Phone Cover: తస్మాత్ జాగ్రత్త.. ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లు పెడితే.. అంతే సంగతులు

ABN , First Publish Date - 2023-08-19T17:52:10+05:30 IST

చాలామందికి తమ ఫోన్ కవర్లలో కరెన్సీ నోట్లు, ఏటీఎమ్ కార్డులు లేదా మందిపాటి పేపర్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఎక్కువగా కరెన్సీ నోట్లే పెడుతుంటారు. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమవుతాయనే ఉద్దేశంతోనే..

Phone Cover: తస్మాత్ జాగ్రత్త.. ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లు పెడితే.. అంతే సంగతులు

చాలామందికి తమ ఫోన్ కవర్లలో కరెన్సీ నోట్లు, ఏటీఎమ్ కార్డులు లేదా మందిపాటి పేపర్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఎక్కువగా కరెన్సీ నోట్లే పెడుతుంటారు. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమవుతాయనే ఉద్దేశంతోనే.. ఫోన్ కవర్‌లలో డబ్బులు దాచుతుంటారు. అయితే.. ఇలా చేయడం ఎంతో ప్రమాదకరం. మీ ఫోన్ బాంబ్‌లా పేలిపోవడమే కాదు, ప్రాణాలు పోయే అవకాశమూ ఉంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అదెలా అంటే..


ఈరోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరికీ ఎంత అవసరమైపోయింది. కొందరైతే ఫోన్‌ను నిరంతరం వినియోగిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఫోన్ క్రమంగా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన వెంటనే.. ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు కూడా చాలాసార్లు గమనించే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ కవర్‌లో కరెన్సీ నోటు ఉంటే.. ఆ వేడి ఫోన్ నుంచి బయటకు విడుదల అవ్వదు. మనం దుప్పటి కప్పుకొని ఆవిరి పడుతున్నప్పుడు ఎలా ఉంటుందో.. అలాంటి పరిస్థితినే ఫోన్ ఎదుర్కుంటుంది. ఫలితంగా.. ఫోన్ పేలిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందుకే.. ఫోన్‌కు బిగుతుగా ఉండే కవర్‌ను ఉపయోగించకుండా, వెనుక భాగంలో కాస్త గాలి ఆడే విధంగా కవర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు చెప్తుంటారు. లేదంటే.. ఫోన్ ‘ఢమాల్’మంటూ పేలిపోతుంది.

ఇక్కడ కరెన్సీ నోట్లు పెట్టొద్దని చెప్పడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. అదేమిటంటే.. కరెన్సీ నోట్లను తయారు చేసేందుకు కాగితంతో పాటు అనేక రకాల రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఫోన్ వేడెక్కినప్పుడు.. ఆ వేడి బయటకు వెలువడకుండా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డుపడుతుంది. అప్పుడు ఫోన్ లోపల వేడి ప్రభావం మరింత పెరిగి, ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణం చేతనే.. ఫోన్ కవర్‌లలో కరెన్సీ నోట్లు ఉంచకూడదని, అలాగే బిగుతుగా ఉన్న కవర్లను సైతం వినియోగించద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో.. చార్జింగ్‌లో పెట్టినప్పుడు కూడా ఫోన్‌ని వాడొద్దని చెప్తున్నారు. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త! కాస్త నిర్లక్ష్యం వహించినా.. ప్రాణాలకే ప్రమాదం.

Updated Date - 2023-08-19T17:52:10+05:30 IST