Bhagat Singh: భగత్ సింగ్ ను ఉరితీసిన తరువాత బ్రిటీషువారు చేసిందిదే.. మరీ ఇంత దారుణంగా మృతదేహాలను..
ABN , First Publish Date - 2023-03-23T12:33:41+05:30 IST
నాకూ జీవించాలనే సంకల్పం ఉంది, ఈ మాట చెప్పడానికి నేనేమీ సంకోచించను. కానీ ఉరి తప్పించుకోవాలనే దురాశ నాకు ఎంత మాత్రం లేదంటూ..
భగత్ సింగ్(Bhagat Singh) 24ఏళ్ళ వయసులో భారతదేశం కోసం వీర మరణం పొందిన విప్లవకారుడు. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే ఈయన నినాదం ఇప్పటికీ భారత స్వాతంత్ర్యంలో నిక్షిప్తమై ఉంది. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఊరితీయడం దానికి కారణం అందరికీ తెలుసు. కానీ వీరి జైలు జీవితం, వీరిని ఉరితీసిన తరువాత జరిగిన సంఘటనలు తెలిస్తే భారతీయుల గుండె బరువెక్కుతుంది. ఉరి తీసే సమయంలో భగత్ సింగ్ ఏం చెప్పాడు? నిర్ణీత సమయానికి ముందే ఎందుకు ఉరితీశారు? ఉరి తీసిన తరువాత వీరి మృతదేహాలను ఏం చేశారు? మొదలయిన విషయాలు తెలుసుకుంటే..
సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపి చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోషియేషన్(HRSA) లో సభ్యుడిగా చేరాడు భగత్ సింగ్. వేలాదిమంది యువకులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. లాలాలజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంతో మొదలైన భగత్ సింగ్ విప్లవం ఢిల్లీ అసెంబ్లీలో బాంబు పేళుళ్ళ(Delhi Assembly Bomb blast) వరకు సాగింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్(Bhagat Sing, Raj Guru, SukhDev) లతో సహా 14మందిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. అక్టోబర్ 7వ తేదీ మరణశిక్ష ప్రకటించారు.
మార్చి 24న తనను ఉరి తీస్తారనే విషయం భగత్ సింగ్ కు ముందే తెలుసు. ఆయన తనకు ఇష్టమైన ఆహారం ఇవ్వమని అడిగాడు. కానీ ఆ కోరిక కూడా అలాగే ఉండిపోయింది. భగత్ సింగ్ ను అనుకున్న సమయానికంటే ముందే ఉరితీయాలని ప్రజలను తప్పుదోవ పట్టించాలని బ్రిటీషు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచింది. భగత్ సింగ్ ను ఉరితీయడానికి రెండు గంటల ముందు కూడా 'లెనిన్ రివల్యూషనరీ' పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు. ఆ సమయంలో భగత్ సింగ్ తో దేశానికి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగితే 'సామ్రాజ్యవాదం తగ్గి విప్లవం కొనసాగాలి' అని పిలుపునిచ్చాడు. దీంతో పాటు నెహ్రూ, సుభాష్ బోస్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. 12గంటల ముందే ఉరి తీస్తున్నారని తెలియగానే లెనిన్ రివల్యూషనరీ పుస్తకంలో ఒక్క అధ్యాయం కూడా పూర్తీ చెయ్యడానికి నన్ను అనుమతించరా అని అడిగాడు.ఆయనకు ఆ పుస్తకం పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ మాటతో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన కోరిక వారు తీర్చలేదు.
ఉరి తీయడానికి వేదికపై నిలబడుకుని ఉన్నప్పుడు దేవుడిని తలచుకోమంటే.. 'ప్రజలకు కష్టాలు ఇస్తున్నందుకు నేను దేవుడిని చాలా సార్లు తిట్టుకున్నాను అలాంటిది ఇప్పుడెలా దేవుడిని స్మరిస్తాను' అని అన్నాడు. ఉరి తీసేముందు 'నన్ను యుద్దఖైదీలా చూడండి, దహనం చేసేముందు తుపాకీ కాల్పులు జరపండి' అని అడిగాడు. కానీ అలా చేయలేదు. బ్రిటీషు వారు ఈ ముగ్గురుని ఉరి తీసిన తరువాత వారిని ఉరి తాడు నుండి వేరు చేసి ఒక ట్రక్కులో పాత సామాన్లు విసిరేసినట్టు విచక్షణా రహితంగా పడేశారు. ఆ తరువాత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీస్తున్నారని బయటకు పొక్కింది. దీంతో పెద్ద ఎత్తున జైలు చుట్టూ ప్రజలు, విప్లవకారులు మోహరించారు. దీంతో భయపడిన బ్రిటీషువారు ముగ్గురి మృతదేహాలను జైలు వెనుక గోడలు పగులకొట్టి వెనుకదారి గుండా బయటకు తీసుకెళ్ళారు. రావి నది ఒడ్డుకు తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాలి, కానీ అక్కడ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సట్లెజ్ నదికి తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారం చెయ్యడానికి ప్రయత్నించారు. ఈవిషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున సట్లెజ్ నదితీరానికి చేరుకున్నారు. ప్రజలను చూసిన బ్రిటీషువారు మృతదేహాలు పూర్తిగా దహనం కాకమునుపే సగం సగం కాలిన మృతదేహాలను అలాగే వదిలిపెట్టి పారిపోయారు. తరువాత భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తీ చేశారు. 'నాకూ జీవించాలనే సంకల్పం ఉంది, ఈ మాట చెప్పడానికి నేనేమీ సంకోచించను. కానీ ఉరి తప్పించుకోవాలనే దురాశ నాకు ఎంత మాత్రం లేదు. నా చివరి క్షణాల కోసం ఎదురుచూస్తుంటాను' అని భగత్ సింగ్ తన జైలు జీవితం గడిపిన రోజుల్లో అన్న మాటలు భారతీయ హృదయాలను బరువెక్కిస్తూనే ఉంటాయి.