Renu Desai: ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. రిక్వెస్ట్ చేస్తూనే వార్నింగ్ ఇచ్చిన రేణూ దేశాయ్..!
ABN , First Publish Date - 2023-08-10T18:16:59+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. ఇటీవల చిరంజీవి వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన అధికార వైసీపీకి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ స్పందన ఝలక్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. ఇటీవల చిరంజీవి వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన అధికార వైసీపీకి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ స్పందన ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై ఆమె స్పందిస్తూ.. దయచేసి తమ పిల్లలను రాజకీయాల్లోకి లాగవద్దని అభ్యర్థించారు. తమ బిడ్డలు సినీ కుటుంబంలో పుట్టారని, తమ బిడ్డల తండ్రి నటుడు, రాజకీయ నేత అని పవన్ కల్యాణ్ గురించి రేణు దేశాయ్ ప్రస్తావించారు. అభిమానులు, నేతలు, విమర్శకులకు తానే విజ్ఞప్తి చేస్తున్నానని, తన పిల్లలనే కాదు, ఏ పిల్లలనూ, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె కోరారు. పర్సనల్ అజెండా ఉంటే.. మీరూ మీరూ చూసుకోండని హితవు పలికారు. తాను మొదటిరోజు నుంచి పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ఉన్నానని, సమాజానికి మంచి చేయాలని పవన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆమె చెప్పారు. పవన్‌కల్యాణ్ వంటి వ్యక్తి అరుదుగా ఉంటారని, పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనేదే పవన్ తపనంతా అని, రాజకీయంగా పవన్‌కు తన మద్దతు ఉంటుందని సినీ నటి రేణు దేశాయ్ కుండబద్ధలు కొట్టారు.
ఈ పరిణామంతో అధికార వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. రేణూ దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తమ సొంత మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ 2019 ఎన్నికల ప్రచారంలో చేసిన హడావిడి అంతాఇంతా కాదు. మూడు పెళ్లిళ్లంటూ అప్పుడూ.. ఇప్పుడూ ఎద్దేవా చేస్తున్న వైసీపీకి రేణూ దేశాయ్ స్పందన మింగుడుపడని పరిస్థితి కనిపిస్తోంది. ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగవద్దని రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలతో పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తే పద్ధతిగా ఉండదని పరోక్షంగా వైసీపీని హెచ్చరించినట్టయింది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి రేణూ దేశాయ్ అప్పటి ఇంటర్వ్యూ వీడియోలను వైరల్ చేయాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్లాన్ చేసింది. కానీ.. రేణూ దేశాయ్ తాజా స్పందనతో వైసీపీకి పెద్ద షాకే తగిలింది.
పవన్ కూడా ఇప్పటికే వైసీపీ నేతలకు ఊర మాస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘మూడు పెళ్లిళ్లు.. మూడు పెళ్లిళ్లు.. అంటున్నారు. మీరూ చేసుకోండి.. మూడు పెళ్లిళ్లు! ఎవరు కాదన్నారు. మొదటి భార్యకు, నాకు కుదరకపోతే విడాకులు ఇచ్చి రూ.5 కోట్లు డబ్బులిచ్చి.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా. రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చేసి మూడోసారి పెళ్లి చేసుకున్నాను. విడాకులిచ్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను. ఒక్కరిని పెళ్లి చేసుకుని ముప్పై మంది స్టెప్నీలతో తిరిగే మీరేంటి నాకు చెప్పేది.. వెధవల్లారా? మీరు క్రిమినల్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. నేను సిద్ధాంతంతో కూడుకున్న రాజకీయం చేస్తున్నా’’ అని జనసేన అధినేత కాస్త గట్టిగానే వైసీపీకి బదులిచ్చారు.