BRS: ఇద్దరూ టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినవాళ్లే.. కానీ గొడవేంటో గానీ..

ABN , First Publish Date - 2023-04-02T15:23:54+05:30 IST

గతేడాది జనవరిలో పార్టీ జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

BRS: ఇద్దరూ టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినవాళ్లే.. కానీ గొడవేంటో గానీ..

- నియోజకవర్గం దాటలేని స్థితిలో జిల్లా అధ్యక్షుడు

- పార్టీ వ్యవహారాల్లోనూ ఇన్‌చార్జ్‌ మంత్రి జోక్యం

- కార్యక్రమాలకు ఇరువురి నుంచి సందేశాలు

- మంత్రితోనే ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సత్సంబంధాలు

- గందరగోళంలో హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ శ్రేణులు

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): గతేడాది జనవరిలో పార్టీ జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. పేరుకు అధ్యక్షుడే అయినా సొంత నియోజకవర్గం దాటి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు చాలా అరుదు. గతంలో నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించాలని అగ్రనేతలు ఆదేశించినా.. రెండు, మూడు నియోజకవర్గాల్లో మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో మీటింగ్‌లు జరగలేదు. ఇతర నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లోనూ అధ్యక్షుడి హోదాలో ఆయన పెద్దగా హాజరైన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అసలు జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టా లేనట్టా అని పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇద్దరి నుంచి సమాచారం

జిల్లా స్థాయిలో పార్టీ వ్యవహారాలకు సంబంధించి సమన్వయం, దిశానిర్దేశం చేసే బాధ్యత అధ్యక్షుడిది. కానీ హైదరాబాద్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పార్టీ వ్యవహారాల్లోనూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ సమావేశాలు, బహిరంగసభలకు జన సమీకరణ, ఆందోళన కార్యక్రమాల సమాచారాన్ని పార్టీ శ్రేణులకు మంత్రి పంపుతున్నారు. అదే సమయంలో కొందరికి మాగంటి కార్యాలయం నుంచి సందేశాలు వెళ్తుండడంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి.

ఆ ఇద్దరి మధ్య ఏముంది?

తలసాని, మాగంటి ఇద్దరూ టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చినవారే. టీడీపీలో ఉన్నపుడు సైతం ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. బీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. అధిష్ఠానం ఆదేశాలతో ఐక్యత ప్రదర్శిస్తున్నారా లేక పాత విషయాలను మరచిపోలేకపోతున్నారా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలోని బీఆర్‌ఎస్‌లో మెజార్టీ టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఉన్నారు. మునుపటి నుంచి వారితో సంబంధాలు ఉన్నందునే మాగంటికి కేసీఆర్‌ అధ్యక్ష పదవి ఇచ్చారని చెబుతారు. అయితే పార్టీ కార్యక్రమాలను మంత్రి తలసాని హైజాక్‌ చేస్తుండడంతో గోపీనాథ్‌ మిన్నకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా మంత్రితో పనులుంటాయన్న ఉద్దేశంతో తలసానితో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - 2023-04-03T09:24:28+05:30 IST