంది మనుస్మృతి. ఇదే శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవేశపెట్టిన ‘విశ్వ నిర్మల ధర్మం’ నేపథ్యం.

అందుకనే సహజయోగం ఏ ఒక్క మతానికో చెందినది కాదు. ఇది సర్వమత సమ్మేళనం. సర్వమతాల సారం. ఎందరో అవతార పురుషుల ప్రబోధాలు, ఎందరో సద్గురువుల, మత ప్రవక్తల బోధల సారాంశాన్ని ఏకీకృతం, సమ్మిళితం చేసిన ఏకైక ధార్మిక సంగమం... సహజ యోగం. ఒక వ్యక్తి అంతకుముందు ఏ మతానికి చెందినవాడైనా... సహజయోగంలోకి వచ్చిన తరువాత తన మత సారాంశాన్ని అనుభూతి చెందుతాడు. తను ఆచరించే మతంలోఉన్న సారం తనలో జాగృతం అయి ఉండడాన్ని గమనిస్తాడు.

శ్రీ మాతాజీ నిర్మలాదేవి తాను ప్రబోధించిన సూత్రాలను, ఆదర్శాలను, ధర్మాలనూ స్వయంగా ఆచరించారు. తాను స్థాపించిన సహజయోగంలో వాటిని ఆచరణాత్మకమైన అంతర్భాగంగా చేశారు. ఇంతకీ విశ్వ నిర్మల ధర్మం అంటే ఏమిటి? మన అందరిదీ ఒకే మతం, రంగు, జాతి కాకపోవచ్చు. కానీ అందరినీ సృష్టించిన ఆది దంపతులు ఒక్కరే అయినప్పుడు... అందరిదీ ఒకే మతం, ఒకే అభిమతం, మనం అందరం ఒకటే కుటుంబం. అదే విశ్వ నిర్మల ధర్మం. ఈ ధర్మాన్ని మనం అంగీకరిస్తే... అప్పుడు ఈ చిన్న చిన్న కుల ప్రస్తావనలనూ, జీవంలేని కట్టుబాట్లనూ, మన ఆత్మకు సరిపోని విషయాలనూ మరచిపోతాం. మన ఆత్మకు ఏది అంగీకారం అవుతుందో వాటినే ధర్మ సూక్ష్మాలుగా అంంగీకరిస్తాం. శ్రీమాతాజీ ప్రవచనాల ప్రభావంతో సహజయోగులు సాధించినదంతా ఈ విశ్వ నిర్మల ధర్మం సారమే. మానవ జన్మ పరమార్థం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. మనిషి వెన్నెముకలో నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి, పరమాత్మ శక్తితో ఏకీకరణ కావడమే ఆత్మ సాక్షాత్కారం.

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్పెయిన్‌ దేశంలో... 2006 మే 31న... విశ్వ నిర్మల ధర్మం ఒక మతంగా అధికారికంగా నమోదయింది. ఈ ధర్మం ఒక మతంగా గుర్తింపు పొందడానికి అది మొదటి మెట్టు అని చెప్పవచ్చు. ‘విశ్వ నిర్మల ధర్మం ఒక మతం’ అని చెబితే ప్రజలు ముందు కొద్దిగా సంశయిస్తారు. సహజయోగంలోకి రావాలంటే ఆ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, నియమ నిష్టలు అనుసరించాలేమో అనుకుంటారు. కానీ ఇందులో ప్రత్యేకంగా పాటించే సంప్రదాయాలేవీ లేవు. అన్నీ కేవలం మనిషి ఆత్మకు సౌకర్యమైనవీ, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేవీ మాత్రమే. అలాగే శ్రీమాతాజీ సహజ వివాహాలను ప్రవేశపెట్టారు. వివిధ దేశాలకు చెందిన యువతీ యువకులకు ... కుల, మత, జాతి, వర్ణ, ప్రాంతాలకు అతీతంగా, వారి పరస్పర అంగీకారంతో వివాహాలు జరిపించేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. సహజయోగ సాధకులు అన్ని మతాల దైవాలనూ, ప్రవక్తలనూ సమానంగానే పరిగణిస్తారు. ‘అందరూ ఒక్కరే’ అనే భావనతోనే ఆరాధిస్తారు.

‘నిన్ను నువ్వు తెలుసుకో’... ఇదే అన్ని మతాలలోని మూల సారాంశం. అదే సత్యం. ‘‘భగవంతుడనేవాడు ఎక్కడో కాదు... నీలోనే, నీ ఆత్మగా ఉన్నాడు. నువ్వు ఆత్మస్వరూపుడిగా పరిణామం చెందాలి. అదే పరమ సత్యం, వాస్తవం. ఎన్నో జన్మల ఈ సత్యాన్వేషణ... సహజయోగంలో... ఆత్మ సాక్షాత్కారంతో ముగుస్తుంది. అదే మానవ జన్మ పరమార్థం’’ అని శ్రీ మాతాజీ నిర్మలాదేవి స్పష్టం చేశారు.

• డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

Updated Date - 2023-05-18T23:54:53+05:30 IST