Airport: విమానాశ్రయాల్లో పెరిగిపోతున్న బ్యాగ్ రిజెక్షన్స్.. అసలు ఇంతకీ విదేశాలకు వెళ్తూ మనోళ్లు ఏమేం తీసుకెళ్తున్నారంటే..!
ABN , First Publish Date - 2023-09-26T16:04:53+05:30 IST
దేశంలో విమానప్రయాణాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విమానాశ్రయాల్లో రద్దీ ఎక్కువవుతోంది. అయితే, ప్రయాణికుల తాకిడి పెరగడంతో పాటూ ఓ వింత పరిణామం కూడా కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. నిషేధిత వస్తువుల కారణంగా ప్రయాణికుల లగేజీని అధికారులు విమానాల్లోకి అనుమతించట్లేదు. ఫలితంగా బ్యాగేజీ తిరస్కరణ రేటు పెరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ మధ్యతరగతి వారి కొనుగోలు శక్తి క్రమంగా పెరుగుతోంది. అనేక మంది దేశవిదేశాలకు పర్యటనలపై కూడా వెళుతున్నారు. ఈ క్రమంలో విమానప్రయాణాలూ (Air Travel) పెరుగుతున్నాయి. విమానాశ్రయాల్లో రద్దీ ఎక్కువవుతోంది. అయితే, ప్రయాణికుల తాకిడి పెరగడంతో పాటూ ఓ వింత పరిణామం కూడా కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. నిషేధిత వస్తువుల కారణంగా ప్రయాణికుల లగేజీని అధికారులు విమానాల్లోకి అనుమతించట్లేదు. ఫలితంగా బ్యాగేజీ తిరస్కరణ రేటు పెరుగుతోంది.
ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, కర్పూరం, లైటర్లను, ఈ సిగరెట్లు వంటి వాటిని లగేజీలో తెస్తుండటంతో వాటిని విమానాల్లోకి అనుమతించట్లేదని దేశంలోని ప్రముఖ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వారు చెబుతున్నారు. ఈ కారణంగా చెక్-ఇన్ లగేజీ తిరస్కరణ రేటు దాదాపు రెండింతలు పెరిగిందని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఇది 0.31 శాతం కాగా ఈ ఏడాది మే నెల కల్లా ఏకంగా 0.71 శాతానికి పెరిగిందంటున్నారు. విమానశ్రయ నిబంధనలను ప్రయాణికులు ఖాతరు చేయకపోవడంతో ఈ తిరస్కరణ రేటు(Baggage rejection rate) పెరుగుతోందని చెప్పుకొచ్చారు.
పండుగ సీజన్లలో ప్రయాణికులు తమ చెకిన్ లగేజీలో ఎండు కొబ్బరిచిప్పలు, నెయ్యి, కొబ్బరి నూనె, పచ్చళ్లు, అగరొత్తులు వంటి వాటిని తెచ్చుకుంటున్నారని ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానశ్రయం (CSMIA-Mumbai Airport) వారు చెబుతున్నారు. అయితే, పొవర్ బ్యాంకు, స్ప్రే, ఈ సిగరెట్, లైటర్ వంటివి తమ వెంట తీసుకెళ్లొచ్చని చెబుతున్నారు. ముంబై విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుండంతో అక్కడ అత్యాధుని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అక్కడి లగేజీ చెకింగ్ యంత్రం కేవలం 20 సెకెన్లలోనే ఒక బ్యాగును తనిఖీ చేయగలదని అధికారులు తెలిపారు. లగేజీ తిరస్కరణ రేటు పెరగడానికి ఇదీ ఓ కారణం కావచ్చని చెబుతున్నారు. కస్టమర్లకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఎయిర్‌పోర్టులో సౌకర్యాలు మెరుగుపరిచామని చెబుతున్నారు.
ముంబై విమానాశ్రయ వర్గాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో ప్రయాణికుల సంఖ్య 32 శాతం మేర పెరిగింది. ఇదే కాలంలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా 33 శాతం మేర పెరిగింది. ముంబై విమానాశ్రయం నుంచి వెళ్లేవారిలో అత్యధికులు దుబాయ్, లండన్, అబుదాభీకి వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. దేశీయంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నైకి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.