TS Politics : ఎన్నికల ముందు కేసీఆర్ మరో ప్లాన్.. బీఆర్ఎస్‌లో చేరిన కొద్ది రోజులకే ‘ఆయన’కు కీలక పదవి
ABN , First Publish Date - 2023-09-08T22:20:29+05:30 IST
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో అయితే కాస్త టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ ప్రత్యర్థి పార్టీల నేతలకు ‘కారు’లో చోటిస్తున్నారు...
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో అయితే కాస్త టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ ప్రత్యర్థి పార్టీల నేతలకు ‘కారు’లో చోటిస్తున్నారు. అంతేకాదు.. ఫలానా నేత వల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపడుతుంది.. గెలుపులో అతని అవసరం ఉంటుందనుకుంటే కచ్చితంగా ఏదోలా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం.. పదవి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు బాస్. ఈ మధ్యనే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన పలువురు నేతలకు తగిన ప్రాధాన్యతే కల్పించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌కు గుడ్ బై కారెక్కిన నుంచి తెల్లం వెంకట్రావుకు కేవలం మూడ్రోజులకే భద్రాచలం టికెట్ దక్కింది. ఇక టికెట్లు ఇచ్చేపరిస్థితి నేతలకు ఏదో ఒక పదవి కట్టబెడుతున్నారు కేసీఆర్.
ఇదీ అసలు సంగతి..
జహీరాబాద్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వై. నరోత్తం (Yerpula Narotham) జులై-06 తారీఖున బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పిన కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నరోత్తంతో ఈ ఎన్నికల్లో అవసరం ఉందని.. ఎస్సీ సమాజిక వర్గానికి మరింత దగ్గరకావడానికి కేసీఆర్ ఓ ప్లాన్ వేశారు. నరోత్తమ్‌ను ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు కేసీఆర్. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్వర్వులను కేసీఆర్ ఆదేశాలతో శుక్రవారం రాత్రిమంత్రి తన్నీరు హరీశ్ రావు.. ఏర్పుల నరోత్తమ్‌కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎంకు ఈ సందర్భంగా నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. అంటే.. కారెక్కిన అతి కొద్దిరోజుల్లోనే ఈయనకు పదవి దక్కిందన్న మాట.
ఎవరీ నరోత్తమ్..?
కాగా.. జహీరాబాద్‌కు చెందిన నరోత్తమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు కాలువల డిజైన్లలో ఈయన పాత్ర కీలకం. ఈయన సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జీగా.. ఆ తర్వాత వికారాబాద్‌లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించింది. అయితే.. రాజకీయాల్లోకి రావాలని తన వంతుగా ప్రజాసేవ చేయాలని భావించిన ఆయన 2008లో పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ తరఫున పోటీచేసినా కలిసిరాలేదు. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నరోత్తమ్.. జులై-06న బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో సీనియార్టీ, పలు శాఖల్లో పనిచేసిన అనుభవం, సామాజిక వర్గం కలిసి రావడంతో నరోత్తమ్‌కు ఈ పదవి వరించింది. చూశారుగా.. ఫలానా వ్యక్తితో పార్టీకి లాభం ఉంటుందంటే అలాంటివారికి మాత్రమే పదవులు వస్తాయని.. తమకు మాత్రం ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసినా రాలేదని కొందరు బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.