NRI: రాస్ అల్ ఖైమాలో ‘తెలుగు తరంగిణి’ రక్తదాన కార్యక్రమం
ABN , First Publish Date - 2023-07-03T20:33:35+05:30 IST
రాస్ అల్ ఖైమా కేంద్రంగా పనిచేసే తెలుగు తరంగిణి అనే తెలుగు ప్రవాసీయుల సంస్థ ఈసారి రాస్ అల్ ఖైమాలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎదుటి వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో రక్తం కోసం కొట్టుమిట్టాడుతుండగా, సాటి మనిషిగా మన శరీరంలో జీవధారగా ప్రవహిస్తున్న రక్తంలో కొంచెం ధారపోసి బతికిస్తే, సాటి మనిషి.. మనిషి కాదు దేవుడవుతాడు. ఈ రకంగా మనుషులకు దేవతలుగా మారే ఆవకాశం ఇస్తుంది రక్తదాన కార్యక్రమం. పేరుకు రక్తదానమైనా వాస్తవానికి ఇది జీవన దానం.
విభిన్న కార్యక్రమాలు నిర్వహించే దుబాయి మరియు యు.ఏ.ఇలోని ఇతర ఎమిరేట్లలలో తెలుగు ప్రవాసీయులు ఈ విషయంలో మాత్రం కాస్త వెనుకబడినట్లుగా చెప్పక తప్పదు. వైవిధ్యభరిత తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు వీలయినప్పుడల్లా సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టే రాస్ అల్ ఖైమా కేంద్రంగా పనిచేసే తెలుగు తరంగిణి అనే తెలుగు ప్రవాసీయుల సంస్థ ఒక అడుగు ముందుకువేసి ఈసారి రాస్ అల్ ఖైమాలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రభుత్వ అధ్వర్యంలోని అల్ సఖర్ వైద్యశాలలో ఇటీవల జరిగిన రక్తదాన కార్యక్రమంలో తెలుగు తరంగిణి పిలుపు మెరకు ఏమిరేట్స్‌లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలోని తెలుగు ప్రవాసీయులు వచ్చి రక్తదానాన్ని చేసారు. 278 పడకల ఆసుపత్రి అయిన ఇందులో పెద్ద సంఖ్యలో అత్యవసర వైద్య సేవలను నిరంతరం అందిస్తూ ప్రాణాలను కాపాడుతుందనే పేరొందింది. రక్తదాన కార్యక్రమాన్ని డాక్టర్ స్వామి, తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్ సమన్వయం చేసి నిర్వహించారు. తెలుగు ప్రవాసీయుల రక్తదాన స్ఫూర్తిని కొనియాడుతూ తెలుగు తరంగిణికి ఆసుపత్రి ప్రత్యేక ప్రశంస పత్రాన్ని అందించింది.
కార్యక్రమంలో రక్తదాన దాతలతో పాటు తెలుగు తరంగిణి బృందం సభ్యులు చిరుతనగండ్ల శ్రీనివాస రావు, అనిల్, కేదార్, రాఘవేంద్ర రవి, బ్రహ్మానంద రెడ్డి, శ్రీకాంత్, రాజేష్ చమర్తి, సత్యానంద రావు కోకా, గురు రాఘవేంద్ర, దిరిసిల ప్రసాద్, శివానంద రెడ్డి, విజయ్, డాక్టర్ రమ్య, రామ ప్రియ, హంసవేణి, హర్షవర్ధిని, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు తరంగిణి సంస్ధ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని వెంకట సురేష్ పెర్కొంటూ రక్తదానం చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.