NRI: అమెరికాలో షాకింగ్ ఘటన.. ఈత కోసం వెళ్లిన భారతీయ యువకుల దుర్మరణం
ABN , First Publish Date - 2023-04-23T19:16:53+05:30 IST
అమెరికాలో రెండు రోజుల క్రితం గల్లంతైన ఇద్దరు భారతీయ యువకుల ఉదంతం చివరకు విషాదాంతమైంది.
ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) రెండు రోజుల క్రితం గల్లంతైన ఇద్దరు భారతీయ యువకుల ఉదంతం చివరకు విషాదాంతమైంది. ఈతకు వెళ్లిన వారు సరస్సులో మునిగి మరణించారు. ఇటీవలే వారి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. ఇండియానా(Indiana) రాష్ట్రంలో చదువుకుంటున్న సిద్ధాంత్ షా(19), ఆర్యన్ వైద్య(20), మరికొందరు స్నేహితులతో కలిసి ఏప్రిల్ 15న ఇండియానాపొలిస్‌కు 64 మైళ్ల దూరంలో ఉన్న మన్రో సరస్సులో ఈతకు వెళ్లారు.
ఈ క్రమంలో అకస్మాత్తుగా నీటిలో మునిపోతున్న వారిని గుర్తించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది(Indian Youth Drown in Lake). యువకుల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన స్థానిక అధికారులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో వాతావరణం అనుకూలించక అధికారుల ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 16న ఈదులు గాలులు, వర్షం కారణంగా అధికారులు వెంట తెచ్చుకున్న యంత్రాలు మొరాయించాయి. దీంతో, యువకుల ఆచూకీ కనిపెట్టడం క్లిష్టంగా మారింది. చివరకు ఏప్రిల్ 18న యువకులిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
విద్యార్థుల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. షా, వైద్య ఇద్దరూ ఇండియానా యూనివర్సిటీలోని కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకున్నారు. 2021లో వైద్య సైకమోర స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నాడు. వైద్య మరణ వార్తపై స్కూల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. వైద్య మరణంతో విషాదంలో మునిగిపోయిన విద్యార్థులకు అండగా నిలుస్తామని పేర్కొంది.