NRI: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియాలో భారీ నిరసన
ABN , First Publish Date - 2023-09-21T14:35:35+05:30 IST
చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ సౌదీ అరేబియాలో అనేక మంది ఎన్నారైలు తాజాగా నిరసన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో లబ్ధిపొందిన అనేక మంది ఎన్నారైలు స్వచ్ఛందంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నారై డెస్క్: గత పది రోజులుగా గల్ఫ్ వ్యాప్తంగా చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా ఈ రోజు సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో అతి పెద్ద నిర్మాణ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న వందలాది స్కిల్ల్డ్ వర్కర్స్ ముఖ్యంగా చంద్రబాబు ప్రవేశ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఇండస్ట్రియల్ ఎలెక్ట్రిసియాన్స్, హెవీ ఎక్విప్మెంట్ ఆపేటర్స్, వెల్డర్స, ఇతర సాంకేతిక నిపుణులు నిరసన కార్య క్రమంలో భారీగా స్వచ్ఛందంగా పాల్గొని టీడీపీ అధినేత చంద్రబాబును తప్పుడు కేసులతో వేధించడం అన్యాయం, బాధాకరమని తీవ్ర అందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత అరెస్టుకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను ఖండించిన వారు, చంద్రబాబు ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌లో శిక్షణ పొందిన తాము నేడు సౌదీలో సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు కారణమైన చంద్రబాబుపై నేడు ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసి చంద్రబాబుకు మద్దతు తెలిపిన తనజీబు, జుబైల్, డమ్మామ్, ఖిబర్, రియాద్ చంద్రబాబు అబిమానులు అందరికి పేరుపేరునా సౌదీ అరేబియా టీడీపీ అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లా, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ తమ ధన్యవాదాలు తెలిపారు .