Telugu cinema : మాట, పాట, పద్యం అన్నీ స్పాట్‌లోనే రికార్డింగ్!

ABN , First Publish Date - 2023-02-12T06:59:59+05:30 IST

అబ్బా.. రాముడు ఎంత వినయ శీలుడో కదా! వంచిన తల ఎత్తకుండా పద్యం పాడాడు అని పొగిడారట..

Telugu cinema : మాట, పాట, పద్యం అన్నీ స్పాట్‌లోనే రికార్డింగ్!
Raghupathi Venkaiah Naidu

తెలుగు సినిమా పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళితే తొంభై ఒక్కేళ్ళ చరిత్రనంతా తవ్వాలి. అలా తవ్వి పట్టకొచ్చిన తెలుగు సినిమా ఘనతను ఓసారి పరికించి చూసుకుంటే, మనవాళ్ళు పడ్డ కష్టాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉన్న ప్రతివాడూ సినిమా తీసేందుకు బయలుదేరుతుంటే, ఒకప్పుడు సినిమా అంటే మూకీ సినిమాలే సినిమాలు., అస్సలు డైలాగే లేని సినిమా నుంచి, పద్యాలు, మాటలు, పాటలంటూ తెలుగు సినిమా రోజు రోజుకూ పెరుగుతూ, కొత్తగా పుడుతూ వచ్చింది. ఇంకా లోతుల్లోకి వెళితే...

నీ పాసుగూల.,ఏం నెల్లూరోళ్ళంటే ఎక్కసెక్యాలుగా ఉండాదా అంట! నేనేం అడిగినా !? మాకసల తెలవని ఆ హిందీలో ఎందుకు నాయినా? ఒరే అబ్బాయా ఏపని చేసినా అర్థం ఉండబళ్ళా! మా నెల్లూర్లో మా తెలుగులోనే మాట్లాడాల బొమ్మ భలోడివిగున్నావే....అంటూ రెచ్చిపోతున్నాడు ఆ నెల్లూరు వినాయక హాల్లో ప్రేక్షకుడొకడు!1931 లో టాకీ మనుషులు ఆలం- ఆరా హిందీ మూవీ ప్రింట్ తీసుకుని..,మన రాష్ట్రంలో(అప్పుడది మద్రాస్ ప్రెసిడెన్సీ కంబైండ్ కదా!) వచ్చి నెల్లూరులో వినాయక హాల్లో ప్రదర్శిస్తుంటే ఓ సగటు ప్రేక్షకుడి ప్రశ్న అది!

ఎం.ఏ. ఎం.ఎల్ చదువుకున్నాయన ఒకాయన ప్రొజెక్షన్ రూం లోకొచ్చి మా నెల్లూరులో తెలుగులో మాట్లాడించడం న్యాయం కదా! హిందీ మాకు అర్థం కాదు.అని మర్యాదగా అడిగితే.. లేదండి ఏ భాషలో తీసి ఉంటే అదే వస్తుంది. మరో భాష రాదు అని చెప్పి ఒప్పించారు!

1931 మార్చి 14 న ఆలం- ఆరా రిలీజ్ అయితే..,1931 అక్టోబర్ 31 న కాళిదాస్ రిలీజ్ అయ్యింది. ఇది బహుభాషా చిత్రమనాలి. ఎవరికి వచ్చిన భాషలో వారు మాట్లాడారు హీరోయిన్ టి.పి. రాజ్యలక్ష్మి, తమిళం లోను హీరో తెలుగు లోను నారదుల వారు తెలుగు మరికొన్ని పాత్రలు హిందీలోను డైలాగ్స్ చెప్పారు మరి. 1932 - ఫిబ్రవరి 6 న తొలి పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద రిలీజ్ అయ్యింది. తీసినది హెచ్. ఎం. రెడ్డి గారు. అంటే ఇప్పటికి 91 ఏళ్ళయ్యింది. మొదటి మూకీ(మాటలు లేకుండా) రాజా హరిశ్చంద్ర(1913). తీసినది దాదాసాహెబ్ ఫాల్కే. అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అయ్యాడు. మొత్తం 7 మూకీలు తీసి చివరలో గంగావతరణ్ అని ఓ టాకీ తీయగలిగాడు.

