Free Fire Love Affair: సీమా-సచిన్ పబ్జీ ప్రేమ మాదిరిగానే ‘ఫ్రీ ఫైర్’ ప్రేమకథ.. చదువు పేరుతో పేరెంట్స్ కళ్లుగప్పి..
ABN , First Publish Date - 2023-08-03T18:38:18+05:30 IST
సీమా హైదర్, సచిన్‌ల ప్రేమకథ గురించి అందరికీ తెలిసిందే. పబ్జీ గేమ్ పుణ్యమా అని ఆన్‌లైన్‌లో కలుసుకున్న వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అంతే.. సీమా హైదర్ తట్టాబుట్టా సర్దుకొని, పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చింది...
సీమా హైదర్, సచిన్‌ల ప్రేమకథ గురించి అందరికీ తెలిసిందే. పబ్జీ గేమ్ పుణ్యమా అని ఆన్‌లైన్‌లో కలుసుకున్న వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అంతే.. సీమా హైదర్ తట్టాబుట్టా సర్దుకొని, పాకిస్తాన్ నుంచి భారత్‌కి అక్రమంగా వచ్చింది. అక్రమంగా బార్డర్ దాటడం వల్ల ఎదురయ్యే పర్యావసానాల గురించి ఆలోచించకుండా.. ప్రియుడి కోసం పిల్లలతో సహా ఇక్కడికి వచ్చేసింది. మే నెలలో ఆమె భారత్‌లో అడుగుపెట్టగా.. ఇప్పటికీ ఈ వ్యవహారం చల్లారలేదు. ఓవైపు ఈ లవ్ స్టోరీ వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు సీమా-సచిన్ గ్రేటర్ నోయిడాలో కాపురం పెట్టేశారు. సరిగ్గా ఇలాంటి ప్రేమకథే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే.. ఇక్కడ అమ్మాయి విదేశీయురాలు కాదు, మన భారతీయురాలే. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ.. ఓ యువకుడితో ప్రేమలో పడిన యువతి, అతనితో కలిసి జీవించేందుకు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
గోరఖ్‌పూర్‌లోని పీపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మొబైల్‌లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు బిహార్‌కు చెందిన సూరజ్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం మొదలుపెట్టిన వీరి మధ్య ప్రేమ చిగురించింది. రోజులు గడిచేకొద్దీ.. వీరి ప్రేమ మరింత బలపడుతూ వచ్చింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించేసుకున్నారు. దీంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమను పెద్దలు కచ్ఛితంగా ఒప్పుకోరన్న ఉద్దేశంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోవాలని ఫిక్స్ అయ్యారు. ప్లాన్ ప్రకారం.. జులై 31వ తేదీన ఆ యువతి ఇంట్లో వాళ్లకు తెలియకుండా, బిహార్‌లోని పట్నాలో ఉండే తన ప్రియుడి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరు తమ బ్యాగులు సర్దుకొని.. జంప్ అయ్యారు.
మరోవైపు.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమార్తె ఇంకా తిరిగి రాకపోవడంతో, యువతి తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. కానీ, ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. రెండు రోజుల తర్వాత.. ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా పరిచయమైన యువకుడితో తమ కుమార్తె పారిపోయిందని పేరెంట్స్‌కి తెలిసింది. దీంతో.. వాళ్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమ కుమార్తెని వెతికిపెట్టాలని పోలీసుల్ని కోరారు. తమ కుమార్తె చదువుకుంటోందని చెప్పి ఎప్పుడూ మొబైల్‌లో గేమ్ ఆడుతుండేదని పేరెంట్స్ పేర్కొన్నారు. తమ కుమార్తె నిజంగానే చదువుకుంటోందన్న ఉద్దేశంతో తాము ఆమెపై ధ్యాస పెట్టలేదని, చదువు పేరుతో రాత్రంతా ఆమె గేమ్ ఆడుతున్న విషయం తమకు తెలియలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.