Book Review : కథ చదివితే, అందులో భావం అర్థమైతేనే లోతు తెలుస్తుంది..!
ABN , First Publish Date - 2023-02-24T14:13:03+05:30 IST
ఈ కథలన్నీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచనలతో, కొత్త ఒరవడితో సాగుతాయి.
కథ రాయడం అందరిచేతిలోనూ ఇమిడే కళ కాదు. రాయడం అనేది స్పందించే మనసుల్ని బట్టి ఉంటుంది. ఇప్పటి రచయితలకు ఆలోచనల్లోనూ, విషయాన్ని చెప్పే తీరులోనూ చాలా గాఢత ఉంటుంది. కొత్త రచయితలు కథలను చెప్పే తీరులో ఎవరో రచయితను అనుసరిస్తున్న ధోరణి తగ్గి, కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచనలతో, కొత్త ఒరవడితో సాగుతున్నాయి. రాయడం అందరిచేతా కాదనేది చెప్పుకున్నాం, మరి ఇప్పటి కాలంతో పరుగులు పెడుతూనే రాతలో కొత్తదనాన్ని చూపిస్తున్న యువ రచయితల్లో చరణ్ పరిమి ఒకరు. తన చుట్టూ ఉన్న ప్రపంచపు బతుకు చిత్రాలను పట్టుకుని, వాటికి కథలుగా సన్నివేశాల్లో ఇరికించి చూపిన తీరు పాఠకుడిని ఆసక్తిగా చదివించేలా చేస్తుంది.
జీవితానుభవాలను కథలుగా అల్లడం దానికి వాస్తవలోకానికి తర్జుమా చేయడం బహూశా ఇప్పటి వారికి అంత తేలికకాదు. కథ కథలోనూ వైవిధ్యం చూపుతూ రాయడం కూడా కష్టమే. కాలింగ్.. సప్తవర్ణం, అన్ ఆర్టిస్ట్ బయోగ్రఫీ, కేరాఫ్ బావర్చీ, ఏ డే డ్రీమ్, మనో గీతం కొన్ని అధ్యాయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథకూ వెనుక మసకబారిన జీవితం ఉంది. జీవితపు సంఘర్షణ ఉంది. ఈ కథలన్నీ ప్రేమ, విరహం, భక్తి, సేవ, త్యాగం, నిర్లక్ష్యం, పశ్చాత్తాపం ఇలా మనిషి జీవితకాలంలో ఎదురయ్యే ప్రతి ఫీలింగ్ వెనుక దాగున్న స్పందనలు. మంచి కథలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన కథకుడు చరణ్ పరిమి కలం కొత్త ఒరవడితో సాగిపోతున్నాయనేందుకు తన కథల్లోని సంభాషణలే చెపుతాయి.
"కేరాఫ్ బావర్చి" పుస్తకంలోని కొన్ని సంభాషణలు..
'కాలింగ్ సప్తవర్ణం' కథ నుంచి…
"మనసు ఫీనిక్స్ పక్షిలాంటిది. ప్రతి ఉదయం కొత్తగా ప్రేమించడం మొదలుపెడుతుంది. అలా రోజూ 40 ఏళ్ళ కుర్రాడు 35 ఏళ్ళ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. లంచ్‌కి రమ్మంటూ సైగ చేశాడు. ఆమె కళ్ళతో సరే అంది. భవిష్యత్తులో కాబోయే రచయిత ఇదంతా నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్ కిటికీలో నుంచి గమనిస్తున్నాడు. ఆ జంట రోజూ బైక్ మీద ఒకటిగా వస్తారు. కలిసి తింటారు. కలిసి పిల్లలకి ఆటపాటలు నేర్పిస్తారు. కొన్ని స్మృతుల మూటలతో తిరిగి వెళతారు. ప్రణయ జీవన సౌందర్య .”
'మనో గీతం - కొన్ని అధ్యాయాలు' కథ నుంచి..
కనీసం ఈరోజైనా కలవకపోతే తనకి నా మీద విరక్తి రావచ్చు. బ్యూలా.. తను చర్చ్ గేట్ దగ్గర నిలబడి ఎదురుచూస్తోంది. తొమ్మిదోసారైనా వస్తానేమో అని. నాకయితే తొమ్మిది నిమిషాలకే విసుగు మొదలవుతుంది. కానీ ఆమె మొహంలో వసంతకాలపు చిగురింత. ఏ వింత! చాలాసార్లు కలుస్తానని చెప్పడం. ఆమె నా కోసమే అన్నట్టు చెవులకి పెద్ద జూకాలు, పార్టీవేర్స్ తో, కళ్ళ జోడు లేకుండా, జుట్టు ముడేయకుండా వచ్చి చర్చ్‌లోనో, బయట పార్క్‌లోనో కూర్చుంటుంది. ఆ సమయంలో ఎన్ని విరహగీతాలో ఆమె గొంతులో, ప్రేమ.. అనేక మొహాల తాత్పర్యం. రెండు నీడల ఏకత్వం.
'బహుముఖాలు' కథ నుంచి…
‘వాళ్లు నన్నంటుకున్న రంగులే పోయాయనుకుంటున్నారు. ప్రేమ కూడా పోయింది. అది మాత్రమేనా, నా నుంచి చెప్పలేనివి ఎన్నో పోయాయి. ఒంటరితనం అనిపించినప్పుడు హత్తుకుని సాంత్వన ఇచ్చే మనిషితో పాటు’ ఏవో ఆలోచనలు.
Wings - Shadows కథ నుంచి…
‘జియా జలే జాన్్జలే, నైనోతలే దువాచలే, రాత్ బర్ దువా చలే…’ దిల్సే పాటకి డెమోలో శృంగార రసాన్ని ఒలకబోశారు జాక్సన్ అండ్ జ్యో. అప్పటినుంచీ అతనిలో తరచూ మృదుత్వం చూస్తోంది. అదామెకి నచ్చేసింది కూడా. ఆ డెమో పుణ్యం. ఒక్క సారిగా మూడు చిన్న సినిమాలు దొరికాయి. ఉప్పొంగింది జ్యో.. అతని గెలుపులో తానున్నందుకు.