Viral: చిన్న పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చేముందు కాస్త ఆలోచించండి.. లేకపోతే ఇదిగో ఇలాంటి షాక్‌లు తినాల్సి వస్తుంది..

ABN , First Publish Date - 2023-02-04T21:02:57+05:30 IST

స్మార్ట్‌ఫోన్ల యుగంలో పుట్టిన పిల్లలకు ఫోన్ దొరికితే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. తన కుమారుడు స్మార్ట్‌ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడని భావించిన ఓ తండ్రికి చివరకు భారీ షాక్ తగిలింది.

Viral: చిన్న పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చేముందు కాస్త ఆలోచించండి.. లేకపోతే ఇదిగో ఇలాంటి షాక్‌లు తినాల్సి వస్తుంది..

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ల యుగంలో పుట్టిన పిల్లలకు ఫోన్ దొరికితే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. తన కుమారుడు స్మార్ట్‌ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడని భావించిన ఓ తండ్రికి చివరకు భారీ షాక్ తగిలింది. ఏకంగా 80 వేల రూపాయల మేరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవ్వడంతో దిమ్మతిరిగింది. అమెరికాలోని(USA) మిషిగన్ రాష్ట్రంలో(Michigan) వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కీత్‌ స్టోన్‌హౌస్‌కు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఓ రోజు ఆయన భార్య తన స్నేహితులను తీసుకుని సినిమాకు వెళ్లింది. కీత్ మాత్రం తన కుమారుడిని చూసుకునేందుకు ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే కీత్ ఫోన్‌ను అతడి కుమారుడు మేసన్ చేతికి చిక్కింది. దీంతో.. బుడ్డోడు తండ్రి ఫోన్లోని ఓ యాప్ ద్వారా వరుస పెట్టి ఫుడ్ ఆర్డరిచ్చాడు(Kid orders food). కుమారుడు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడని భావించిన కీత్ అసలేం జరుగుతోందో పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా చివర్లో అతడికి దిమ్మతిరిగినంత పనైంది. ఆహారం డెలివరీ చేసేందుకు కార్లు కీత్ ఇంటికి వరుస కట్టాయి. పదే పదే డోర్ బెల్ మోగడంతో కీత్‌కు వెర్రెత్తిపోయింది. ఏం చేశావంటూ కుమారుడిని ప్రశ్నించగా.. పిజ్జా వచ్చిందా అని కొడుకు ప్రశ్నించడంతో కీత్‌కు నవ్వాలో కోపగించుకోవాలో అర్థం కాలేదు.

‘‘ఫోన్‌ చూస్తే.. బోలెడన్ని మెసేజీలు. ఫుడ్ డెలివరీ అవుతోదంటూ వరుస పెట్టి సందేశాలు. మరోవైపు బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతూ కనిపించింది’’ అని కీత్ చెప్పుకొచ్చాడు. అయితే.. ఈ ఘటన గురించి వెలుగులోకి వచ్చాక యాప్‌ వారు కీత్‌కు ఏకంగా 1000 డాలర్ల విలువైన వోచర్చు ఇచ్చారు. మొదట్లో బాగా కోపంగా అనిపించింది కానీ..జరిగిన ఘటనను ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నవ్వాగట్లేదని కీత్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-02-04T21:02:58+05:30 IST