NRI: అమెరికాలో భారతీయుడి భారీ స్కామ్.. తప్పు చేసినట్టు అంగీకరించిన నిందితుడు!

ABN , First Publish Date - 2023-08-31T21:55:30+05:30 IST

అమెరికాలో టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలను నకిలీ క్లెయిములతో మోసగించిన కేసులో ఓ భారత సంతతి వ్యక్తి తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. వచ్చే ఏడాది న్యాయమూర్తి నిందితుడికి శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.

NRI: అమెరికాలో భారతీయుడి భారీ స్కామ్.. తప్పు చేసినట్టు అంగీకరించిన నిందితుడు!

ఎన్నారై డెస్క్: అమెరికాలో టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలను నకిలీ క్లెయిములతో(Indian dupes telephone providers) మోసగించిన కేసులో ఓ భారత సంతతి వ్యక్తి తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. వచ్చే ఏడాది నిందితుడికి శిక్ష ఖరారు కానుంది.


పూర్తి వివరాల్లోకి వెళితే, నెవార్క్‌కు(Newark) చెందిన పరాగ్ భవ్సార్, మరికొందరు నిందితులతో కలిసి ఓ భారీ స్కామ్‌కు తెరలేపాడు. సెల్యూలర్ ఫోన్లు పాడయ్యాయంటూ కొత్త వాటికి కోసం టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు, ఇన్సూరెన్స్ సంస్థలకు నకిలీ దరఖాస్తులు సమర్పించేవాడు. ఆయా సంస్థలను తప్పుదారి పట్టించేందుకు వీలుగా పోస్టల్ సేవలను కూడా దుర్వినియోగ పరిచాడు. అమెరికా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నకిలీ గుర్తింపు పత్రాలతో మెయిల్ బాక్స్‌లు సిద్ధం చేశాడు. కుట్రపూరితంగా తన క్లెయిములు ఆమోదింపజేసుకున్నాక కొత్త సెల్యులర్ ఫోన్లను మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. అతడి బండారం బయటపడటంతో చివరకు పోలీసులకు చిక్కాడు.

మెయిల్ ఫ్రాడ్(Mail Fraud), దొంగ సొత్తును అంతర్రాష్ట్ర బదిలీ చేశాడంటూ నిందితుడు పరాగ్‌పై అభియోగాలు మోపినట్టు యూఎస్ అటార్నీ ఫిలిప్ ఆర్ సెలింగర్ పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. 2013 మొదలు ఆరేళ్ల పాటు అతడు నిరాటంకంగా ఈ స్కామ్ కొనసాగించాడు. అమెరికా చట్టాల ప్రకారం ఈ నేరాలకు పాల్పడ్డ వారికి గరిష్ఠంగా 20 ఏళ్ల కారాగార శిక్ష, రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-08-31T22:01:08+05:30 IST