NRI Husband: నా భర్తను ఎవరో చంపేశారంటూ పొద్దున్నే గగ్గోలు పెట్టిన భార్య.. మేడ మీద పడుకున్న వాళ్లంతా కిందకు దిగి చూస్తే..!
ABN , First Publish Date - 2023-10-06T21:38:19+05:30 IST
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎన్నారై హత్య కేసులో కోర్టు తాజాగా అతడి భార్య, స్నేహితులను దోషులుగా తేల్చింది. అక్టోబర్ 7న నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది.
ఎన్నారై డెస్క్: తన భర్తను ఎవరో అర్ధరాత్రి గొంతుకోసి చంపేశారంటూ ఓ మహిళ గగ్గోలు పెట్టింది. ఇరుగుపొరుగు వారందరూ జరిగింది తెలుసుకుని తల్లడిల్లిపోయారు. మహిళకు అండగా నిలిచారు. ఈలోపు కేసు దర్యాప్తు చేస్తుండగా అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మృతుడి భార్యను, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. 2016లో జరిగిన ఈ ఘటనలో కోర్టు మృతుడి భార్యే నిందితురాలని తాజాగా తేల్చింది (Woman her lover convicted in NRI husband death). పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్(Uttarpradesh) షాజహాన్‌పూర్‌కు (Shahjahanpur) చెందిన సుఖ్‌జిత్ సింగ్ తన భార్య రమన్దీప్‌కౌర్, పిల్లలతో కలిసి ఇంగ్లండ్‌లోని డర్బీషైర్‌లో ఉండేవాడు. అతడికి మిట్టూ సింగ్ అనే స్నేహితుడు ఉన్నాడు. మిట్టూ సింగ్ దుబాయ్‌లో ఉంటాడు. ఇద్దరూ తరచూ ఒకరి ఇంటికి మరొకరు సెలవులకు వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో మిట్టూ సింగ్, రమన్దీప్ కౌర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ క్రమంలో 2016లో సుఖ్‌జీత్ సింగ్ తన కుటుంబంతో సహా స్వగ్రామానికి వచ్చాడు. అతడి వెంట మిట్టూ సింగ్‌కూడా వచ్చాడు. అయితే, ఆ ఏడాది జూలై 28న పక్కా పథకం ప్రకారం రమన్దీప్‌కౌర్ సుఖ్‌జీత్‌ను హత్య చేసింది. తొలుత ఇంట్లో వారందరికీ మత్తుమందు కలిపిన ఆహారం వండి పెట్టింది. అందరూ గాఢనిద్రలోకి జారుకున్నాక మిట్టూ సింగ్‌తో కలిసి తన భర్తను అంతమొందించింది. ఆ మరునాడు తన భర్తను ఆగంతుకులు చంపేశారంటూ గగ్గోలు పెట్టింది. గొంతుకోసి పోట్టనపెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా వారికి మిట్టూ, రమన్దీప్ కౌర్‌ల వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో, వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. వారిని దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అక్టోబర్ 7న శిక్షను ఖరారు చేయనున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టులోనే ఉన్న మృతుడి తల్లి తమకు న్యాయం జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిందితులకు మరణశిక్ష విధించినప్పుడే తన కొడుకు ఆత్మశాంతిస్తుందని వ్యాఖ్యానించారు.