Gold Mines: 30 ఏళ్ల క్రితమే బయటపడిన బంగారపు నిధి.. ఇన్నేళ్ల తర్వాత తవ్వకానికి కోర్టులన్నీ గ్రీన్ సిగ్నల్.. ఏడాది తర్వాత..!
ABN , First Publish Date - 2023-10-03T22:06:14+05:30 IST
రాజస్థాన్‌లోని బాంస్వారా జిల్లాలో బంగారం తవ్వకాలను అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇది 30 ఏళ్ల నాటి మాట. అప్పట్లో ఆ ప్రాంతాన్ని అందరూ బంజరు భూమిగానే చూసేవారు. ఎందుకూ పనికిరాదని అనుకునే వారు. కానీ, అక్కడి భూమి పొరల్లో బంగారం కూడా ఉందని కొంత కాలం తరువాత తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. తమ తలరాతలు మారిపోనున్నాయని అనుకున్నారు. ఆ తరువాత ఈ ప్రాంతం కోర్టు వివాదాల్లో కూరుకుపోవడంతో మూడు దశాబ్దాల పాటు ఆ కల వాస్తవరూపం దాల్చేందకు వేచి చూడాల్సి వచ్చింది. కానీ, తాజాగా కోర్టు తీర్పుతో అడ్డంకులన్నీ తొలగిపోవడంతో అక్కడి వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది.
రాజస్థాన్‌లోని(Rajasthan) బాంస్వారా(Banswara) జిల్లా భుకియా జాగ్‌పురా ప్రాంతంలోని అత్యంత విలువైన బంగారు గనులు సుమారు ముప్ఫై ఏళ్ల క్రితం బయటపడ్డాయి. కానీ, అక్కడ మైనింగ్ మొదలయ్యేలోపే కోర్టుల్లో ఇక్కడి తవ్వకాలు చేపట్టకూడదంటూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా వాటికి మోక్షం లభించింది. అక్కడ నిరభ్యంతరంగా ఖనిజ తవ్వకాలు జరపొచ్చంటూ కోర్టు తాజాగా తీర్పు వెలువెరించింది. దీంతో, స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒక్కసారి అక్కడ ఖనిజాల తవ్వకాలు మొదలైతే ఏడాది తర్వాత తమ జీవితాలు గుర్తుపట్టలేనంతగా మారిపోతాయంటూ వారు సంబరపడిపోతున్నారు.
గతంలో జరిగిన సర్వే లెక్కల ప్రకారం, జిల్లాలోని 70 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ప్రాంతంలో బంగారు, కాపర్ గనులు(Gold, Copper mines) విస్తరించి ఉన్నాయి. మొత్తం 171 చోట్ల గొయ్యిలు తవ్విన అధికారులు అక్కడి భూమిపొరల్లో మొత్తం రూ.1.34 లక్షల కోట్ల విలువైన బంగారం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మరో రూ. 7.7 వేల కోట్ల విలువైన కాపర్ నిల్వలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. వీటితో పాటూ కోబాల్ట్, నికెల్ ఖనిజాలు కూడా దాగున్నట్టు పేర్కొన్నారు.
ఇక అక్కడ మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక తమ జీవితాలు మారిపోడానికి ఒక సంవత్సరం చాలని స్థానికులు నమ్మకంగా చెబుతున్నారు. మైనింగ్ కేంద్రంగా జరిగే వాణిజ్య వ్యాపార కార్యకలాపాలతో తమకు ఉపాధి అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయని చెబుతున్నారం. మైనింగ్ రంగంలో తమకు ఉపాధి కూడా దొరుకుతందని అక్కడి యువత సంబరపడిపోతోంది.