Kadiam Srihari OHRK : కాంగ్రెస్ గ్రాఫ్ కాస్త పెరిగింది
ABN , First Publish Date - 2023-07-17T00:37:25+05:30 IST
ఏంటి శ్రీహరి గారూ.. ఒకప్పుడు మీకు సీటు పోటీ లేదు. ఇప్పుడు ఆ సమస్య వచ్చినట్టుంది..? ఇప్పుడు కూడా ఏ సమస్య లేదు. నేను హ్యాపీగా ఉన్నా. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. చిన్న స్థాయి నుంచి డిప్యుటీ సీఎం స్థాయికి వచ్చా. రాజకీయాల్లో నిరాశ ఏమీ లేదు. నా వయసు 71 ఏళ్లు. సీఎం కేసీఆర్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటాను. అడగకుండానే.

అయినా ఆ పార్టీ బీఆర్‌ఎస్‌కు పోటీ కాదు
కుమ్ములాటలతో కమలం కనుమరుగు
రాష్ట్రంలో మూడోసారీ మాదే అధికారం
20% బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత
దళితబంధు అందరికీ అందకుంటే ఇబ్బంది
ఘన్‌పూర్ వెళ్లి.. డిస్టర్బ్ చేయాలని లేదు
ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే జాలేస్తుంది
అవినీతిపై జగన్ మాట్లాడితే నవ్వొస్తుంది
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కడియం శ్రీహరి
ఏంటి శ్రీహరి గారూ.. ఒకప్పుడు మీకు సీటు పోటీ లేదు. ఇప్పుడు ఆ సమస్య వచ్చినట్టుంది..?
ఇప్పుడు కూడా ఏ సమస్య లేదు. నేను హ్యాపీగా ఉన్నా. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. చిన్న స్థాయి నుంచి డిప్యుటీ సీఎం స్థాయికి వచ్చా. రాజకీయాల్లో నిరాశ ఏమీ లేదు. నా వయసు 71 ఏళ్లు. సీఎం కేసీఆర్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటాను. అడగకుండానే. ఆయన పిలిచి నన్ను డిప్యుటీ సీఎంను చేశారు. నా రాజకీయ జీవితంలో రెండు అనుకోని ఘటనలు జరిగాయి. 1994లో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు ఎన్టీఆర్ సీఎం అయ్యారు. రాజ్ భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ కార్యక్రమం పాస్ నాకు ఇవ్వలేదని ఎన్టీఆర్‌ని అడిగాను. ఆయన నన్ను రూంలోకి తీసుకెళ్లి.. ‘ ప్రమాణ స్వీకారం చేసే వాడివి.. నువ్ ఏందయ్యా పాస్ అడుగుతున్నావ్’ అన్నారు. ఆయన కారులోనే రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేశా. తెలంగాణ వచ్చాక వరంగల్ ఎంపీగా గెలిచా. 2015 జనవరిలో గాదరి కిషోర్ రిసెప్షన్‌కు నేను, కేసీఆర్ ఒకే కారులో నల్లగొండకు బయలుదేరాం. అప్పుడు వరంగల్ లోక్ సభకు ఎన్నికలొస్తే మనం గెలుస్తామా..? అని కేసీఆర్ అడిగారు. అలా అడగడంతో ఆశ్చర్యపోయా. తప్పకుండా గెలుస్తాం అని చెప్పా. రాత్రి 8.30 గంటలకు చెప్పారు.. 25న నువ్వు మంత్రిగా, డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నావు.. ఎవరికీ చెప్పొద్దని అన్నారు.
తర్వాత మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు..?
వీలైతే మళ్లీ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారు. నేను ఓకే అన్నా. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలనే కోరిక లేదు. ఒకసారి ఫుల్ టర్మ్ ఎంపీగా పనిచేయాలని నా కోరిక. ‘దయాకర్ పార్టీలోకి వచ్చారు. ఆయనకు ఈసారి మనం మంత్రి పదవి ఇవ్వాలి. నేను పార్లమెంటుకు వెళతా..’ అని కేసీఆర్, కేటీఆర్‌తో చెప్పా. ఎంపీగా అవకాశం చూద్దామని అన్నారు. ఏం జరిగిందో ఏమో దయాకర్‌నే కొనసాగించారు.
ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశ లేదా?
అదేం లేదు. ఘన్‌పూర్ పోయి పోటీ చేయాలని, అక్కడ ఎవరినో డిస్టర్బ్ చేయాలనే ఆలోచన లేదు.
మీ కూతురికి రాజకీయాలపట్ల ఆసక్తి ఉన్నట్లుంది?
ఆమె ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఓ రోజు కేసీఆర్ మా ఇంట్లో భోజనానికి వచ్చినపుడు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా..? అని మా పాపను అడిగారు. అవును అని చెప్పింది. ఓకే.. ‘ఐ విల్ టేక్ యూ ఇన్ టూ మై టీమ్’ అన్నారు. అమ్మాయికి ఆసక్తి ఉంది. అవకాశాలు కూడా రావాలి కదా.
మీరు ఎస్సీనే కాదని ఆరోపణ ఉంది..?
కొంత మందికి చదువుకున్నా, వయసు పెరిగినా.. సభ్యత, సంస్కారం ఉండవు. కొంత మందికి పుట్టుకతోనే అవలక్షణాలు ఉంటాయి. వాటిని నివారించలేం. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని సుప్రీం కోర్టు తీర్పులు, చట్టం ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా మాట్లాడే వాళ్లను చూస్తే జాలేస్తుంది.
ఈ మధ్య కేటీఆర్.. రాజయ్యను పిలిచి క్లాస్ పీకాడు కదా..? మిమ్మల్ని ఏం అనలేదా..?
నన్ను పిలవలేదు. ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. నేను కూడా రాజయ్య మాటలకు వివరణ ఇచ్చా. నాకు ఎక్కడెక్కడో ఆస్తులు ఉన్నాయని ఆరోపించాడు. నా జీవితం తెరిచిన పుస్తకం. ఆస్తులు ఉంటే దాచి పెట్టలేం కదా.
సర్పంచ్ నవ్యతో రాజయ్యపై ఆరోపణలు మీరే చేయించారని ఆయన కోపమని ఒక అభిప్రాయం..?
ఆ వివాదం ముగిసిందని రాజయ్య చెప్పారు. తాను మాట్లాడనని చెప్పారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడటం బాగుండదేమో..?
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటైపోయాయనే ప్రచారంవల్ల మీ పార్టీకి నష్టం జరిగింది కదా..?
మీరు చెప్పిన కారణంతో పాటు నేను ఇంకోటి చెబుతా. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చాలా ప్రభావం చూపాయి. ఆ ఫలితాల కంటే ముందు బీజేపీ తెలంగాణలో ఒక రకంగా ఉండేది.. తర్వాత బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. రెండోది.. బీజేపీలో ఎన్నడూ చూడని అంతర్గత కుమ్ములాటలు తెలంగాణలో చాలా బాహాటంగా బయటపడ్డాయి. దీంతో బీజేపీకి అనుకూలమైన కొంత ఓటు బ్యాంకు.. కాంగ్రె్‌సకు అనుకూలంగా మారే వాతావరణం కనిపించే సరికి.. కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరిగినట్టు అనిపిస్తోంది. అంతే తప్ప.. కాంగ్రెస్ మాకు పోటీ కాదు. వంద శాతం మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ సీఎం అవుతారు. కొద్ది మంది ఎమ్మెల్యేల (ఓ 20 శాతం మంది) పట్ల వ్యతిరేకత ఉంది. వంద శాతం మూడోసారి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇప్పుడు బీఆర్‌ఎ్‌సకు కొంత ఉక్కపోత వాతావరణం ఏర్పడింది. దీని నుంచి ఎలా బయటపడతారు..?
నాకున్న సమాచారం ప్రకారం.. 14-15 శాతం ఓట్లు బీజేపీకి వస్తాయి. ఓట్లకు ఇంకా 3 నెలలు ఉంది. అది ఇంకా దిగజారి 8-10 శాతానికి చేరుతుందా..? చూడాలి. కాంగ్రెస్ ఒకప్పుడు 18 శాతం ఉండేది.. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో 25-35 శాతానికి పెరిగింది. మేం నేటికీ చాలా నియోజకవర్గాల్లో 45-60 శాతం పాజిటివ్ ఓట్లతో ఉన్నాం. కొన్ని నియోజకవర్గాల్లో అసలే ప్రతిపక్ష అభ్యర్థే లేరు.
