London NRI: లండన్ ఎన్నారై చేతిలో ఇద్దరు మహిళలకు చేదు అనుభవం.. ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే లక్షలు కాజేశాడు..!

ABN , First Publish Date - 2023-06-10T17:50:00+05:30 IST

మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రొఫైల్ పెట్టుకున్న ఇద్దరు యువతులకు ఊహించని అనుభవం ఎదురైంది. గిఫ్ట్ పేరిట నిందితుడి వలలో చిక్కిన ఆ ఇద్దరూ దాదాపు 23 లక్షలు పోగొట్టుకున్నారు.

London NRI: లండన్ ఎన్నారై చేతిలో ఇద్దరు మహిళలకు చేదు అనుభవం.. ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే లక్షలు కాజేశాడు..!

ఎన్నారై డెస్క్: మ్యాట్రిమోనియల్ సైట్‌లో(Matrimonial website) ప్రొఫైల్ పెట్టుకున్న ఇద్దరు యువతులకు ఊహించని అనుభవం ఎదురైంది. గిఫ్ట్ పేరిట(NRI Gift Fraud) ఓ మోసగాడు పన్నిన వలలో చిక్కిన ఆ ఇద్దరూ దాదాపు 23 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూణెకు చెందిన ఓ టెకీని నిందితుడు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సంప్రదించాడు. తనను తాను ఎన్నారైగా పరిచయం చేసుకున్న నిందితుడు లండన్‌లోని ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమంటూ ఆమెను ముగ్గులోకి దింపాడు.

ఈ క్రమంలోనే లండన్ నుంచి ఆమెకు ఓ విలువైన బహుమతిని పంపిస్తున్నానని నమ్మించాడు. ఆ తరువాత కొద్ది సేపటికే మరో వ్యక్తి నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనని తాను కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోవడంతో బహుమతిని జప్తు చేయాల్సి వచ్చిందని వివరించాడు. గిఫ్ట్‌ విడుదల చేసేందుకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో, యువతి మరో ఆలోచన లేకుండా రూ.13.53 లక్షలు ముట్టచెప్పింది.

మరో యువతిని కూడా నిందితుడు ఇదే తరహాలో బోల్తాపడేసి రూ. 9.30 లక్షలు దండుకున్నాడు. తాము మోసపోయాని చివర్లో గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా ఇద్దరు యువతులను మోసగించింది ఒక్కడేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-06-10T17:55:57+05:30 IST