Vizag Steel Plant : సీఎంవో నుంచి మంత్రి సీదిరికి సడన్‌గా ఫోన్ కాల్.. కంగారు పడుతూ కాల్ లిఫ్ట్ చేయగా..!
ABN , First Publish Date - 2023-04-13T22:13:25+05:30 IST
ఇంతకీ సీఎంవో నుంచి ఫోన్ వెళ్లగా సీదిరి ఏం మాట్లాడారు..? అధిష్ఠానం ఇచ్చిన హెచ్చరికలు ఏంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ వ్యవహారం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని.. బిడ్ వేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత మరో మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడటం ఓటు హక్కు కూడా తెలంగాణకు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా.. నిన్న, మొన్నటి వరకూ స్నేహంగా కలిసున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఒక్కసారిగా పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు మారిపోయాయ్. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) చేసిన కామెంట్స్‌కు.. ఏపీ మంత్రులు (AP Ministers) కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు నోరు జారి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) గురించి, ఆయన కుటుంబ సభ్యులు, పేర్లు ప్రస్తావించి మరీ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క ఏపీలోనే (Andhra Pradesh) కాదు.. తెలంగాణలో (Telangana) కూడా పెద్ద చర్చకే దారితీశాయి. ఈ వ్యాఖ్యలను ఏపీ సీఎంవో (AP CMO) సీరియస్‌గా తీసుకుంది. ఇంతకీ సీఎంవో నుంచి ఫోన్ వెళ్లగా సీదిరి ఏం మాట్లాడారు..? అధిష్ఠానం ఇచ్చిన హెచ్చరికలు ఏంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
సీఎంవో నుంచి ఫోన్ కాల్..!
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి సీదిరి గురువారం ఉదయం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కేసీఆర్, కేటీఆర్ , కవిత (MLC Kavitha), హరీష్ రావులు అందరూ ప్రాంతీయ వాదులు అంటూ తెలుగు ప్రజలను ఒకింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీదిరి వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. ఇవాళ రాత్రి సీఎంవో నుంచి సీదిరికి ఫోన్ కాల్ వచ్చిందట. కంగారుపడుతూ కాల్ లిఫ్ట్ చేసిన మంత్రికి అవతలి వ్యక్తి ఓ రేంజ్‌లో తలంటారట. ‘మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి..? ఎవరి గురించి మాట్లాడుతున్నామనేది..? తెలుసుకుని మాట్లాడాలి. ఎవరిపై అయినా కామెంట్స్ చేసేముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేతల స్థాయి ఏంటి..? ఏం మాట్లాడుతున్నాం..? అనే విషయాలు దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. మీరు మాట్లాడిన మాటలు అస్సలు బాగోలేవు. ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి.. మరోసారి ఇలా మాట్లాడకండి’ అని గట్టిగానే సీదిరికి తలంటారట. ఈ మాటలకు అస్సలు మంత్రి నోరు మెదపలేదట. కాదు.. కాదు నోరు తెరిచే ఛాన్స్ కూడా అవతలి వ్యక్తి ఇవ్వలేదని వైసీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. అనధికారికంగా జరగాల్సిందంతా జరిగిపోయిందట.
ఇంతకీ సీదిరి ఏమన్నారబ్బా..!?
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఏపీలో ఒక్కొక్కరుగా మంత్రులు, ముఖ్యనేతలు మీడియా ముందుకొచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్న సీదిరి అప్పలరాజు కూడా పనిలో పనిగా మీడియా ముందుకొచ్చేశారు. కౌంటర్ ఇవ్వడం, విమర్శించడం ఓకే కానీ.. ఆ కామెంట్స్ మరీ ఓవర్‌గా మాట్లాడటం, అది కూడా వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడంతో చిక్కుల్లో పడ్డారు మంత్రి. ‘హరీష్ రావు కూడా వాళ్ల మామ కేసీఆర్ లాగా కల్లు తాగాడేమో, కల్లు తాగిన కోతి లాగా ఒళ్లు కొవ్వెక్కింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరంతా ప్రాంతీయ ఉగ్రవాదులు. మా వాళ్లు తెలంగాణ రావడం మానేస్తే అక్కడేం ఉండదు అడుక్కు తినడం తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా?. ఓ కోశానైనా జాతీయవాదం ఉందా?. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారు. తెలంగాణ రాజకీయాలు ఏపీలో ఏమాత్రం పని చేయవు’ అని సీదిరి వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇంకా రాయడానికి వీల్లేని కామెంట్స్ కూడా మంత్రి చేశారు. ఈ వ్యాఖ్యలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.
మొత్తానికి చూస్తే.. గత కొన్నిరోజులుగా మంత్రి సీదిరి ప్రవర్తన సర్లేదని, ఈ మధ్య అనవసరంగా వివాదాల్లో తలదూరుస్తున్నారని గత నెలలో స్వయంగా సీఎం జగన్ పిలిచి క్లాస్ తీసుకున్నారు. ఆ కథ మరిచిపోక మునుపే ఇప్పుడు మళ్లీ ఇలా సీఎంవో నుంచి కాల్ వెళ్లడం పెద్ద చర్చకే దారితీసింది. సో.. ఇకనైనా సీదిరి నోరు అదుపులో పెట్టుకుంటారో లేకుంటే మరింత విర్రవీగుతారో అని సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనుకుంటున్నారట. ఫైనల్‌గా సీదిరి ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి మరి.