NRI: ఎన్నారైలపై జగన్ కక్ష సాధింపును ఖండించిన జయరాం కోమటి
ABN , First Publish Date - 2023-01-02T16:56:15+05:30 IST
ప్రవాసాంధ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు.
ఎన్నారై డెస్క్: ప్రవాసాంధ్రుల(NRI) పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. అమెరికాలోని(USA) బే ఏరియాలో(Bay Area) పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం సాయం చేయకపోగా.. తమవంతు సాయం చేసే వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘‘గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు గారు వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా పంపిణీ జరుగుతుందని తెలిసి కూడా పోలీసులు బందోబస్తు సక్రమంగా చేయలేదు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించడం విచారకరం. జరిగిన సంఘటన పట్ల మా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. వీరి మరణానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డే బాధ్యత వహించాలి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్న అనేక బహిరంగ సభలకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా తరలివస్తున్నారు. కానీ అందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం లేదు. ప్రవాసాంధ్రుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయించడం ద్వారా భవిష్యత్తులో ఎవరూ సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు పెట్టవలసింది పోయి మంచి మనసుతో పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్, తెలుగుదేశం పార్టీ వారు కుటుంబానికి సుమారు రూ.30 లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ మాత్రం సక్రమంగా స్పందించకుండా అరకొర సాయం చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటికైనా మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని ఉయ్యూరు శ్రీనివాసరావుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి’’ అని జయరాం కోమటి డిమాండ్ చేశారు.