Viral: కోర్టులో షాకింగ్ సీన్.. పోలీసులు నిందితుడి బేడీలు తొలగించగానే..
ABN , First Publish Date - 2023-03-13T20:28:36+05:30 IST
అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలోని ఓ కోర్టులో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మరికొద్ది క్షణాల్లో హత్య కేసులో విచారణ ప్రారంభమవుతుందనంగా.. నిందితుడు అందరూ చూస్తుండగానే పరారయ్యాడు.
ఎన్నారై డెస్క్: అమెరికాలోని(USA) ఓరేగాన్(Oregon) రాష్ట్రంలో ఇటీవల ఓ కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మరికొద్ది క్షణాల్లో హత్య కేసు విచారణ ప్రారంభమవుతుందనంగా.. నిందితుడు అందరూ చూస్తుండగానే పరారయ్యాడు. దీంతో.. అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను పోలీసులు తాజాగా విడుదల చేశారు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. ఈడీ విలియాబోస్ జూనియర్(28) ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో అతడిని జ్యూరీ సెలక్షణ్ ప్రక్రియ కోసం కోర్టు హాలులో హాజరుపరిచారు. ఆ తరువాత పోలీసులు అతడి చేతులకున్న బేడీలు తొలగించారు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న నిందితుడు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు(Suspect Escapes from courtroom). పోలీసులు అతడిని వెంబడించినా ఉపయోగం లేకపోయింది.
అయితే.. పోలీసులు నిందితుడి కోసం రెండు గంటల పాటు తీవ్రంగా గాలించిన పోలీసులు అతడి జాడ కనిపెట్టారు. ఓ అపరిచితుడి అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఓ బీరువా మాటున దాక్కున్న అతడిని అరెస్ట్ చేసి జైల్‌కు తరలించారు. అయితే..నిందితుడిని పట్టుకునే క్రమంలో ఎటువంటి అవాంఛిత ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే.. పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.