NRI: న్యూజెర్సీలో నాట్స్ బోర్డ్ సమావేశం

ABN , First Publish Date - 2023-03-08T20:46:41+05:30 IST

న్యూజెర్సీలో నాట్స్ బోర్డ్ సమావేశం

NRI: న్యూజెర్సీలో నాట్స్ బోర్డ్ సమావేశం

  • సంబరాల నిర్వహణతో పాటు అనేక కీలక అంశాలపై చర్చ

ఎడిసన్, మార్చ్ 5: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు న్యూజెర్సీలో తాజాగా సమావేశమైంది. మే లో న్యూజెర్సీలో జరగనున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలపై ప్రధానంగా నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో చర్చించారు. అంగరంగ వైభవంగా అమెరికా తెలుగు సంబరాలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లు, రూపొందించే కార్యక్రమాలను నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీథర్ అప్పసాని వివరించారు. తల్లిదండ్రులను గౌరవించుకునే సరికొత్త కార్యక్రమం పేరెంట్స్ గ్రీట్ అండ్ మీట్ సంబరాలకే ప్రత్యేకంగా నిలుస్తుందని శ్రీథర్ తెలిపారు. యువతకు ప్రత్యేకంగా జలీనియల్ అనే కార్యక్రమం, బిజినెస్ ఫోరమ్, ఉమెన్స్ ఫోరమ్, ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ, థమన్‌ల సంగీత విభావరులు ఉండనున్నాయన్నారు.

అమెరికాలో తొలిసారిగా మహిళా అష్టావధానం వంటి ప్రత్యేక సాహితీ కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాలీబాల్, టెన్నిస్ టోర్నమెంట్ వంటి క్రీడా పోటీలు ఇంకా ఎన్నో కార్యక్రమాల గురించి శ్రీధర్ వివరించారు. ఆహ్వాన కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, బాన్క్వెట్ కమిటీ, రిజిస్ట్రేషన్, ఫుడ్, వాలంటీర్, వెండర్ కమిటీ, సూవెనీర్, ఆడియో విసువల్, డెకొరేషన్ వంటి పలు కమిటీలు తమ తమ టీమ్ ల పురోగతిని పవర్ పాయింట్ ద్వారా ప్రదర్శించారు.

2.jpg

నాట్స్ అమెరికా తెలుగమ్మాయి కార్యక్రమాన్ని న్యూజెర్సీ చాప్టర్ ఘనంగా నిర్వహించినందుకు నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణ గంటిని సభ్యులు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు సంబరాలతో నాట్స్ కార్యక్రమాల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి వివరించారు. ఇటీవల పెరిగిపోతున్న గుండెపోటు కేసులపై కూడా నాట్స్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. గుండె జబ్బులు, హఠాత్తుగా గుండెపోటు వస్తే చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేయనున్నట్టు నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మధు కొర్రపాటి తెలిపారు.

తెలుగువారికి నాట్స్ మరింత చేరువయ్యేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి తెలిపారు. నాట్స్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు.. నాట్స్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను బోర్డు సభ్యులకు తెలియచేశారు. భాషే రమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా లలిత కళావేదిక ద్వారా కళలు, సాహిత్య కార్యక్రమాలు, తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధికి నాట్స్ మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మెడికల్ క్యాంపులు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేయబోతున్నట్టు బాపు నూతి వివరించారు.

నాట్స్ ఉన్నతికి, చేపట్టబోయే కార్యక్రమాల్లో పటిష్ట నిర్వహణ నాట్స్ బోర్డు సభ్యులు తమ సలహాలు, సూచనలు అందించారు. ఈ సమావేశంలో అమెరికా నలు మూలల నుండి సంబరాల కమిటీ కోర్ కమిటీ సభ్యులు, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు, బోర్డు సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు విచ్చేసి నాట్స్ సేవా మరియు సంబరాల సన్నాహకాలపై చర్చించి పలు సూచనలు చేసారు. అందరికీ ఆతిధ్యమందించిన ఆహ్వాన కమిటీ సభ్యులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2023-03-08T20:46:41+05:30 IST