Colombian jungle : అడవిలో 40 రోజుల జీవితం తర్వాత తొలిసారి నోరువిప్పిన ఆ నలుగురు పిల్లలు.. వారి తొలి మాట వింటే కన్నీళ్లు ఆగవు..
ABN , First Publish Date - 2023-06-12T11:31:39+05:30 IST
అమెజాన్ అడవిలో విమానం కూలిపోవడంతో తల్లిని కోల్పోయిన నలుగురు బాలలు 40 రోజులపాటు అష్టకష్టాలు అనుభవించారు. వీరిలో పెద్ద అమ్మాయి
న్యూఢిల్లీ : అమెజాన్ అడవిలో విమానం కూలిపోవడంతో తల్లిని కోల్పోయిన నలుగురు బాలలు 40 రోజులపాటు అష్టకష్టాలు అనుభవించారు. వీరిలో పెద్ద అమ్మాయి తన తోబుట్టువులు ముగ్గురిని చాలా చాకచక్యంగా వ్యవహరించి కాపాడింది. వీరిని కాపాడిన సహాయక బృందంతో వీరు మాట్లాడిన మొదటి మాటలు అందరికీ తీవ్ర ఆవేదనను కలిగిస్తాయి. ‘‘నాకు ఆకలేస్తోంది’’, ‘‘మా అమ్మ చనిపోయింది’’ అని వారు దీనంగా చెప్పడంతో, వారిని కాపాడినవారు వారిని అనునయిస్తూ, ‘‘మేము మీ స్నేహితులం’’ అని చెప్పి సముదాయించారు.
అమెజాన్ ఏరియాలోని అరరక్యురా నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని శాన్ జోస్ డెల్ గ్వావియారే పట్టణానికి మే 1న బయల్దేరిన సెస్నా 206 విమానం కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది.దీనిలో పదమూడేళ్లు, తొమ్మిదేళ్లు, ఐదేళ్లు, ఒక ఏడాది వయసుగల నలుగురు పిల్లలతో ఓ తల్లి, పైలట్, మరొకరు ప్రయాణించారు. వీరిలో ఈ నలుగురు పిల్లలు మినహా మిగిలిన ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.
40 రోజులపాటు విస్తృత గాలింపు తర్వాత నలుగురు పిల్లలను కాపాడిన రెస్క్యూ బృందంతోనూ, స్థానికులతోనూ ఓ టీవీ చానల్ మాట్లాడింది. ఈ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లెస్లీ వయసు 13 ఏళ్లు. ఆమె ఒక ఏడాది వయసుగల తన తమ్ముడిని చంకలో ఎత్తుకుని పరుగులు తీస్తూ తన వద్దకు వచ్చిందని సహాయక బృందంలోని సభ్యుడు నికోలాస్ ఒర్డోనెజ్ గోమ్స్ చెప్పారు. లెస్లీ మొట్టమొదటి మాటలు ‘‘నాకు ఆకలేస్తోంది’’ అని చెప్పారు. ఇద్దరు మగ పిల్లలో ఒకరు క్రింద పడుకుని ఉన్నాడని, తాము అక్కడికి వెళ్లటాన్ని గమనించి, లేచి కూర్చుని, ‘‘మా అమ్మ చనిపోయింది’’ అని చెప్పాడని తెలిపారు.
తాము వెంటనే వారిని సముదాయించామని, ‘‘మేం మీ స్నేహితులం, మమ్మల్ని మీ కుటుంబ సభ్యులు పంపించారు. మీ నాన్న, మీ అంకుల్ పంపించారు’’ అని చెప్పామన్నారు.
ఈ పిల్లల తండ్రి మాన్యుయెల్ మిల్లర్ రనోక్ విలేకర్లతో మాట్లాడుతూ, విమాన ప్రమాదంలో తన భార్య మగ్దలీనా ముకుటుయ్ తీవ్రంగా గాయపడిందని, ఆమె నాలుగు రోజుల వరకు సజీవంగానే ఉందని చెప్పారు. ఆ సమయంలో తమ పిల్లలు ఆమె వద్దనే ఉన్నారన్నారు. ఈ విషయాన్ని లెస్లీ తనకు చెప్పిందన్నారు. ఆమె చనిపోయే ముందు పిల్లలతో మాట్లాడుతూ, ‘‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మీ నాన్న గారిని కలుసుకోండి. ఆయన నాలాగే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు’’ అని చెప్పిందని తెలిపారు. అడవిలోని చెట్ల వేర్లు, పండ్లు, మొక్కలను తింటూ ప్రాణాలను కాపాడుకున్నట్లు లెస్లీ చెప్పిందని తెలిపారు. ఈ నలుగురు పిల్లలకు కొలంబియా రాజధాని నగరం బొగోటాలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వీరు ప్రస్తుతం కోలుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Modi ji thali : మోదీ అమెరికా పర్యటన.. ‘మోదీజీ థాలీ’ని ప్రారంభించిన అమెరికన్ రెస్టారెంట్..
NDA : కొత్త పార్లమెంటులో ‘సెంగోల్’ ప్రతిష్ఠ.. తమిళులకు అమిత్ షా టార్గెట్..