NRI: వామ్మో.. మనోళ్లు ఇంతకు తెగిస్తున్నారా..? ఒక్క ఏడాదిలోనే ఈ కారణంతో ఎంత మంది భారతీయులను అమెరికా అరెస్ట్ చేసిందంటే..
ABN , First Publish Date - 2023-02-18T19:16:45+05:30 IST
బతుకుతెరువు కోసం పరాయి దేశాలకు భారతీయులు అక్రమమార్గాల్లో వలస. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న వైనం.
ఎన్నారై డెస్క్: బతుకుతెరువు కోసం పరాయి దేశాల బాట పట్టిన భారతీయులు(Immigrants) ఎందరో..! పెద్దచదువులు చదివి కొందరు చట్టబద్ధంగా విదేశాల్లో మంచి జీవితం గుడుపుతుంటే మరికొందరు మాత్రం తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రమాదాలకు ఎదురెళుతున్నారు. విదేశాల్లో కొందరు భారతీయుల పరిస్థితి చూస్తే మనోళ్లు ఇంతకు తెగిస్తున్నారా అని అనిపించకమానదు.
అమెరికాలో ఇటీవల వెలువడిన నివేదిక ప్రకారం.. 2012-22 మధ్య కాలంలో మెక్సికో గుండా అమెరికాలో(USA) అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన(Illegal Immigrants) భారతీయుల సంఖ్య 100 రెట్లు పెరిగింది. 2012లో అమెరికా సరిహద్దు గస్తీ పోలీసులు(US border patrol police) తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయులపై 642 కేసులు నమోదు చేశాయి. 2022 నాటి కల్లా ఈ సంఖ్య 63,924కు చేరుకుంది.
అమెరికా కలను సాకారం చేసుకునే క్రమంలో భారతీయులు తమ ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. గతేడాది ఓ గుజరాతీ కుటుంబం కెనడా(Canada) నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ శీతల వాతావరణానికి బలైన ఉదంతంసంచలనం సృష్టించింది. సరిహద్దుకు 30 అడుగుల దూరంలో నలుగురు వ్యక్తులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు వదిలారు. ఇక గతేడాది జూన్‌లో అమెరికా గస్తీ దళాలు..నీట మునిగిపోతున్న ఆరుగురు భారతీయులను కాపాడాయి. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు వారిపై కేసు పెట్టాయి. ఇంగ్లిష్ ఛానల్ దాటి కొందరు భారతీయులు బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆ దేశ హోం శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఓ నివేదిక ప్రకారం.. గతేడాది 233 మంది భారతీయులు ఇంగ్లిష్ ఛానల్(English Channel) దాటుకుని బ్రిటన్‌లోకి(Britain) అక్రమంగా ప్రవేశించారు. ఇక ఈ ఏడాది జనవరి నెలలోనే ఏకంగా 250 మంది భారతీయులు బ్రిటన్‌లో అక్రమంగా కాలుపెట్టారు. శరణార్థులకు సంబంధించి బ్రిటన్ చట్టాల్లోని లోపాలను కొందరు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని బ్రిటన్ వర్గాలు చెబుతున్నాయి.