Viral: మాత్రలకు బదులుగా భర్త వాడే ఇయర్ బడ్స్‌ను మింగేసిందో భార్య.. ఆలస్యంగా గ్రహించి డాక్టర్ల దగ్గరకు వెళ్తే..!

ABN , First Publish Date - 2023-09-14T15:58:56+05:30 IST

మాత్రలకు బదులు ఎయిర్‌పాడ్ మింగిన అమెరికా మహిళ తనకేం జరుగుతుందోనని రోజంతా టెన్షన్ పడిపోయింది. మర్నాడు అది శరీరంలోంచి బయటకు వచ్చేయడంతో ఊపిరి పీల్చుకుంది.

Viral: మాత్రలకు బదులుగా భర్త వాడే ఇయర్ బడ్స్‌ను మింగేసిందో భార్య.. ఆలస్యంగా గ్రహించి డాక్టర్ల దగ్గరకు వెళ్తే..!

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్లైనా అప్పుడప్పుడూ చిన్ని చిన్ని పొరపాట్లు చేస్తుంటారు. మతిమరుపు కారణంగా వస్తువులు మర్చిపోవడం, లేదా ఒక టాబ్లెట్ బదులు మరో టాబ్లెట్ వేసుకోవడం లాంటివన్నమాట! కానీ ఓ మహిళ చేసిన పనికి మాత్రం నెటిజన్లు షాకయిపోతున్నారు. ఏ లోకంలో ఉన్నావుతల్లీ.. అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. తాను చేసిన పొరపాటు గురించి ఆ మహిళే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అమెరికాలో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

జరిగింది ఏంటంటే.. అమెరికాకు చెందిన టానా బార్కర్(American woman) ఓ రియలెస్టేట్ ఏజెంట్. తరచూ టిక్‌టాక్ వీడియోలు చేసే ఆమెకు ఫాలోవర్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఆమె తన స్నేహితురాలితో కలిసి జాగింగ్‌కని బయటకు వచ్చింది. కాస్త దూరం పరిగెత్తాక అలిసిపోయిన విటమిన్ టాబ్లెట్ వేసుకోవాలనుకుంది. స్నేహితురాలితో మాట్లాడుతూనే జేబులోంచి ఎయిర్‌పాడ్స్‌లో ఒకటి బయటకు తీసి నోట్లో వేసుసేకుంది. ఆపై మంచి నీళ్లు కూడా తాగింది(woman swallows airpod). ఆ వెంటనే ఆమెకు ఏదో తేడా కొట్టినట్టు అనిపించింది. గొంతుకలోకి సునాయసంగా కడుపులోకి జారిపోవాల్సిన టాబ్లెట్ ఎంత సేపటికీ గొంతులోనే ఇరుక్కున్నట్టు అనిపించడంతో ఆమెకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.


ఆ తరువాత ఇంటికొచ్చి జేబులు చూసుకుంటే విటమిన్ టాబ్లెట్ అలాగే ఉండగా ఓ ఎయిర్‌పాడ్ మాత్రం కనిపించలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది.. తాను ఎయిర్‌పాడ్ మింగానని! దీంతో కంగారు పడ్డ మహిళ పరుగుపరుగున డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటూ వైద్యులను తెగ టెన్షన్ పడిపోతూ అడిగింది. అయితే, ప్రస్తుతానికి భయపడాల్సింది ఏమీ లేదని డాక్టర్ ఆమెకు సర్ది చెప్పారు. తెల్లారేసరికల్లా అది శరీరంలోంచి బయటకు వచ్చేస్తుందని భరోసా ఇచ్చారు.

రెండు ఎయిర్ పాడ్స్ మింగలేదుకదా? అని ఆమెను మరోమారు ప్రశ్నించారు. లేదని ఆమె నమ్మకంగా సమాధానమిచ్చింది. రెండింటినీ గనుక మింగి ఉంటే వాటిల్లోని మ్యాగ్నెట్ కారణంగా అవి రెండు అతుక్కుపోయి కడుపులో సమస్యలు సృష్టించి ఉండేవన్నారు. ఒకటే కాబట్టి..తెల్లారాక మలంలో బయటకు వచ్చే్స్తుందని భరోసా ఇచ్చారు. వారు చెప్పినట్టుగానే మర్నాడు ఎయిర్‌పాడ్ బయటకు వచ్చేయడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాత జరిగిన ఉదంతాన్ని టిక్‌టాక్‌లో పంచుకుంది. దీంతో, ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమై కూర్చుంది(Trending News).

Updated Date - 2023-09-14T15:58:58+05:30 IST