 1.gif

గెయిటీ, క్రౌన్, గ్లోబ్ ఇవన్నీ ఏమిటి అనుకుంటున్నారా? ఇవన్నీ సినిమా థియేటర్లు. గెయిటీ మన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కట్టిన మొట్ట మొదటి సినిమాహాలు. 1912 లో కట్టారు. ఎవరు కట్టారు? తాపీమేస్త్రీలు కూలీలు అని జోకులెయ్యకండి మరి. తెలుగు చలన చిత్ర పితామహుడుగ పేరొందిన కీ.శే.రఘుపతి వెంకయ్య నాయుడు గారు కట్టించారు. భారతీయ చలన చిత్ర నిర్మాణ పరిశ్రమకు దాదాసాహెబ్ ఫాల్కే పితామహుడైతే, మనకు రఘుపతి వెంకయ్య నాయుడు ఆద్యుడు. అందుకే జాతీయ స్థాయి అవార్డులు ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ లోని ఓ విశిష్ట వ్యక్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఇచ్చి సత్కరిస్తుంది. అదే మన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు ఇస్తున్నప్పుడు, ఓ సీనియర్ మోస్ట్ దిగ్గజానికి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్ ఇచ్చి సత్కరిస్తుంది.

                                  

మచిలీ పట్నంలో పుట్టి మద్రాస్ లో ఫొటో స్టూడియో నడుపుకుంటున్న రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఆ కాలంలో 30 వేలు పెట్టి క్రోమో మెగాఫోన్ అనే కెమెరా ఎక్విప్ మెంట్ తెప్పించి, లఘు చిత్రాలు(400- 500 అడుగుల నిడివి) తీసి ప్రదర్శించేవారు. బ్రిటిష్ వారి మూకీలు కూడా ప్రదర్శించేవారు. మద్రాస్ లోని విక్టోరియా హాల్లో జార్జ్ టౌన్ లో గుడారాలేసి ప్రదర్శించేవారు. అలాగే ఆ ప్రొజెక్టర్లనీ లఘుచిత్రాలని తీసుకుని బర్మా & సిలోన్ కూడా వెళ్ళారు. కొడుకు ఆర్.ఎస్. ప్రకాష్ తో సహా! లాభాలు బాగా వచ్చాయి. వచ్చిన లాభాలతో మద్రాస్ లో మొట్టమొదటి పర్మనెంట్ థియేటర్ కట్టారు అదే గెయిటీ! ఆ తరువాత క్రౌన్ & గ్లోబ్  థియేటర్లు కూడా నిర్మించారు. కాకపోతే, అవి కట్టడానికి  శివాజి సినిమాలో రజనీకాంత్ హాస్పిటల్ కట్టడానికి ఎన్ని పాట్లు పడ్డాడో అన్నీ పడ్డాడు రఘుపతి వెంకయ్య గారు!

1916 లో నటరాజ మొదలియార్ అనే ఆసామి 1916 లో దక్షిణ భారతదేశపు మొదటి మూకీ కీచకవధ నిర్మించారు. 1921 లో రఘుపతి వెంకయ్య & ఆయన కొడుకు కలిసి మీనాక్షి కళ్యాణం తీసినా ప్రింట్ సరిగ్గా రాలేదు! 1921 లోనే భీష్మ ప్రతిజ్ఞ తీసి విజయం సాధించారు! ఇదీ మూకీ(శబ్ధ రహిత చలన చిత్ర చరిత్ర.)చరిత్ర. 1931 దాకా ఈ మూకీలే రాజ్యమేలాయి.  ఖజానా అనేది చివరి మూకీ చిత్రం. కీ, టాకీ,  బైస్కోప్, మూవీ, ఇలా డెవలప్ అయ్యింది మన సినిమా!

2.gif

అసలీసోదిఇప్పుడెందుకు!?  అని ఎవరైనా అడగొచ్చు? 91 ఏళ్ళు నిండిన తెలుగు సినిమా సందర్భంగా తెలుగు తెర కు జోహార్లు. నిజమే చరిత్ర అవసరమా! హిస్టరీ ప్రొఫెసర్లను అడిగితే చెప్తారు. చరిత్ర ప్రాముఖ్యత! ఈ పయొనీర్స్ ఆ రోజుల్లో అంత కష్ట పడారు కాబట్టే ఇప్పుడు బాహుబలులు 3- డి లు వచ్చాయి. అయినా పాత విషయాలు చరిత్ర క్రిందే వస్తాయి. చరిత్రంటేనే చాలా మందికి చిన్నచూపు! చరిత్రడక్కు చెప్పింది విను అని ఇప్పుడు డైలాగ్ చెప్పినా చరిత్రంటే ఆసక్తి , అనురక్తి ఉండాలి.

