ChatGPT: చాట్‌జీపీటీ సాయంతో న్యాయమూర్తి తీర్పు..
ABN , First Publish Date - 2023-02-05T19:04:41+05:30 IST
ప్రపంచంలోనే తొలిసారిగా కొలంబియాలో ఓ న్యాయమూర్తి చాట్‌జీపీటీ సాయంతో తీర్పు వెలువరించారు.
ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ(ChatGPT).. టెక్ ప్రపంచంలో ఈ పేరు ఓ సంచలనం. ఇది కృత్రిమ మేథ ఆధారిత చాట్‌బాట్.. అంటే ఏ విషయాన్నైనా అరటిపండు వలిచి పెట్టినట్టు సింపుల్‌గా వివరించే అపర మేధావి. మనం ఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాధానం చెప్పేస్తుంది. ఏ సమాచారం కావాలన్న క్లుప్తంగా మనకు అర్థమ్యే సరళమైన భాషలో అందిస్తుంది. అందుకే.. ఇప్పుడు ప్రపంచమంతా చాట్జీపీటీవైపు మళ్లుతొంది. శాస్త్రవేత్తలు కూడా చాట్‌జీపీటీపై ఆధారపడుతుండటంతో ఇటీవల కొన్ని సైంటిఫిక్ జర్నల్‌లు చాట్‌జీపీటీ సాయంతో రూపొందించే పరిశోధన పత్రాలు ఆమోదించబోమని తేల్చి చెప్పాయి. ఇక చాట్‌జీపీటీ ప్రస్తుతం న్యాయనిపుణుల చూపు కూడా తనవైపు తిప్పుకుంది.
ప్రపంచంలోనే తొలిసారిగా కొలంబియాలో(Columbia) ఓ న్యాయమూర్తి చాట్‌జీపీటీ సాయంతో తీర్పు వెలువరించారు. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ఓ కేసలో జడ్జి మాన్యుయెల్ పడిల్లా గార్సియా(Juan Manuel Padilla Garcia) చాట్‌జీపీటీ సలహా తీసుకున్నారు. అది ఆటిజమ్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సంబంధించిన కేసు. ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆర్థికస్థితి అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో చిన్నారి మెడికల్ అపాయింట్మెంట్లు, చికిత్స, రవాణా ఫీజులను ఇన్సూరెన్స్ కంపెనీకి తిరస్కరించే హక్కుందా అన్న ప్రశ్న తలెత్తింది. దీంతో..ఆయన చాట్‌జీపీటీ సహాయం తీసుకున్నారు. పలు ప్రశ్నలు దాని ముందుంచారు.
కొలంబియా చట్టాల ప్రకారం ఆటిజమ్ వ్యాధి పడ్డ మైనర్లు తమ వైద్యానికయ్యే ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదని చాట్‌జీపీటీ చెప్పింది. చివరకు న్యాయమూర్తి బాలుడికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. అయితే.. ఓ న్యాయమూర్తి చాట్‌జీపీటీని ఆశ్రయించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. అయితే.. తాను కేవలం చాట్‌జీపీటీ అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకున్నానని ఆ జడ్జి స్పష్టం చేశారు. చాట్‌జీపీటీని ప్రశ్నలు అడిగినంత మాత్రాన న్యాయమూర్తులు ఆలోచించడం మానుకోరని అన్నారు. ఈ కేసులో తుది నిర్ణయం తనదేనని తేల్చి చెప్పారు. ఓ సెక్రెటరీ లాగా చాట్‌జీపీటీ క్రమబద్ధమైన సేవలు అందిస్తోందని అన్నారు. తద్వారా..న్యాయవ్యవస్థ ప్రజల అవసరాలకు మరింత వేగంగా స్పందిస్తుందని చెప్పుకొచ్చారు.