NRI Grooms: వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుని.. ఆపై ఎస్కేప్.. భార్యలను వదిలేసి 331 మంది ఎన్నారై భర్తలు పరార్..!
ABN , First Publish Date - 2023-10-07T15:51:02+05:30 IST
యువతులను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాక వారిని ఇండియాలోనే వదిలిపెట్టేస్తున్నారు కొందరు ఎన్నారైలు. భర్తకు దూరమైన యువతులు చివరకు పుట్టింట్లో ఉండిపోవడంతో అనేక మందిలో ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పరారీలోని ఎన్నారై ఆటకట్టించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కేసుల్లో నిందితుల ఆస్తులు అటాచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఎన్నారై డెస్క్: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 331 మంది వరుళ్లు..అందరిదీ ఒకటే తంతు. ఇండియాలో పెళ్లి చేసుకోవడం..ఓ రెండు మూడు నెలలు తరువాత భార్యలను ఇక్కడే వదిలేసి విదేశాలకు పారిపోవడం! పెళ్లిలో తీసుకునే కట్నకానుకలతో అక్కడ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడం. పంజాబ్‌లో(Punjab) ఇటీవల కాలంలో పెరుగుతున్న ధరోణి ఇది. పెళ్లి అయినా కూడా పుట్టింట్లోనే ఉండిపోతున్న అనేక మంది యువతులు తమ భవిష్యత్తు ఏమవుతోందో తెలీక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గుండెల మీద కుంపటిగా మారిన కుమార్తెలను చూసుకుని తల్లిదండ్రులకు మనశ్శాంతి అనేదే లేకుండా పోతోంది.
తమ కుమార్తెలకు ఎన్నారైల సంబంధాలే కావాలనుకునే తల్లిదండ్రుల కోరికను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాక కూడా ఎన్నారైల సంబంధాలవైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఈ ధోరణి అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. ఎన్నారై భర్తల చేతిలో మోసపోయిన ఎందరో మహిళలు చివరకు నలుగురిలో తలెత్తుకోలేక, పుట్టింట్లో ఒంటరిగా మిగిలిపోతున్నారు(NRI Grooms dumping brides after three to four months after marriage).
ఇలా ఎంతకాలం అంటూ బాధితులు గగ్గోలు పెడుతుండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. భార్యలను మోసగించి 15 ఏళ్లకు పైగా విదేశాల్లో పరారీలో ఉంటున్న ఎన్నారైల ఆటకట్టించే క్రమంలో వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. మరోవైపు, ఇలా పెళ్లిచేసుకుని పారిపోతున్న ఎన్నారైల్లో అధికశాతం బ్రిటన్‌లోనే ఉంటున్నట్టు తేలింది. తాజాగా లెక్కల ప్రకారం ఇలాంటి ఎన్నారైలు యూకేలో 46 మంది, అమెరికాలో 35 మంది, కెనడాలో 35 మంది, ఆస్ట్రేలియాలో 23 మంది ఉన్నారట. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఒకటి రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక పంజాబ్‌లోని నవాన్‌షెహర్‌లో అత్యధికంగా 42 ఎన్నారై కేసులు నమోదయ్యాయి. లూథియానా, మోగాలో కూడా చెరో 38 కేసులు వెలుగులోకి వచ్చాయి. 2018 ఇప్పటివరకూ పంజాబ్ ఎన్నారై శాఖ ఇలంటి కేసుల్లో మొత్తం 1309 మందికి నోటీసులు జారీ చేసింది. సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు, ఎన్నారై వరుళ్ల మోసాల గురించి పంజాబ్ మహిళ కమిషన్ ఇటీవల కెనడా ప్రధానికి లేఖ రాసింది. ఈ మోసాల కారణంగా ఎందరో యువతుల జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొంది. దీనిపై స్పందించిన కెనడా ప్రధాని ఈ అంశంలో అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తానని ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు.
Viral: మహిళ చేసిన పనికి ఒక్కసారిగా కన్‌ఫ్యూజ్ అయిపోయిన దున్నపోతు.. ఏం చేయాలో తెలీక..