Metro: ప్రయాణికుడికి ఊహించని షాకిచ్చిన మెట్రో! అతడు చేసిన తప్పేంటంటే..
ABN , First Publish Date - 2023-10-08T20:04:26+05:30 IST
బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తూ ఆహారం తిన్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పోలీసులు అతడిపై రూ.500 జరిమానా విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో మెట్రో రైళ్లల్లో యువత అతి చేష్టలు మితిమీరిపోతున్నాయి. కొందరు డ్యాన్స్ చేస్తే, కొందరు కసరత్తులు చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా వింత చేష్టలకు దిగుతూ తమ పనులను వీడియోల్లో రికార్డు చేసుకుని నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. అనేక సందర్భాల్లో ఇది తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. అయితే, ఈ ధోరణితో విసిగిపోతున్న మెట్రో వర్గాలు కూడా నిబంధనలు అతిక్రమించే వారికి బుద్ధి చేప్పేందుకు రంగంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మెట్రో ప్రయాణికుడికి ఊహించని షాక్ తగిలింది.
బెంగళూరుకు చెందిన సునీల్ కుమార్ స్థానికంగా ఉన్న ఓ బంగారు నగల షాపులో పనిచేస్తుంటాడు. ప్రతిరోజు జయానగర్‌లో ఉన్న షాపునకు మెట్రోలోనే వెళుతుంటాడు. కాగా, కొన్ని రోజుల క్రితం అతడు మెట్రోలో ప్రయాణిస్తున్న సందర్భంలో అక్కడ తన వెంట తెచ్చుకున్న బాక్సులోని మంచూరియా తినడం ప్రారంభిస్తాడు. మెట్రోలో తినకూడదన్న నిబంధన గురించి అతడి స్నేహితులు చెప్పినా సునీల్ నిర్లక్ష్యంగా నవ్వుతూ మంచూరియాను ఎంజాయ్ చేశాడు. మరోవైపు, సునీల్ స్నేహితులు అతడికి నిబంధనల గురించి చెబుతూనే ఈ ఉదంతం మొత్తాన్ని రికార్డు చేశారు. ఆ తరువాత దాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో, సునీల్ ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు.
Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ
అయితే, అతడు మెట్రోలో ప్రయాణిస్తూ టిఫిన్ తింటున్న విషయం మెట్రో సిబ్బంది కంట కూడా పడింది. ఆ తరువాత విషయం పోలీసుల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం అతడు యథాప్రకారం తన స్నేహితులతో కలిసి మెట్రో రైలు ఎక్కాడు. కానీ, అతడు జయానగర్‌లో దిగగానే స్టేషన్‌లో భద్రతాసిబ్బంది ఎదురొచ్చారు. వీడియో విషయం చెప్పి అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ రూ.500 జరిమానా కట్టించుకుని, మరోసారి ఇలా చేయద్దంటూ వార్నింగ్ ఇచ్చి మరీ పంపించారు.
Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..
‘‘ఇది చాలా అరుదైన ఘటన. సాధారణంగా ప్రయాణికులు నిబంధనలకు కట్టుబడే ఉంటారు. ఇక మంగళవారం ఉదయం అతడు తన స్నేహితులతో కలిసి జయానగర్‌లో దిగగానే భద్రతా సిబ్బంది ఆ ముగ్గురినీ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతడిపై రూ.500 జరిమానా విధించి వదిలిపెట్టారు’’ అని మెట్రో అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.