NRI: బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్.. ?

ABN , First Publish Date - 2023-01-02T22:29:23+05:30 IST

కన్న కొడుకును హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఓ అమెరికా మిలియనీర్‌(Millionaire) శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించారు.

NRI: బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్.. ?

ఎన్నారై డెస్క్: కన్న కొడుకును హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఓ అమెరికా మిలియనీర్‌(Millionaire) శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించారు. అమెరికా సుప్రీం కోర్టు ఆమె బెయిల్ రద్దు చేసిన కొద్ది గంటలకే ఆమె తన ఇంట్లో విగత జీవిగా కనిపించడంతో ఆత్మహత్య చేసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మా రంగంలో మిలియనీర్‌గా ఎదిగిన గీగీ జార్డన్(Gigi Jordan, 62) 2014లో కన్న కొడుకును హత్య కేసులో దోషిగా తేలారు. ఆటిజమ్ వ్యాధితో బాధపడుతున్న తన ఎనిమిదేళ్ల కొడుకుకు మందుల మిశ్రమం ఇచ్చి అంతమొందించిందన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది.

కొడుకుతో పాటూ గీగీ కూడా ఆ మందుల మిశ్రమం తాగి ఆత్మహత్యకు యత్నించిందని, కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. ఆత్మహత్య చేసుకోబోతున్న విషయాన్ని గీగీ ముందుగా తన బంధువుకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం గీగీ వాదనను కొట్టిపారేశారు. కొడుకు ఓవైపు మరణం అంచున ఉండగా.. గీగీ అతడి ట్రస్ట్ ఫండ్‌ నుంచి కొంత డబ్బును తన పేరిట అకౌంట్లో వేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో..2020లో కోర్టు గీగీకి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసుపై అప్పీలుకు వెళ్లిన ఆమెకు ఆ తరువాత బెయిల్ మంజూరైంది. తాజాగా సుప్రీం కోర్టు బెయిల్‌ను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలోనే ఆమె తన నివాసంలో విగత జీవిగా కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-01-03T00:49:50+05:30 IST