NRI Family: అమెరికాలో ఈ ఎన్నారై ఫ్యామిలీకి ఏమైంది..? ఇంత హ్యాపీగా కనిపిస్తున్న వీళ్లంతా తెల్లారేసరికి నిర్జీవంగా..!
ABN , First Publish Date - 2023-10-07T15:37:56+05:30 IST
న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బొరో నగరంలో ఓ ఎన్నారై కుటుంబమంతా అకస్మాత్తుగా మృతిచెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వారిని ఎవరైనా హత్య చేశారా? లేక మరేదారుణమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే కుటంబం ఇలా హఠాత్తుగా లోకాన్ని వీడటాన్ని బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్నారై డెస్క్: చక్కని కుటుంబం. భార్యాభర్తలిద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఎన్నారై కుటుంబంలోని వారందరూ ఇటీవల హఠాత్తుగా మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందో? ఇలా అకస్మాత్తుగా వారి ఈలోకాన్ని విడిచి ఎందుకు వెళ్లిపోయారో అర్థంకాక స్థానిక ఎన్నారైలే కాకుండా ఇరుగుపొరుగు వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల న్యూజెర్సీ రాష్ట్రంలో((NRI couple, their children found dead in their plainsboro home) వెలుగు చూసిన ఘటన ఇది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తేజ్ ప్రతాప్ సింగ్‌కు (43) భార్య సోనాల్ పరీహార్ (42), పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కూతురు ఉన్నారు. వారు టైటస్ లేన్‌లో ఉంటున్నారు. భార్యాభర్త లిద్దరివీ ఐటీ ఉద్యోగాలే. అయితే, బుధవారం తనిఖీ కోసం వారింటికి వెళ్లిన పోలీసులకు కుటుంబమంతా విగతజీవులుగా కనిపించారు. ఆ కుటుంబం ఎలా ఉందో ఓసారి చూడండని పోలీసులకు ఫోన్ రావడంతో ఘటనాస్థలానికి వెళ్లిన వారికి ఈ దారుణ దృశ్యం కనిపించింది.
Viral: మహిళ చేసిన పనికి ఒక్కసారిగా కన్‌ఫ్యూజ్ అయిపోయిన దున్నపోతు.. ఏం చేయాలో తెలీక..
ఎవరో వారిని హత్య చేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని మిడిల్‌సెక్స్ కౌంటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాజాగా వెల్లడించారు. వారి పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక అసలేం జరిగిందనే దానిపై కొంత స్పష్టత వస్తుందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం లేదా సీసీటీవీ ఫుటేజీ వంటి ఆధారాలు ఉన్న వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
ఈ ఘటనపై ప్లెయిన్స్‌బోరో మేయర్ సంతాపం తెలిపారు. ఇది అత్యంత విచారకరమని అభిప్రాయపడ్డారు. మాటల్లో వర్ణించలేని దారుణమని వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందో తేల్చేందుకు పోలీసులు ఇతర ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయని భరోసా ఇచ్చారు.