దళిత బంధు అద్భుతమైన పథకం అన్నారు. అదే మీకు గుదిబండ అవుతుందని మిగతా వాళ్లు అంటున్నారు..?
లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నప్పుడు, అందరికీ మేం ఇవ్వలేనప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. దళిత బంధును సంతృప్త స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యం ఉంది. అది ఏడాదిలో చేయలేం కదా. ఐదేళ్లలో చేయాలనేది కేసీఆర్ ఆలోచన.
బడులపై కేసీఆర్ మనుమడి వ్యాఖ్యలపై...
బీఆర్‌ఎస్ సర్కారు వచ్చాక రాష్ట్రంలో ఎక్కువ గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. 1019 గురుకులాలు, అవిగాక 475 కేజీబీబీలు, 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇవన్నీ రెసిడెన్షియల్. ఇంటర్ వరకు ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ఆకర్షితులవుతున్నారు. అయినా, ఇంకా సదుపాయాలు, వసతులు పెంచాలి.
ఆ విషయంలో ప్రవీణ్ కుమార్‌ను మెచ్చుకోవాలి?
ఆయన కాంట్రిబ్యూషన్‌ను కాదనలేం. కేసీఆర్‌ది పాలసీ. ప్రవీణ్ అమలు చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి తొమ్మిదేళ్లయింది. మా దగ్గర 8.6 లక్షల మంది పిల్లలు గురుకులాల్లో చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతున్నాం.?
మరోసారి మిమ్మల్ని ఎమ్మెల్యేగా,మంత్రిగా చూడొచ్చా?
అది కేసీఆర్ నిర్ణయించాలి. నాకు నేను ప్రకటించుకునే పరిస్థితి ఉండదు. అవకాశాలు వచ్చినా రాకున్నా కేసీఆర్, బీఆర్‌ఎ్‌సతో ఉంటా. నాకు 71 ఏళ్లు. ఈ టర్మ్ పోటీ చేస్తా. దానికేదో కక్కుర్తి పడి ఆగం కావాల్సిన అవసరం లేదు.
కేజీబీవీల అభివృద్ధికి కృషి చేశా..
దేశవ్యాప్తంగా 6,7,8 తరగతుల్లో బాలికల డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఎనిమిదో తరగతి తర్వాత వారు ఏ బడికి వెళ్లాలనేదానిపై ప్రణాళిక లేదు. ఈ క్రమంలో నేను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్‌కు ఒక ప్రతిపాదన ఇచ్చా. కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని చెప్పా. ఆయన నన్ను అభినందించి.. జాతీయ స్థాయిలో బాలికల విద్య మీద పరిశోధన చేయడానికి ఒక కమిటీ వేసి, నన్ను చైర్మన్‌ను చేశారు. నేను ఐదారు రాష్ట్రాల్లో స్టడీ చేసి ఒక నివేదిక ఇచ్చా. దాంతో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసింది. అలా ఒక చిన్న ఆలోచన ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న 5 వేల కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసింది.
జగన్ మాట్లాడితే నవ్వొస్తుంది..
ఆంధ్రా పరిస్థితిని చూస్తే ఒక్కోసారి నవ్వొస్తుంది. జాలి కూడా వేస్తుంది. పూర్తిగా సమాజాన్ని కులం వైపు తీసుకెళ్లారు. కుల ఆధారిత సమాజాన్ని చేసి, కుల రాజకీయాలు చేస్తున్నారు. మంచి పేరున్న ఆంధ్రా అంతా ఆగం అయిపోయింది. అప్పుడప్పుడూ జగన్ మాట్లాడే రెండు మాటలు వింటే నవ్వొస్తుంది. ఆయన అవినీతిపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెబుతుంటాడు. అవినీతిపై జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన మీదనే సీబీఐ అనేక కేసులు పెట్టింది. అనేక కేసుల్లో ఏ-1గా ఉన్నాడు. రెండోది.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని అంటాడు. నేను మొన్న చూశా.. ఆయన దేశంలోనే రిచెస్ట్ సీఎం అయి ఉండి.. అలా ఎలా మాట్లాడతారు. ?