Share News

Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్

ABN , First Publish Date - 2023-11-16T16:34:20+05:30 IST

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో షమీ దూకుడుదు చూసి సంబరపడ్డ ఢిల్లీ, ముంబై పోలీసులు ‘ఎక్స్’ వేదికగా చేసిన ఫన్నీ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: మహ్మద్ షమీ(Mohammed Shami).. నిన్న దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరిది. ఏకంగా ఏడు వికెట్లతో సెమీస్‌లో న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించిన షమీని చూసి క్రికెట్ దేవుడు సచిన్(Sachin Tendulkar) కూడా ఫిదా అయిపోయాడు. అది సెమీ ఫైనల్ కాదు..కాదు షమీ-ఫైనల్ అంటూ మొత్తం మ్యాచ్‌ను షమీకి అంకితమిచ్చేశాడు. ఇలా భారత(India) క్రికెట్ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తిన షమీని అరెస్టు చేయవద్దంటూ ఢిల్లీ పోలీసులు(Delhi Police) ముంబై పోలీసులకు(Mumbai Police) విజ్ఞప్తి చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! నెటిజన్లు కూడా ఇలాగే ఆశ్చర్యపోవడంతో ఈ సంవాదం నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది.


ఇంతకీ జరిగిందేంటంటే.. నిన్న న్యూజిలాండ్‌పై(New Zealand) షమీ విరుచుకుపడ్డ తీరు చూసి అందరిలాగే ఢిల్లీ పోలీసులూ మురిసిపోయారు. ఆ తరువాత ఓ అడుగు మందుకేసి ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ సరదా ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు షమీ ‘దాడి’ చూసిన మీరు అతడిపై కేసు పెట్టరనే అనుకుంటున్నాం’’ అంటూ ముంబై పోలీసులపై పంచ్ వేశారు. ముంబై పోలీసులు కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. ‘‘షమీ అనేక హృదయాలను దోచేశాడు. కానీ మీరూ కేసు పెట్టడం మర్చిపోయారు. వారితో పాటూ మరో ఇద్దరు సహ నిందితులను(విరాట్, శ్రేయాస్ అయ్యర్) పక్కనపెట్టేశారు’’ అంటూ దీటుగా సమాధానమిచ్చారు.


పనిలో పనిగా జనాల మీద కూడా ముంబై పోలీసులు చిన్న సెటైర్ వదిలారు. తమ రెండు డిపార్ట్‌మెంటులకూ భారత శిక్షా స్మృతిపై పూర్తి అవగాహన ఉందని, ఈ సంవాదంలోని ఫన్నీ యాంగిల్ అర్థం చేసుకునే హస్యచతురత నెటిజన్లకూ ఉందని నమ్ముతున్నామంటూ చమత్కరించారు. దీంతో, ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. జనాలనూ నవ్వించాయి. ఇక నిన్నటి మ్యాచ్‌లో షమీ న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించడంతో పాటూ పలు రికార్డులు కూడా నెలకొల్పిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-16T16:39:25+05:30 IST