Online Dating: ఆన్‌లైన్ ప్రియుడి కోసం దేశం దాటిన ప్రియురాలు.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
ABN , First Publish Date - 2023-08-02T17:38:10+05:30 IST
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఈమధ్య ‘ప్రేమ’ సరిహద్దులు దాటుతోంది. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తుల కోసం అన్నీ వదులుకొని, దేశాలు దాటేస్తున్నారు. తాజాగా ఓ యువతి కూడా అదే పని చేసింది. ఇంటర్నెట్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడ్డ ఆ యువతి...
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఈమధ్య ‘ప్రేమ’ సరిహద్దులు దాటుతోంది. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తుల కోసం అన్నీ వదులుకొని, దేశాలు దాటేస్తున్నారు. తాజాగా ఓ యువతి కూడా అదే పని చేసింది. ఇంటర్నెట్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడ్డ ఆ యువతి.. అతనితో కలిసి జీవితం పంచుకోవడం కోసం దేశం దాటింది. తీరా అక్కడికి వెళ్లి చూశాక.. ఆ అమ్మాయికి ఊహించని షాక్ తగిలింది. తాను ఏదో అనుకొని అక్కడికి వెళ్తే.. ఇంకేదో జరిగిపోవడంతో ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలేం జరిగి ఉంటుందంటారు? పదండి, ఆ వివరాలు మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!
ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టిన్ అనే అమ్మాయి ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఈమెకు ఆన్‌లైన్‌లో న్యూజీలాండ్‌కి చెందిన జే అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతని ప్రొఫైల్‌లో ఉన్న హ్యాండ్సమ్ ఫోటోలు చూసి, క్రిస్టిన్ అతనికి ఫిదా అయ్యింది. తనకు బాగా నచ్చడంతో.. అతనితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అతడు మనసు దోచుకునేలా మాటలు మాట్లాడటంతో.. క్రిస్టిన్ అతనికి మనసు ఇచ్చేసింది. ఇలా ఆరు నెలల పాటు చాటింగ్ చేసుకున్న వీళ్లిద్దరు.. ఒకరోజు కలవాలని నిర్ణయించుకున్నారు. న్యూజీలాండ్‌లోని ఒక నైట్ క్లబ్‌లో కలుసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇలా ప్లాన్ వేసుకున్నాక.. ప్రియుడి కోసం ఆస్ట్రేలియా నుంచి న్యూజీలాండ్‌కి వెళ్లింది. అక్కడ నైట్ క్లబ్‌కి చేరుకొని, ప్రియుడి కోసం వెయిట్ చేయసాగింది. కానీ.. ఆ అబ్బాయి మాత్రం అక్కడికి రాలేదు. ఇక అప్పటి నుంచి మళ్లీ కాంటాక్ట్‌లో లేకుండా పోయాడు.
దీంతో ఖంగుతిన్న క్రిస్టిన్.. జే గురించి ఆరాతీయడం మొదలుపెట్టింది. ఎట్టకేలకు అతడు ఎక్కడుంటాడో తెలుసుకొని, అతని ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక ఆమెకు దిమ్మతిరిగింది. ఎందుకంటే.. ఆ అబ్బాయికి అప్పటికే ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంది. అంతేకాదు.. ఆమెతో పిల్లల్ని కూడా కన్నాడు. ‘‘నీకు ముందే పెళ్లయితే, నాతో ఎందుకు పులిహోర కలిపావ్?’’ అని నిలదీయగా.. అప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు తానెప్పుడు చాటింగే చేయలేదని, తన పేరు జే కూడా కాదని చెప్పాడు. జే పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్ కూడా తనది కాదని సమాధానమిచ్చాడు. అతడు చెప్పింది నిజమేనని నిర్ధారించుకొని, తనతో చాటింగ్ చేసిన వ్యక్తి ఎవరో వెతికే పనిలో నిమగ్నమైంది. ఎట్టకేలకు ఆ వ్యక్తిని వెతికి పట్టుకోగలిగింది. ఇదంతా ఒక అమ్మాయి ఆడిన డ్రామా అని తేలింది.
ఒక అమ్మాయివి అయ్యుండి.. అబ్బాయితో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఎందుకు ఇంత నాటకం ఆడావని ఆ యువతిని క్రిస్టిన్ ప్రశ్నించింది. తానొక స్కామర్ అని, కేవలం ఆట పట్టించడం కోసమే తాను ఈ పనికి పాల్పడ్డానంటూ ఆ యువతి సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంతో క్రిస్టిన్ తీవ్ర కోపాద్రిక్తురాలైంది కానీ, చివరికి ఆమెని క్షమించింది. అయితే.. ఇక్కడ క్రిస్టిన్ చేసిన తప్పేమిటంటే, నెట్టింట్లో ఆ ఫేక్ ప్రొఫైల్‌లో ఉన్న ఫోటోలని చూసి ఆమె మురిసిపోయిందే తప్ప, అది రియల్ ఐడీనా? కాదా? అని ఫోన్ చేసి నిర్ధారించుకోలేదు. కేవలం చాటింగ్‌తోనే కాలక్షేపం చేసింది. ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడినా, ఇతర మార్గంలో వివరాలు సేకరించి ఉన్నా.. ఇలా మోసపోయే పరిస్థితి వచ్చేది కాదు.