ఇప్పుడంటే పాటలకు ట్రాక్ సిస్టం ఎవరికి వీలైనప్పుడు వారొచ్చి పాడేస్తారు! వాయిద్యాలూ అంతే! అన్నీ కలిపి మిక్స్ చేసి మనకందిస్తారు! అందుకే ఎక్కడా ఎమోషనల్ గా అనిపించవు. అసలు అర్థం కూడా కాకుండా ఉన్నాయి. ప్రస్తుతం పాటలు. సొండ్ పొల్యూషన్ ఎక్కువై పోయింది! అప్పట్లో చలన చిత్రం మూకీల నుండి టాకీలకొచ్చినప్పుడు ఎన్ని అవస్థలు పడ్డారో అసలు ఊహకందని విషయం!మాట, పాట, పద్యం, అన్నీ స్పాట్ లోనే రికార్డింగ్! పద్యం చదివేవారు! పాట పాడేవారు. పద్యం గానం చేసినా చదివారనే అనే వారు! గట్టిగా గొంతెత్తి పాడాలి అది కీచుగా వినిపిస్తుంది. లేకపోతే రికార్డ్ కాదు మరి. కెమెరాలో కనపడ కూడదు కదా ఆర్కెస్ట్రా! అందుకే నటించే వారి ముందు కూర్చుని వాయిస్తుంటే మైకులు కెమెరా కన్ను గప్పి పెట్టాలి!నిల్చున్న చోటనే పాడాలి. లేదా కూర్చుని కదలకూడదు యాక్టర్లు!

3.gif

పోవుచున్నాడే నా ప్రాణ విభుని ప్రాణముల గొని అని సతీ సావిత్రి యముని వెంటబడి పోవాల్సినప్పుడు ఆర్కెస్ట్రా అంతా ఓ  ట్రాలీలో కూర్చుని యాక్టర్లూ మరో ట్రాలీలో కదుల్తూ పాడుకోవాలి!ఇక పద్యాలు, పాటలు, ఎవరివి వారే పాడుకోవాలి. పాట, పద్యం వస్తేనే, ఛాన్స్! పద్యాలు అవి కంఠస్థం చేయాలి. సంపూర్ణ రామాయణం(1936)లో రాముడుగా వేసిన ముక్కవిల్లి నారాయణ రావుకు పద్యం ఎంత చదివినా రాకుంటే పేపర్ మీద వ్రాసి క్రింద పచ్చికలో పెడితే చూచి చదివారు. అందుకే రాముడు ముఖం క్రిందకు చూస్తూ ఉంటాడు పద్యం అయ్యేంత వరకూ! అబ్బా రాముడు ఎంత వినయ శీలుడో కదా! వంచిన తలఎత్తకుండా పద్యం పాడాడు అని పొగిడారట! ఇలాంటీ బాలారిష్టాలన్నీ దాటుకుంటూ పాట పరుగులు తీయడానికి, పక్షిలా ఆకాశాన రివ్వున ఎగరడానికి, మన జీవన సరళిలో మమేకం అవడానికి, ఎన్ని అవస్థలు పడ్డదో కదా! 1932 ఫిబ్రవరి 6 న రిలీజ్ అయిన తొలి టాకీ కి జై కొట్తూ అది తీసిన హెచ్.ఎం.రెడ్డి గారికి, నటించిన మునిపల్లె సుబ్బయ్య(హిరణ్యకశిపుడు), సురభి కమలాబాయి(లీలావతి), సింధూరి కృష్ణారావు(ప్రహ్లాదుడు), ఎల్.వి.ప్రసాద్(ప్రహ్లాదుడి సహవిద్యార్థి.) వీరందరికి జోహార్లు చెప్పుకుందాం.

- Prasad Kvs

Updated Date - 2023-02-12T07:02:01+05:30 IST