NRI: బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తి హత్య కేసులో దోషులుగా ముగ్గురు స్థానికులు

ABN , First Publish Date - 2023-06-16T21:00:05+05:30 IST

గతేడాది లండన్‌లో భారత సంతతి వ్యక్తి హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు దోషిలుగా తేలారు. లండన్‌లో గతేడాది కరమ్‌జీత్ సింగ్‌ మరణానికి వెస్లీ, నేథన్, బాబీ కారకులని స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. వచ్చే నెలలో నిందితులకు శిక్ష ఖరారవుతుంది.

NRI: బ్రిటన్‌లో  భారత సంతతి వ్యక్తి హత్య కేసులో దోషులుగా ముగ్గురు స్థానికులు

ఎన్నారై డెస్క్: గతేడాది లండన్‌లో(London) భారత సంతతి వ్యక్తి(Indian Origin) హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు దోషులుగా(Convicted of Murder) తేలారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన వుడ్ గ్రీన్ క్రౌన్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. కరమ్ జీత్(31) మరణానికి వెస్లీ ఏంజెల్(33), అతడి సోదరుడు నేథన్ ఏంజెల్(24), మరో వ్యక్తి బాబీ డన్‌లీవీ(26) కారకులంటూ తీర్పు వెలువరించింది. కరమ్‌జీత్‌ను వెస్లీ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత నేథన్, బాబీ కరమ్‌జీత్ వద్దు ఉన్న వస్తులను దొంగిలించేందుకు ప్రయత్నించారు. జులైలో నిందితులకు శిక్ష ఖరారు కానుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కరమ్‌జీత్ సింగ్ రీల్(31) అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్టుంటాడు. దీంతో, నేథన్, వెస్లీ, బాబీల కన్ను అతడిపై పడింది. అతడి వద్ద ఉన్న డబ్బు ఇతర వస్తువులను దోచుకునేందుకు ప్లాన్ చేశారు. బాబీ అప్పటికే కరమ్‌జీత్ వద్ద పలుమార్లు డ్రగ్స్ కొనుగోలు చేశాడు. దీంతో, కరమ్‌జీత్ ఎక్కడ ఉండేది అతడు నేథన్, వెస్లీలకు చెప్పాడు. ఘటన జరిగిన రోజున వారు ముందుగా కరమ్‌జీత్ ఇంటి ఎదురుగా ఉన్న పబ్‌కు చేరుకున్నారు. బాధితుడిని ఇంటి నుంచి బయటకు రప్పించాక ఏం చేయాలో మరోసారి గుర్తు చేసుకున్నారు. అనంతరం బాబీ డ్రగ్స్ కొంటానంటూ కరమ్‌జీత్‌ను బయటకు రప్పించాడు.

ఆ తరువాత వెస్లీ, నేథన్‌లో అతడిని బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ ముదరడంతో వెస్లీ అకస్మాత్తుగా కరమ్‌జీత్ ఛాతిలో పొడిచాడు. అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులకు సాక్ష్యాలు దొరకకుండా నాశనం చేశారు. అయితే, కరమ్‌జీత్ ఇంటి నుంచి పబ్ వరకూ పలు చోట్ల రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేయగా ముగ్గురి బాగోతం బయటపడింది. నిందితులకు ఏ శిక్ష వేసినా సరిపోదంటూ కరమ్‌జీత్ తల్లి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-16T21:06:07+05:30 IST