KCR KamaReddy: కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకోవడానికి కారణం ఏంటో ఎట్టకేలకు తెలిసింది..!

ABN , First Publish Date - 2023-08-22T15:20:28+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఈసారి స్వయంగా సీఎం కేసీఆరే బరిలో ఉండనున్నారు. జిల్లాలోని మరో మూడు నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ కేటాయిస్తూ కేసీఆర్‌ ప్రకటించారు.

KCR KamaReddy: కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకోవడానికి కారణం ఏంటో ఎట్టకేలకు తెలిసింది..!

కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఈసారి స్వయంగా సీఎం కేసీఆరే బరిలో ఉండనున్నారు. జిల్లాలోని మరో మూడు నియోజక వర్గాల్లోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ కేటాయిస్తూ కేసీఆర్‌ ప్రకటించారు. కేసీఆర్‌ ప్రకటించిన టికెట్ల జాబితాలో గంప గోవర్ధన్‌కు చోటు దక్కలేదు. ఆ స్థానంలో కేసీఆర్‌ పోటీ చేయనున్నారు. దీంతో జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్లు దక్కుతాయోననే దానిపై ఉత్కంఠకు తెర దింపారు. ముందస్తుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాన్సువాడ,ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు, ఆ ఎమ్మెల్యేల అనుచరులు సంబరాల్లో మునిగితేలారు. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీచేయడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు ముఖ్యనేతలు స్వాగతించారు. పార్టీ శ్రేణులు సైతం సంబరాలు జరుపుకున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసేందుకే..

జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. అయితే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో మరింత రాణించేందుకే కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గాన్ని టార్గెట్‌ చేసినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీంతో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ మరింత బలం పెంచుకునేందుకే కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేయవచ్చనే భావనలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా కేసీఆర్‌ బరిలో ఉంటే నాలుగు ఎంపీ సీట్లయిన నిజామాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ప్రభావితం చూపవచ్చనే భావనలో కేసీఆర్‌ ఉన్నారని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇలా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో నేపథ్యంలోనే కామారెడ్డి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

కామారెడ్డిలో కేసీఆర్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పదోసారి గజ్వేల్‌ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీచేయనున్నారు. 1983లో మొదటిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో సిద్దిపేట నియోజకవర్గం నుంచే పోటీచేసి గెలిపొందగా అప్పటినుంచి కేసీఆర్‌ ఓటమినే ఎరగలేదు. వరుసగా సిద్దిపేట నియోజకవర్గం నుంచే 1989,1995,1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన తర్వాత రాజీనామా చేసిన ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 2004 ఎన్నికల్లోను సిద్దిపేట నుంచే గెలుపొందారు. 2006లో కరీంనగర్‌ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2008లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలుపొందారు. 2014లోను గజ్వేల్‌ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. 2018లోను అక్కడి నుంచే పోటీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోను కేసీఆర్‌ పోటిచేయనున్నారు.


కేసీఆర్‌ పూర్వీకులది కోనాపూర్‌

సీఎం కేసీఆర్‌ తల్లి వెంకటమ్మ స్వస్థలం కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్‌ గ్రామం. తండ్రి రాఘవరావుది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం మోహిని కుంట. రాఘవరావు వెంకటమ్మ వివాహం చేసుకున్న తర్వాత కోనాపూర్‌ ఇల్లరికం వచ్చారు. అప్పట్లో రాజన్న సిరిసిల్లలో అప్పర్‌ మానేరు ప్రాజెక్టు నిర్మించడంతో కోనాపూర్‌ గ్రామం ముంపునకు గురైంది. ఆ సమయంలో రాఘవరావుకు చెందిన వందలాది ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. దీంతో కేసీఆర్‌ కుటుంబం సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకుంది. గత ఏడాది కిందట బీబీపేట మండలం కోనాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కేటీఆర్‌ వచ్చారు. ఆ సమయంలో తన నానమ్మ నివాసం ఉన్న కోనాపూర్‌లోని ఇంటిని మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. తమ సొంత ఊరుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో కేటీఆర్‌ కోనాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను రూ.2.5 కోట్ల సొంత నిధులతో నిర్మించారు. పాఠశాల భవనమే కాకుండా ఆ గ్రామంలో పలు బీటీ, సీసీ రోడ్లు కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే ఈ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

కేసీఆర్‌ సామాజికవర్గం అంతంతే..

కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్‌కు చెందిన సామాజిక వర్గం అంతంతమాత్రంగానే ఉంది. ఇక్కడ వెల్మ ఓట్లు సుమారు 2 వేల వరకు మాత్రమే ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కువగా ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన 31 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. తర్వాత మైనార్టీ ఓట్లు 28 వేలు, మున్నూరు కాపు ఓట్లు 16 వేలు, వైశ్యులవి 16 వేలు, ఆర్య క్షత్రియులవి 2 వేల ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,27,807 ఉండగా ఇందులో పురుషులవి 1,10,056 ఓట్లు ఉన్నాయి. మహిళలవి 1,17,787, థర్డ్‌ జండర్‌వి 28 ఉన్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గంప గోవర్ధన్‌ 4557 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. అప్పటి ఎన్నికల్లో 1,62,231 ఓట్లు పోల్‌ కాగా బీఆర్‌ఎస్‌ నుంచి గంపగోవర్ధన్‌కు 68,167 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీకి 63,610 ఓట్లు వచ్చాయి.

Updated Date - 2023-08-22T15:22:53+05:30 IST