NRI: నాన్నను జాబ్‌లోంచి తీసేస్తారని టెన్షన్.. అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందన్న భయంతో ఈ 14 ఏళ్ల బాలిక ఎంత పనిచేసిందంటే..
ABN , First Publish Date - 2023-02-11T20:11:28+05:30 IST
ఆర్కాన్సాస్ రాష్ట్రంలో ఓ ఎన్నారై బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
ఎన్నారై డెస్క్: అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వం(Layoffs) అక్కడి భారతీయుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జాబ్ కోల్పోతే ఉన్నఫళంగా ఇండియాకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ టెన్షన్ కారణంగా ఓ ఎన్నారై కుటుంబంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తండ్రికి జాబ్ పోతుందని టెన్షన్ పడ్డ ఓ 14 ఏళ్ల భారతీయ బాలిక ఇంట్లోంచి పారిపోయింది.
అర్కాన్సాస్(Arkansas) రాష్ట్రంలోని కాన్వే ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. కాన్వే ప్రాంతానికి చెందిన తాన్వీ మారుపల్లి జనవరి 17న అదృశ్యమైంది. స్కూలుకు వెళ్లిన ఆమె ఆ తరువాత కనిపించకుండా పోయింది(Indian Teen Missing). బాలిక అదృశ్యమై ఇప్పటికి మూడు వారాలు గడిచిపోయాయి. ఇదిలా ఉంటే.. తండ్రి జాబ్ పోతే ఇండియాకు వెళ్లిపోవాల్సి వస్తుందన్న భయంతోనే బాలిక ఇంట్లోంచి పారిపోయి ఉండొచ్చని(Fear of Deportation) పోలీసులు అనుమానిస్తున్నారు.
తాన్వీ తల్లిదండ్రులు కుడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తమ భవిష్యత్తు సందిగ్ధంలో పడటంతో ఆమె పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఐటీ రంగంలో పనిచేసే తాన్వి తండ్రి ఇటీవల తన ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఎదుర్కొన్నారు. దీంతో..కుటుంబంలో ఒత్తిడి తలెత్తింది. అయితే.. ప్రస్తుతం తన ఉద్యోగానికి వచ్చిన భయమేమీ లేదని ఆయన తాజాగా మీడియాకు తెలిపారు. తాన్వీ తల్లి శ్రీదేవీ కూడా కొంత కాలం క్రితం జాబ్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ఇండియాకు తిరిగొచ్చేశారు. ఆ తరువాత డిపెడెంట్ వీసాపై ఆమె తిరిగి భర్త వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి ఏడాది పాటూ తన భర్త, పిల్లలకు దూరమవ్వాల్సి వచ్చింది.