Hippos: ఆ ఒక్క కారణంతో హిప్పోలను వదిలించుకుంటున్న కొలంబియా.. మనకూ ఓ 60 పంపేస్తోంది!

ABN , First Publish Date - 2023-03-03T16:57:06+05:30 IST

కొలంబియాను ఇప్పుడు నీటి ఏనుగులు(Hippopotamus) భయపెడుతున్నాయి.

Hippos: ఆ ఒక్క కారణంతో హిప్పోలను వదిలించుకుంటున్న కొలంబియా.. మనకూ ఓ 60 పంపేస్తోంది!

న్యూఢిల్లీ: కొలంబియాను ఇప్పుడు నీటి ఏనుగులు(Hippopotamus) భయపెడుతున్నాయి. దేశంలోకి అక్రమంగా వచ్చిన నాలుగు హిప్పోలు(Hippos) తమ సంతతిని పెంచుకోవడం ద్వారా పర్యావరణానికి పెను ముప్పుగా మారాయి. దీంతో వాటిని భారత్, మెక్సికో దేశాలకు తరలించాలని కొలంబియా నిర్ణయించింది. మొత్తం 72 నీటి ఏనుగుల్లో 60 హిప్పోలను భారత్‌కు పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా వాటికి ఎరవేసి పట్టుకునే పనిలో అధికారులు బిజీగా మారారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?

డ్రగ్ స్మగ్లర్ పాబ్లో ఎస్కోబార్(Pablo Escobar) 1980లలో ఆఫ్రికా నుంచి నాలుగు హిప్పోలను అక్రమంగా దిగుమతి చేసుకున్నాడు. 1993లో ఎస్కోబార్‌ను పోలీసులు హతమార్చడంతో అతడి హసీండా నెపోల్స్ ఫామ్‌‌హౌస్ నిరాదరణకు గురైంది. అటువైపు చూసే వారే కరువయ్యారు. ఫలితంగా అక్కడ పెరుగుతున్న నాలుగు హిప్పోలు అక్కడి నుంచి తప్పించుకున్నాయి.

పెరిగిపోయిన సంతతి.. పర్యావరణానికి ముప్పు

ఎస్కోబార్ హత్య తర్వాత అతడి ఫామ్ నుంచి తప్పించుకున్న నీటి ఏనుగులు పునరుత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు వీటినే అక్కడి నుంచి తరలించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇవి ఒక్కోటి మూడు టన్నుల వరకు ఉన్నాయి. సంతతిని పెంచుకున్న హిప్పోలు అక్కడి పర్యావరణ వ్యవస్థకు సవాలుగా మారాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి మలం సమీపంలోని నదులను కలుషితం చేస్తోంది. ఫలితంగా నీటి ఆవు (మనాటీ), కాపిబరాస్ (గినియా పందిని పోలి ఉండే క్షీరదం), ఇతర జంతువుల మనుగడ ప్రమాదంలో పడింది. 2020లో ఓ రైతు హిప్పో దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.

ఎలా తరలిస్తారంటే?

ఓ పొడవైన ఐరన్ కంటెయినర్‌లో హిప్పోలను ఆకర్షించే మేతను ఉంచడం ద్వారా అవి అందులోకి వెళ్లేలా చేస్తారు. హిప్పోలు అందులోకి చేరగానే బంధించి రియోనెగ్రో విమానాశ్రయానికి తరలిస్తారు. అక్కడి నుంచి దాదాపు 60 హిప్పోలను గుజరాత్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్‌డమ్‌కు తరలిస్తారు. మరో 10 హిప్పోలను మెక్సికోలోని వివిధ జూలు, అభయారణ్యాలకు తరలిస్తారు. రెండింటిని ఈక్వెడార్‌కు పంపుతారు.

Updated Date - 2023-03-03T17:28:25+05:30 IST