NRI Couple: రెండేళ్ల తర్వాత సొంతూరికి తిరిగొచ్చిన ఎన్నారై దంపతులు.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీద్దామని వెళ్తే షాకింగ్ ట్విస్ట్.. !

ABN , First Publish Date - 2023-10-06T17:01:54+05:30 IST

పంజాబ్‌కు చెందిన ఓ ఎన్నారై జంట భారత్‌లోని ఓ బ్యాంకులో దాచుకున్న సొమ్మును బ్యాంకు మేనేజరే కాజేశాడు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితుడి కోసం పోలీసుల గాలిస్తున్నారు.

NRI Couple: రెండేళ్ల తర్వాత సొంతూరికి తిరిగొచ్చిన ఎన్నారై దంపతులు.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీద్దామని వెళ్తే షాకింగ్ ట్విస్ట్.. !

ఎన్నారై డెస్క్: ఎన్నారైలు ఇండియాలో ఉండరనే ధీమాతో వారి సొత్తుపై అక్రమార్కులు కన్నేస్తున్న ఘటనలు తరచూ ఎక్కడో చోట వెలుగు చూస్తున్నాయి. రెండు మూడు ఏళ్ల తరువాత ఇండియాకు వస్తున్న ఎన్నారైలు తమ సంపద పరుల హస్తగతమైందని గ్రహించి లబోదిబోమంటున్నారు. ఇది చాలదన్నట్టు ఏళ్లపాటు కొనసాగే కోర్టు కేసులు వారికి మరింతగా మనోవేదన మిగులుస్తున్నాయి. తాజా ఘటనలో ఓ మేనేజర్ దుర్బుద్ధి కారణంగా ఓ ఎన్నారై జంట బ్యాంకులో దాచుకున్న సొమ్ము కోల్పోవాల్సి వచ్చింది(NRI Couple duped of Rs.14.63 lakhs by banker).

పంజాబ్‌లోని(Punjab) లూథియానాకు(Ludhiana) చెందిన సునితా రాణి, ఆమె భర్త రామ్ స్వరూప్ 2008లో ఫిన్‌ల్యాండ్‌కు వెళ్లారు. విదేశాలకు వెళ్లేముందు వారు స్థానికంగా ఉన్న సెంట్యూరియన్ బ్యాంకులో ఓ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ తరువాత ఫిన్‌ల్యాండ్‌లో ఉంటూ రెండేళ్ల పాటు విడతల వారీగా మొత్తం రూ.14.63 లక్షలను ఇక్కడి అకౌంట్‌కు బదిలీ చేశారు. ఆ తరువాత ఇండియాకు వచ్చిన వారు ఇక్కడ ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బ్యాంకులో తాము దాచుకున్న డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్లో చిల్లగవ్వ కూడా లేనట్టు బయటపడింది. అప్పటికే సెంట్యూరియన్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కింద మారిపోయింది. అప్పటి బ్యాంకు మేనేజర్(Banker) రజనీశ్ శర్మ కూడా ఖన్నాలోని మరో బ్యాంకుకు మారిపోయాడు.


తొలుత ఎన్నారై జంట రజనీశ్ శర్మను తమ డబ్బు ఏమైందంటూ నిలదీశారు. తనకేమీ తెలీదంటూ అతడు బుకాయించాడు. కానీ బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడు డబ్బు తిరిగిచ్చేస్తానని వారికి హామీ ఇచ్చాడు. కానీ ఎంతకాలానికీ అతడి నుంచి స్పందన లేకపోవడంతో బాధితులు చివరకు 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ అయ్యింది.

కాగా, నిందితుడు రజనీశ్ నకిలీ సంతకాలతో ఎన్నారైల డబ్బులు కాజేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఆ డబ్బును అతడు కొన్ని ఆర్థికసాధనాల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో, నిందితుడిపై పోలిసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - 2023-10-06T17:01:56+05:30 IST